Telangana: అంత గుడ్డిగా ఎలా నమ్మావ్ భయ్యా.. ఈ కేటుగాళ్లు వేసిన ప్లాన్ చూస్తే దిమ్మతిరగాల్సిందే!
డబ్బు సంపాదించడానికి చెమటోడ్చాల్సిన అవసరం లేదనుకున్నారు.. ఒక్క డీల్‌తో లక్షలు వచ్చేస్తాయని కలలు కన్నారు. అసలు నోటుకు నకిలీ జతచేసి మార్కెట్‌లో కొత్త మోసానికి తెరలేపారు. అలా అని నకిలీ కరెన్సీ ఏమి ముద్రించలేదు. కానీ డబ్బు రెట్టింపు పేరుతో అమాయకులను బురిడీ కొట్టించారు.ఆసలు ఈ నకిలీ నోట్లతో ఈ ముఠా జనాలను ఎలా బురిడీ కొట్టించిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

కష్టపడకుండా డబ్బులు సంపాదిదామని ప్లాన్ వేసిన ఓ ముఠాకు ఊహించని పరిణామం ఎదురైంది. యాదాద్రి జిల్లా భువనగిరికి చెందిన ముదురుకోల ఏకాంబరం, ముదురుకోల దేవేందర్, హయతనగర్ కుంట్లూరుకు చెందిన మద్దిబోయిన నాగరాజు ముఠాగా ఏర్పడి ఈజీ మనీ కోసం ప్లాన్ వేశారు. నకిలీ కరెన్సీతో లక్షలు సంపాదిద్దామనుకుని స్కెచ్ వేశారు. ఇందు కోసం చిల్డ్రన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో చిన్న పిల్లలు ఆడుకునే కరెన్సీ నోట్లను కొనుగోలు చేశారు. తుర్కపల్లికి చెందిన ఓ వ్యక్తిని సంప్రదించి లక్ష రూపాయలు ఇస్తే రూ.2లక్షలు ఇస్తామని ముఠా ఆశ చూపారు. వారిని నమ్మిన సదరు వ్యక్తి మండలంలోని పల్లెపహాడ్ బస్జీ సమీపంలో వారికి లక్ష రూపాయల నగదును అప్పగించాడు.
ఇక ముఠా ఇచ్చిన బ్యాగుల్లో కట్టల కొద్దీ రూ.500 నోట్లు తీసుకున్న.. సదురు వ్యక్తి వాటిని మార్కెట్లో చలామణి చేసేందుకు రెడీ అయ్యాడు. వాటిని తీసుకొని ఇంటికెళ్లాడు. అక్కడికెళ్లాక బ్యాగుల్లోని కరెన్సీ నోట్లను చూసి ఒక్కసారిగా కంగుతిన్నాడు. పైన కింద మాత్రమే అసలైన రూ.500 నోట్లు ఉంచి మధ్యలో చిల్డ్రన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెసిమేన్ అని ఇంగ్లీష్ లో ముద్రించిన పిల్లల ఆట కరెన్సీ నోట్లు ఉన్నట్టు గుర్తించాడు. ఇక మోసపోయానని గ్రహించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ ముఠాకు వల పన్ని చెక్ పెట్టారు.
అమాయక ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేయడంతో పాటు 16 కట్టల రూ.500 ల పిల్లల ఆట కరెన్సీ నోట్లు , రూ.10వేల నగదు, మొబైల్ ఫోన్లు, బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నామని తుర్కపల్లి పోలీసులు తెలిపారు. గతంలో ముదురుకోల ఏకాంబరం పలు నకిలీ కరెన్సీ కేసుల్లో నిందితుడని పోలీసులు తెలిపారు. కరెన్సీ నోట్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ పోలీసులు సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
