గ్రేటర్‌లో ఉచిత మంచినీటి పంపిణీ.. ఇవాళ శ్రీకారం చుట్టనున్న మంత్రి కేటీఆర్

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేసీఆర్‌ ఇచ్చిన ఉచిత మంచినీటి హామీని టీఆర్ఎస్ ప్రభుత్వం నేటి నుంచి అమలు చేస్తోంది.

గ్రేటర్‌లో ఉచిత మంచినీటి పంపిణీ.. ఇవాళ శ్రీకారం చుట్టనున్న మంత్రి కేటీఆర్
Follow us

|

Updated on: Jan 12, 2021 | 8:53 AM

Free drinking water programme : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నేటి నుంచి ఉచిత మంచినీటి పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేసీఆర్‌ ఇచ్చిన ఉచిత మంచినీటి హామీని టీఆర్ఎస్ ప్రభుత్వం నేటి నుంచి అమలు చేస్తోంది. ఈ పథకాన్ని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో లాంఛనంగా ప్రారంభిస్తారు. జూబ్లీహిల్స్‌లోని రహ్మత్‌నగర్ డివిజన్… ఎస్‌పీఆర్ హిల్స్‌లో ఈ కార్యక్రమాన్ని కేటీఆర్ శ్రీకారం చుట్టబోతున్నారు.

ఎన్నికల సందర్భంగా హామీ ఇవ్వాల్సి వచ్చినా నిజానికి ఈ పథకం అమలు అనేది తెలంగాణ ప్రభుత్వానికి అతి పెద్ద భారమే. తెలంగాణ మొత్తంలో నీటి వాడకం ఎక్కువగా ఉండేది జీహెచ్ఎంసీ పరిధిలోనే. జీహెచ్‌ఎంసీ పరిధిలో సుమారు 10 లక్షల నల్లా కనెక్షన్లు ఉన్నాయి. ఇప్పుడు వాటికి ఉచితంగా నీరు అందించడం కష్టమైన పనే. అయినప్పటికీ 20వేల లీటర్ల లోపు నీరు ఉచితంగా సరఫరా చేస్తామనీ కేసీఆర్ సర్కార్ హామీ ఇచ్చింది. డిసెంబర్ నెల నుంచి నెలవారీ బిల్లులు ఉండవనీ, గ్రేటర్ పరిధిలో ఉన్న నీటి కనెక్షన్లలో 90 శాతం కనెక్షన్లు ఉచిత నీటి పథకం పరిధిలోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది.

తెలంగామ జలమండలి విభాగం ఐదేళ్ల నుంచి ప్రతి నెలా 40 కోట్ల లోటు బడ్జెట్‌ ఉన్నా.. నగర ప్రజలకు తాగునీటి కష్టాలు లేకుండా సకాలంలో సరఫరా చేస్తోంది. బోర్డుకు నెలకు 160 కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా, ప్రస్తుతం 120 కోట్లు వసూలవుతున్నాయి. ఆ డబ్బుతో ఉద్యోగుల జీతభత్యాలు, నిర్వహణ చేస్తున్నారు. ఇప్పుడు ఈ భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడనుంది.

ఈ సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ పూర్తిగా నిండిపోయాయి. అందువల్ల రెండేళ్ల వరకు నీటి సరఫరాకి లోటు లేదు. కృష్ణా, గోదావరి నుంచి తరలించే నీటి సరఫరాను కొంత తగ్గించుకునే ఛాన్స్ కూడా ఉంది. మొత్తానికి ఇచ్చిన హామీ నెరవేర్చుతుంటే… హైదరాబాద్ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కేటగిరీల వారీగా గైడ్‌లైన్స్‌లను జారీ చేసిన సర్కారు ఇందుకు మీ సేవా కేంద్రాలు లేదా WWW.HMWSSB.COM వెబ్‌సైట్‌ను సంప్రదించి ఆయా నల్లాలకు మార్చి 31లోగా విధిగా నీటి మీటర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ఇందుకోసం జలమండలి ప్రత్యేకంగా ఏజెన్సీలను నియమించింది. అలా ఏర్పాటు చేసుకున్న వారికి 20 వేల లోపు నీటి వినియోగం ఉంటే నీటి సరఫరా ఉచితంగా అందించనుంది. ఉచిత మంచినీటి పథకం గురించి, అవసరమైన సేవలను అందించేందుకు వాటర్‌ బోర్డు కస్టమర్‌ రిలేషన్‌ షిప్‌ మేనేజ్‌మెంట్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. మేనేజ్‌మెంట్‌ వారు 155313 ఫోన్‌ నంబరులో అందుబాటులో ఉంటారు. ఆధార్‌ అనుసంధానం, మీటర్ల బిగింపు అనంతరం ఏప్రిల్‌ 1 తర్వాత నుంచి మంచినీటి బిల్లుల జారీ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 20వేల లోపు నీటి వినియోగం ఉన్న వారికే ఉచిత నీటి సరఫరా వర్తిస్తుందని జలమండలి స్పష్టం చేస్తోంది.

ఇదీ చదవండి…. ప్రయివేటు ట్రావెల్స్‌పై ఆర్టీఏ అధికారుల కొరడా.. పండుగ వేళ.. ప్రత్యేక బృందాల తనిఖీలు..