Traffic Rule: ఈ ట్రాఫిక్ చలాన్ కట్ చేస్తే భారీ ఫైన్ కట్టాల్సిందే.. లేకుంటే మూడేళ్లు జైలుకు వెళ్లాల్సిందే.. అసలు ఈ రూల్స్ ఏంటంటే..
లైసెన్స్ లేకున్నా, హెల్మెట్ లేకున్నా, కారులో సీటు బెల్ట్ పెట్టుకోకున్నా, మితి మీరిన వేగంతో దూసుకెళ్లినా, నో పార్కింగ్ జోన్‌లో వాహనాలు నిలిపినా.. జరిమానాలు విధించారు ట్రాఫిక్ పోలీసులు. ఇవన్నీ కావు మరో చట్టంలో మరో రూల్ ఉంది. అదేంటో తెలిస్తే..

అది పల్లెటూరు అయినా.. నగరమైనా సరే ఈ రోజుల్లో టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ అనే హాబీ చిన్నప్పటి నుంచి మొదలవుతుంది. మీ ఇంట్లో వాహనం ఉన్నప్పుడు ఇలాంటి సమస్య ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు తల్లిదండ్రులు తమ పిల్లలకు యుక్తవయస్సు రాకముందే వాహనం నేర్పడం మనం చాలా సార్లు చూస్తుంటాం. ఇది చట్టం ప్రకారం తప్పు మాత్రమే కాదు బాధ్యతారాహిత్యం కూడా.. ఎందుకంటే ఇలా నేర్పించిన తల్లిదండ్రులు.. ఆ తర్వాత ఏదైన అవసరం కోసం కానీ అలా తిరిగి రావడానికి తమ వాహనాలను ఇస్తుంటారు. ఏమైవుతందిలే.. డ్రైవ్ చేయడం వస్తుందిగా అని ధీమాగా ఉంటారు. ఇది ధీమా కాదు నేరం, జరగబోయే అనర్థాన్ని ముందుగా ఊహించరు తల్లిదండ్రులు. మైనర్ పిల్లవాడు వాహనం నడుపుతూ ప్రమాదాన్ని గురవుతే.. ఏ దైనా యాక్సిడెంట్ జరిగితే.. తర్వాత చింతించాల్సింది వారే.. ఈ విషయం తెలిసి కూడా వారికి నేర్పిస్తారు.. నడపమంటూ ప్రోత్సహిస్తారు. ఇలా చేయడం చట్ట ప్రకారం నేరం. ఆ మైనర్ వాహనం నడుపుతూ పట్టుబడితే భారీ చలాన్‌తోపాటు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది.
బైకులు, కార్లు నడుపుతున్న యువకులు, మైనర్లు కొంతమంది తల్లిదండ్రులతో పోట్లాడి ద్విచక్రవాహనాలను కొనాలంటూ ఒత్తిడి తెస్తుంటారు. తాము కాలేజీకి బస్సులో వెళ్తున్నామని.. స్నేహితులంతా బైకుల్లో వస్తుండటంతో తమ పరువు పోతోందని ఇంట్లో గోల పెడుతున్నవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది.
ఎంత వరకు ఫైన్ పడొచ్చంటే..
18 ఏళ్లు నిండని పిల్లలు ఎవరైనా వాహనం నడుపుతూ పట్టుబడి.. చట్టం ప్రకారం వారిపై అధికారులు చర్యలు తీసుకుంటారు. మైనర్ వ్యక్తులు లెర్నింగ్ లైసెన్స్ లేకుంటే, మోటారు వాహనాల చట్టం, 1988లోని సెక్షన్ 199A ప్రకారం వాహనం ఎవరి పేరు మీద రిజిస్టర్ చేయబడిందో వారికి రూ. 25,000 వరకు జరిమానా పడుతుంది. జరిమానాతోపాటు జైలు శిక్ష విధించబడుతుంది. జైలు శిక్ష 3 సంవత్సరాలపాటు శిక్ష విధించే రూల్ కూడా ఉంది.
