కవ్వింపులకు పాల్పడుతున్న చైనా..!

గాల్వన్ నదీ ప్రవాహానికి అడ్డుతగిలే విధంగా చైనా కుట్రలు పన్నుతూనే ఉంది. లడఖ్ ఈశాన్య ప్రాంతంలో దాడికి పక్కా ప్రణాళికతో దాడులకు పాల్పడ్డట్లు ఉపగ్రహా చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి.

కవ్వింపులకు పాల్పడుతున్న చైనా..!
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jun 19, 2020 | 3:58 PM

చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుందామంటూనే జిత్తుల మారి నక్క చైనా భారత్ పై దాడికి తెగబడుతోంది. పలు దఫాలుగా చర్చలు జరుగుతున్న సమయంలోనే గాల్వాన్ నదీ ప్రాంతంలో 20 మంది భారత జవాన్లను పొట్టనపెట్టుకుంది. లడఖ్ ఈశాన్య ప్రాంతంలో దాడికి పక్కా ప్రణాళికతో దాడులకు పాల్పడ్డట్లు ఉపగ్రహా చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. గాల్వన్ నదీ ప్రవాహానికి అడ్డుతగిలే విధంగా చైనా కుట్రలు పన్నుతూనే ఉంది.

వందలాది బుల్డోజర్లను ఈ ప్రాంతానికి తరలించి భయానక వాతావరణాన్ని సృష్టించింది. బుల్డోజర్లను గాల్వన్ నది వెంబడి కిలోమీటర్ల పొడవునా మోహరించినట్లు తెలుపుతున్న ఉపగ్రహా ఛాయాచిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. అంతేకాకుండా ఆ ప్రాంతంలో వందలాది సైనిక వాహనాలు కూడా మోహరించినట్లు తెలుస్తోంది. సరిహద్దు ఘర్షణల అనంతరం బుధవారం మేజర్ జనరల్ స్థాయి అధికారులు చైనా అధికారులతో చర్చలు జరిపినా ఫలితం లేకుండాపోయింది. భారత విదేశాంగ మంత్రి జైశంకర్, చైనా విదేశాంగ మంత్రితో కూడా ఫోన్లో చర్చలు జరిపారు. చైనా దాడులపై తీవ్ర నిరసన తెలిపారు. ఇలాంటి ఘటనలను సహించబోమని స్పష్టం చేశారు.

అయినప్పటికీ చైనా తన వక్రబుద్ధిని మార్చుకోలేదు. గురువారం సరిహద్దు వెంబడి, గాల్వన్ లోయ సమీపం వరకు చైనా దళాలు భారీ ఎత్తున మోహరిస్తున్నాయి. ఓవైపు చర్చలంటూనే చైనా ఇలాంటి కుట్రలకు దిగుతోంది. చైనా చర్యలను గమనించిన భారత్ కూడా సరిహద్దు వెంబడి సైన్యాన్ని పెద్ద ఎత్తున మోహరించింది. ఒక వేళ చైనా దాడికి దిగితే తగినవిధంగా బుద్ది చెప్పేందుకు సిద్ధమైంది. భారత్-చైనా సరిహద్దు వాస్తవాధీన రేఖతోపాటు సముద్ర తీరాల వెంబడి కూడా భారత్ నిఘాను పెంచింది. వాస్తవాధీన రేఖ వెంబడి భారత బలగాలతోపాటు సైనిక వాహనాలను కూడా మోహరించింది. ఒకవేళ చైనా దాడులకు దిగితే ధీటైన సమాధానం చెప్పేందుకు భారత సైనిక దళాలు సిద్ధంగా ఉన్నాయి. భారత్ శాంతినే కోరుకుంటుందని, చైనాకి సరియైన సమయంలో సరియైన విధంగా బుద్ధి చెబుతామని భారత్ ప్రధాని నరేంద్రమోదీ ఇప్పటికే స్పష్టం చేశారు.