కామారెడ్డి జిల్లాలో హృదయవిదాకర ఘటన.. భార్య మృతదేహన్ని భుజంపై మోసుకొని వెళ్లి అంత్యక్రియలు
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి మనుషుల మధ్య దూరంతో పాటు మానవత్వాన్ని దూరం చేసింది. బంధాలు, అనుబంధాలను దరి చేరనివ్వడంలేదు.
Wife’s dead body on man shoulder: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి మనుషుల మధ్య దూరంతో పాటు మానవత్వాన్ని దూరం చేసింది. బంధాలు, అనుబంధాలను దరి చేరనివ్వడంలేదు. మనుషుల్లో మరింత అంతరాన్ని పెంచుతోంది. ఎలాంటి జబ్బుతో బాధపడుతున్నా.. కరోనా అనే భయంతో కనీసం కన్నేత్తి చూసే పరిస్థితి లేకుండా పోయింది. తెలంగాణలో జరిగిన హృదవిదాకర ఘటన ఇందుకు తార్కాణంగా నిలుస్తోంది.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్‌లో భిక్షాటన చేసుకునే నాగలక్ష్మి అనే యాచకురాలు ఆదివారం సాయంత్రం స్టేషన్ ఆవరణలో మృతి చెందింది. అయితే, ఆమె కరోనాతో మృతి చెంది ఉంటుందని ఎవరు మృతదేహం వద్దకు వెళ్లలేరు. కనీసం మృతదేహన్ని స్మశాన వాటికకు తరలించేందుకు ఎవరు సహకరించలేదు. ఆటో వాళ్లు సైతం ఎవరు ముందుకు రాలేదు. దీంతో చేసేదీలేక నాగమణి మృతదేహన్ని భర్త స్వామి తన భుజాలపై వేసుకుని సుమారు కిలోమీటర్ దూరంలో ఉన్న ఇందిరానగర్ స్మశాన వాటికకు వెళ్లి అంత్యక్రియలు నిర్వహించాడు. అంత్యక్రియలు నిర్వహించేందుకు డబ్బులు లేక మధ్యమధ్యలో మృతదేహాన్ని కింద ఉంచి భిక్షాటన చేసుకుంటూ వెళ్లాడు. కాగా, నాగమణి అంత్యక్రియల నిమిత్తం మృతురాలి భర్త స్వామికి రైల్వే పోలీసులు రూ.2,500 విరాళాలు సేకరించి ఇచ్చారు.