పిల్లల పెంపకంలో తప్పకుండా పాటించాల్సినవి ఇవే..! ఎంత ముఖ్యమో తెలుసా..?
పిల్లలు ఎలా పెరుగుతారో వారు ఎటువంటి వ్యక్తిగా మారతారో అన్నదానిపై తల్లిదండ్రుల పాత్ర ఎంతో ముఖ్యమైనది. పిల్లల భవిష్యత్తు బాగుండాలని ప్రతి తల్లిదండ్రి కోరుకుంటారు. కానీ వారితో ఎలా ప్రవర్తించాలో, వారికి ఏం చెప్పాలో, ఏం చేయాలో స్పష్టంగా తెలియక కొంత మంది తల్లిదండ్రులు సందిగ్ధతకు గురవుతుంటారు. పిల్లల ఎదుగుదల కోసం తల్లిదండ్రులు పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

పిల్లలు ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనుకుంటారు. వారు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి.. వారి మాటలు శ్రద్ధగా వినడానికి తల్లిదండ్రులు కొంత సమయం కేటాయించాలి. ఇలా చేస్తే పిల్లలు మనపై నమ్మకం పెంచుకుంటారు. మనం వారికి ప్రాధాన్యత ఇస్తున్నామన్న భావన వారిలో నమ్మకాన్ని కలిగిస్తుంది.
పిల్లలు ఏదో ఒక విషయం పట్ల ఆసక్తిగా ఉంటారు. కొందరికి డ్రాయింగ్ వేయడం ఇష్టం, మరికొందరికి కథలు చదవడం, ఇంకొందరికి డాన్స్, మ్యూజిక్ ఇలాంటి వాటిపై ఆసక్తి ఉంటుంది. పిల్లల ఆసక్తిని గమనించి ఆ దిశగా ప్రోత్సహించాలి. ఇలా చేస్తే వారిలో క్రియేటివిటీ పెరుగుతుంది.
పిల్లలు చాలా విషయాలపై సందేహాలు కలిగి ఉంటారు. పదే పదే ప్రశ్నలు అడుగుతారు. అలాంటి సమయంలో వారిని అడ్డుకోవద్దు. వారు అడిగే ప్రతి ప్రశ్నకు ఓపికగా సమాధానం చెప్పండి. ఇది వారి విజ్ఞానాన్ని పెంచడమే కాకుండా మనపై నమ్మకాన్ని పెంచుతుంది.
కొత్త విషయాలను పిల్లలు ఆసక్తిగా నేర్చుకుంటారు. హాబీల రూపంలో వారు ఎన్నో మంచి అలవాట్లు నేర్చుకుంటారు. చిన్న వయసులోనే హాబీలు పెంపొందితే వారు భవిష్యత్తులో ఏదో ఒక రంగంలో మెరిసే అవకాశం ఉంది. వారు చేయాలనుకుంటున్న హాబీలను అడ్డుకోవద్దు.
పిల్లలు తప్పులు చేయడం సహజమే. అయితే కొంత మంది తల్లిదండ్రులు ఏదైనా తప్పు చేస్తారేమో అనే భయంతో పిల్లలను ఏ పనికీ ముందుకు పంపరు. కానీ నిజంగా నేర్చుకునేది తప్పుల ద్వారా మాత్రమే. ఒకసారి తప్పు చేస్తే ఆ అనుభవం వాళ్లకు మంచి బుద్ధిని ఇస్తుంది. అందుకే పిల్లలకు స్వేచ్ఛగా పనులు చేయనివ్వండి. తప్పు చేసినా వారిని దూరం చేయకుండా సరైన మార్గంలో ప్రోత్సహించండి.
పిల్లలు చిన్ననాటి నుంచే తమ పనులు తామే చేసుకునే అలవాటు పెంచుకుంటే వారిలో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉదయాన్నే స్కూల్ బ్యాగ్ సర్దుకోవడం వంటి చిన్న చిన్న పనులు వారే చేయగలిగేలా ప్రోత్సాహం ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల వారు బాధ్యతాయుతంగా ఎదుగుతారు.
తల్లిదండ్రులు పిల్లలతో ఓపికగా మాట్లాడాలి. వాళ్లు చెప్పే మాటలను శ్రద్ధగా వినాలి. అలా చేస్తే పిల్లలకు మనపై నమ్మకం పెరుగుతుంది. వారు మన దగ్గరే ధైర్యంగా మాట్లాడగలుగుతారు. కానీ వాళ్లు చెప్పే విషయాలను పట్టించుకోకపోతే పిల్లలు మౌనంగా మారిపోతారు. తమ మనసులో ఉన్న భావాలను బయటకు చెప్పలేరు. దీని వల్ల వాళ్ల మానసిక అభివృద్ధి తగ్గిపోయే అవకాశం ఉంటుంది.
పిల్లలు ఇతర పిల్లలతో కలిసి ఆడితే సామాజిక నైపుణ్యాలు పెరుగుతాయి. కొత్త స్నేహితులతో మాట్లాడటం, ఆడటం వల్ల వాళ్లలో ధైర్యం, సహనం వంటి గుణాలు మెరుగవుతాయి. ఇది భవిష్యత్తులో వారికి ఎంతో ఉపయోగపడుతుంది.
పిల్లలు ఇంట్లోనే ఉండి టీవీ చూడడం, మొబైల్ ఉపయోగించడం కన్నా బయట ఆడితే శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం బాగుంటుంది. వారు నచ్చినట్లుగా ఆడే అవకాశం ఇస్తే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అలాగే ఆనందంగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది.
