ఏపీ పంట నష్టంపై అంచనాకు కేంద్ర బృందం పర్యటన

ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలతో నష్టపోయిన ప్రాంతాల్లో కేంద్రం బృందం పర్యటిస్తోంది.

ఏపీ పంట నష్టంపై అంచనాకు కేంద్ర బృందం పర్యటన
Follow us

|

Updated on: Nov 09, 2020 | 8:05 PM

ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలతో నష్టపోయిన ప్రాంతాల్లో కేంద్రం బృందం పర్యటిస్తోంది. రాష్ట్రంలో ఇటీవల భారీ వర్షాల కారణంగా సంభవించిన నష్టాలపై సమీక్షించేందుకు గాను రెండు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర బృందం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో సమావేశమయ్యారు. ఆ తర్వాత క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లారు.. ప్రత్యేక హెలికాప్టర్‌లో అనంతపురం జిల్లాకు చేరుకున్న కేంద్రం బృందం వజ్రకరూర్ లోని జిల్లా పరిషత్ హై స్కూల్‌లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను పరిశీలించారు.

అనంతపురం జిల్లాలోని ఉరవకొండ, గుంతకల్ నియోజకవర్గాలలో పర్యటించిన కేంద్ర బృందం పంటలను పరిశీలించారు. నష్టపోయిన రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వజ్రకరూర్ లో ఏర్పాటు చేసిన ఫోటోఎగ్జిబిషన్‌లో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు కమిటీ సభ్యులకు జిల్లాలోని ప్రధాన పంటలు, నష్టపోయిన అంశాల గురించి వివరించారు.

అంతకుముందు వివిధ శాఖల అధికారులు విడివిడిగా వరద నష్టంపై కేంద్ర బృందానికి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. భారీ వరదల కారణంగా రాష్ట్రంలో 6,368 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అధికారులు కేంద్ర బృందానికి నివేదిక ఇచ్చారు. భారీ వర్షాల ధాటికి రాష్ట్ర వ్యాప్తంగా 2లక్షల 12వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని వివరించారు. దాదాపు 24వేల 515 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బ తిన్నాయన్నారు. రాష్ట్రంలో 5వేల 583 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. తాత్కాలిక పునరుద్ధరణ చర్యలకు గాను తక్షణమే 840 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. శాశ్వత పునరుద్ధరణ చర్యలకు రూ.4,439 కోట్ల రూపాయలు అవసరం అవుతాయన్నారు. తడిసిన, రంగు మారిన ధాన్యం కొనుగోలుకు కేంద్రం సడలింపులు ఇవ్వాలని ఆమె అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలతో ఆస్తి, ప్రాణ నష్టాన్ని తగ్గించామని తెలిపారు.