గ్రేటర్ లో పాగా కోసం బీజేపీ అడుగులు.. అభ్యర్థుల ఎంపికపై కమలనాథుల కసరత్తు.. తొలి జాబితాపై నేతల కుస్తీ..
బల్దియా ఎన్నికలే లక్ష్యంగా అన్ని పార్టీలు కసరత్తు ముమ్మరం చేశారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి ధీటుగా పోరుకు సిద్దమవుతున్నారు.
బల్దియా ఎన్నికలే లక్ష్యంగా అన్ని పార్టీలు కసరత్తు ముమ్మరం చేశారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి ధీటుగా పోరుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే తొలి జాబితాను ప్రకటించి మంచి ఊపులో ఉన్న కాంగ్రెస్ గురువారం మరో జాబితా ను విడుదలకు రెఢీ అవుతోంది. మరోవైపు కమలనాథులు కూడా అభ్యర్థుల ఎంపికపై కుస్తీపడుతున్నారు.
మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి ఇంట్లో బీజేపీ ముఖ్యనేతలు సమావేశం అయ్యారు. గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాపై కసరత్తు చేస్తున్నారు. వివాదాలు ఉన్న వాటి జోలికిపోకుండా జాబితా సిద్ధం చేస్తున్నారు. టీఆర్ఎస్ విడుదల చేసే లిస్ట్ కోసం ఎదురు చూస్తున్న నేతలు.. ఆ లిస్ట్ వచ్చాకే తమ అభ్యర్థులను ప్రకటిస్తామని బీజేపీ నేతలు అంటున్నారు. మొదటి విడతలో 50 కంటే ఎక్కువ డివిజన్లకు అభ్యర్థులను ప్రకటించే అవకాశమున్నట్లు సమాచారం.
మరోవైపు బీజేపీ అసంతృప్తులకు పార్టీ నాయకత్వం గట్టి వార్నింగ్ ఇస్తోంది. పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది. పార్టీ కార్యాలయానికి వచ్చి హంగామా చేస్తే పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తామంటోంది. పార్టీ లైన్‌కు కట్టుబడి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని బీజేపీ నాయకత్వం ఆదేశించింది.
ఇదిలావుంటే, గ్రేటర్ లో మొదటి నుంచి మంచి పట్టు సాధించాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై ఫోకస్ చేసింది. ఇప్పటి వరకు జరిపిన సర్వేల్లో బీజేపీకి అనుకూల సంకేతాలు వచ్చాయని నేతలు చెబుతున్నారు. దీంతో కమలానికి గ్రేటర్ తిరుగులేదని కమలనాథులు భావిస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నం బీజేపీ మాత్రమే అంటూ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని భావిస్తున్నారు. అత్యధిక స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటాలని కమలం నేతలు పావులు కదుపుతున్నారు.