Wines Flexi: వైన్స్ షాపు ముందు బాకీదారుల పేర్లతో ఫ్లెక్సీ.. బిత్తరపోతున్న మందుబాబులు.. ఇదెక్కడంటే..?
మద్యం షాపు బకాయిలు వసూలు కాకపోవడంతో వినూత్న రాబట్టేందుకు ఫ్లాన్ చేసింది యాజమాన్యం.
Flexi with debtors names: మద్యం షాపు బకాయిలు వసూలు కాకపోవడంతో వినూత్న రాబట్టేందుకు ఫ్లాన్ చేసింది యాజమాన్యం. నూతన మద్యం టెండర్లలో మద్యం షాపు రాకపోవడంతో గతంలో ఉన్న మద్యం షాప్‌కు సంబంధించిన బకాయిలను వసూలు చేసుకునేందుకు షాపు యాజమాని సిద్ధమయ్యాడు. సుమారు ఎనిమిది లక్షల రూపాయల వరకు మద్యం తీసుకున్న మందుబాబులు వైన్స్ షాపునకు బాకీ పడ్డారు. బాకీలు ఉన్న వ్యక్తులను తిరిగి చెల్లించమన్నందుకు వారు సెల్‌ఫోన్ స్విచ్ఛాప్ చేసి మొహం చాటేయడంతో వైన్స్ షాపు యాజమాని బిత్తరపోయాడు. వారికి వార్నింగ్ పేరుతో ఫ్లెక్సీ కట్టేందుకు రెడీ అయ్యాడు. ఈ క్రమంలో నవంబర్ 29 సాయంత్రం 5 గంటల వరకు బాకీ చెల్లించని వారి పేర్లతో ఫ్లెక్సీ వేస్తానని, షాపు ఎదుట ఫ్లెక్సీ కట్టి తమ ఆవేదన వ్యక్తం చేస్తానని ప్రకటించాడు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామానికి చెందిన ఆందోల్ మాత యాజమాన్యం ఇందుకు పూనుకుంది.
రెండున్నర సంవత్సరాల నుండి దండు మల్కాపురం గ్రామంలో ఆందోలు మాత వైన్స్ నడుపుతున్నామని నిర్వహకులు తెలిపారు. ఇక్కడికి వచ్చే వినియోగదారులు సుమారు ఎనిమిది లక్షల రూపాయల వరకు బాకీ పెట్టి మద్యం తీసుకెళ్లారు. ఒక సంవత్సరం నుండి వారిని తిరిగి అడగగా ఫోన్ కాల్ చేసిన ఎత్తకపోవడం, మొహం చాటేయడంతో బిజినెస్ నడిపేందుకు ఇబ్బందులు పడాల్సి వచ్చిందని నిర్వహకులు తెలిపారు. అయితే, ఈ సంవత్సరం మా షాప్ టెండర్లలో దక్కకపోవడంతో యజమానికి లెక్కలు చూపించడంతో ఎనిమిది లక్షల రూపాయలు బాకీలు తేలాయి. ఎలాగైనా మందుబాబుల నుంచి బకాయిలు వసూలు చేసుకునేందుకు వినూత్నంగా అలోచన చేశారు. సోమవారం సాయంత్రం వరకు ఇవ్వకపోతే వారి పేర్లతో సహా ఫ్లెక్సీ వేస్తానని షాపు ముందు ఫ్లెక్సీ పెడ్తానని షాప్ నిర్వహకులు తెలిపారు. ఇందులో ప్రముఖులతో పాటు రాజకీయ నాయకుల పేర్లు కూడా ఉన్నట్లు సమాచారం. తనకు వచ్చే బాకీ నగదు చెల్లించాలని మీడియా సోషల్ మీడియా ద్వారా వేడుకుంటున్నారు వైన్స్ షాపు సిబ్బంది.