AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: హైదరాబాద్-బెంగళూరు.. బుల్లెట్ ట్రైన్ వెళ్లేది ఈ రూట్‌లోనే.. స్టేషన్‌లు ఎక్కడెక్కడ రాబోతున్నాయంటే?

తెలంగాణలో హైస్పీడ్ రైలు ప్రాజెక్టులు, వరంగల్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం పనులకు వేగవంతం చేయాలని తాజాగా జరిగిన సమావేశంతో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. బుల్లెట్ ట్రైన్ కారిడార్లను రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, పర్యాటక రంగానికి దోహదపడేలా రూపొందించాలని ఆదేశించారు. శంషాబాద్‌ను బుల్లెట్ ట్రైన్ హబ్‌గా, వరంగల్ ఎయిర్‌పోర్టును కాకతీయ శిల్పకళతో అలంకరించాలని సూచించారు. ఈ ప్రాజెక్టులు రవాణా వ్యవస్థను ఆధునీకరించి, తెలంగాణా సమగ్రాభివృద్ధికి తోడ్పడతాయి సీఎం రేవంత్ అన్నారు.

Telangana: హైదరాబాద్-బెంగళూరు.. బుల్లెట్ ట్రైన్ వెళ్లేది ఈ రూట్‌లోనే.. స్టేషన్‌లు ఎక్కడెక్కడ రాబోతున్నాయంటే?
Hyderabad Bullet Train
Prabhakar M
| Edited By: |

Updated on: Jun 17, 2026 | 10:01 AM

Share

హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణలో ప్రతిపాదిత హైస్పీడ్ రైలు ప్రాజెక్టులకు వేగం పెరుగుతోంది. బుల్లెట్ ట్రైన్ కారిడార్లు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, పర్యాటక రంగానికి దోహదపడేలా రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శంషాబాద్‌ను బుల్లెట్ ట్రైన్ హబ్‌గా అభివృద్ధి చేయాలని సూచించారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ సంస్థలోని బోధి పెవిలియన్‌లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు, వరంగల్ విమానాశ్రయ అభివృద్ధి పనులపై సీఎం అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం స్పష్టం చేశారు.

అనంతగిరిలో ప్రత్యేక స్టేషన్

హైదరాబాద్-పుణే హైస్పీడ్ రైలు మార్గంలో వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండల సమీపంలో ప్రత్యేక స్టేషన్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. అక్కడి నుంచి హైదరాబాద్ ఐటీ హబ్‌కు వేగవంతమైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.

ఫ్యూచర్ సిటీలో ప్రధాన స్టేషన్‌

హైదరాబాద్-బెంగళూరు బుల్లెట్ ట్రైన్ కారిడార్‌లో భాగంగా భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రధాన స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే నల్లమల అటవీ ప్రాంతానికి ప్రవేశ ద్వారంగా ఉన్న మన్ననూర్ సమీపంలో ఒక స్టేషన్, కృష్ణా నది బ్యాక్‌వాటర్స్ అందాలకు ప్రసిద్ధి చెందిన సోమశిల ప్రాంతానికి మరో స్టేషన్ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఈ స్టేషన్లు పర్యాటకాభివృద్ధికి దోహదపడతాయని అభిప్రాయపడ్డారు.

కొత్త ఎయిర్‌పోర్టులో కాకతీయ శిల్పకల

మరోవైపు వరంగల్ విమానాశ్రయం నిర్మాణంలో కాకతీయ సామ్రాజ్య వైభవం ప్రతిబింబించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. విమానాశ్రయం ముఖద్వారం వద్ద భారీ ఐలాండ్ ఏర్పాటు చేసి, రాణి రుద్రమదేవి, రుద్రదేవుడి విగ్రహాలతో పాటు కాకతీయ శిల్పకళకు ప్రతీకగా నిలిచే భారీ నంది విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వరంగల్ చారిత్రక నగరంగా ఉన్న ప్రత్యేకతను ప్రతిబింబించేలా ఎయిర్‌పోర్టు డిజైన్లు ఉండాలని స్పష్టం చేసిన సీఎం.. ఈ ప్రతిపాదనలకు సంబంధించిన అంశాలపై వెంటనే ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో చర్చలు జరిపి పనులను వేగవంతం చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

తెలంగాణలో రవాణా వ్యవస్థను ఆధునీకరించడంతో పాటు పర్యాటకం, ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా ఈ ప్రాజెక్టులు ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. శంషాబాద్‌ను బుల్లెట్ ట్రైన్ హబ్‌గా, వరంగల్‌ను కాకతీయ వారసత్వానికి ప్రతీకగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us