Telangana News: కూర్చున్న వ్యక్తి కూర్చున్నట్టే అనంత లోకాలకు.. 24 గంటలు మృతదేహం అలానే ఉంది
దూరం నుంచి చూస్తే.. ఎవరో వ్యక్తి అక్కడ కూర్చున్నాడు అనుకుంటారు. దగ్గరికి వెళ్లి చూస్తే గానీ అతడు చనిపోయినట్లు తెలీదు. అవును.. కూర్చున్న వ్యక్తి....
దూరం నుంచి చూస్తే.. ఎవరో వ్యక్తి అక్కడ కూర్చున్నాడు అనుకుంటారు. దగ్గరికి వెళ్లి చూస్తే గానీ అతడు చనిపోయినట్లు తెలీదు. అవును.. కూర్చున్న వ్యక్తి కూర్చున్నట్టే.. తింటున్న వ్యక్తి తింటున్నట్లే ప్రాణాలు కోల్పోయారు అనే మాటలు మనం పెద్దలు చెబుతూ ఉంటే వింటూ ఉంటాం. తాజాగా అలాగే ఒక వ్యక్తి అలానే ప్రాణాలు విడిచాడు. బన్ తినేందుకు దాని మీద పెట్టిన చేయి అలానే ఉండగా.. కూర్చున్న చోటే నోట్లో నుంచి రక్తం కారుతూ చనిపోయాడు. ఈ విషయం బంధువులకు తెలిసేసరికి దాదాపు ఒకరోజు గడిచిపోయింది. అప్పటికి అదే స్థితిలో అతడి డెడ్ బాడీ బలంగా బిగుసుకుపోయి ఉంది. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం దండుపల్లికి చెందిన కాసాల సాయిలు(46).. తెలంగాణలోని మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పాలట గ్రామంలో బంధువు అంత్యక్రియలకు గురువారం మధ్యాహ్నం వెళ్లాడు. అదే రోజు తూప్రాన్ మీదుగా స్వగ్రామానికి బయలుదేరి, తూప్రాన్ పురపాలిక పరిధి అల్లాపూర్ వద్ద లిక్కర్ తాగేందుకు ఆగాడు.
మద్యం, ఆహారం తెచ్చుకొని తూప్రాన్-గజ్వేల్ రోడ్ పక్కన నిర్మానుష్య ప్రదేశంలో కూర్చుని.. తినడానికి చేతిని ఆహారంలో పెట్టి హార్ట్ అటాక్ కారణంగా సాయిలు అలానే చనిపోయాడు. ఎంతసేపైనా అతను ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు శుక్రవారం.. పోలీసులకు కంప్లైంట్ చేశారు. పోలీసులు, కుటుంబ సభ్యులు సెల్ ఫోన్ సిగ్నల్ సాయంతో వెతకగా సాయిలు మృతదేహం కనిపించింది. వ్యవసాయం చేసుకునే సాయిలుకు పిల్లలు లేరు. ఈ ఘటనపై తూప్రాన్ సామాజిక ఆరోగ్య కేంద్రం పర్యవేక్షకుడు అమర్‌సింగ్ మాట్లాడుతూ.. సైలెంట్ మయోకార్డియల్ ఇన్‌ఫార్‌క్షన్ వల్ల గుండెపోటు వచ్చి ఉంటుందని.. దీంతో నొప్పి, ఆనవాళ్లు తెలియకుండా ప్రాణాలు పోతాయని తెలిపారు.
Also Read: చెట్టుకు ఉన్న ఒక్క ఆకుతో సుందరమైన గూడు నిర్మించిన పక్షి.. చూస్తే వావ్ అంటారు..