Councilor Drain Clean: సఫాయి కార్మికుడిగా మారిన కౌన్సిలర్.. ఏకంగా పొంగుతున్న మురుగు కాల్వలోకి దిగి క్లీనింగ్
Watch Viral Video: జస్ట్ సర్పంచ్ అయితేనే బిల్డప్ మామూలుగా ఉండదు. అదే ఏ కౌన్సిలరో.. ఎమ్మెల్యే అయితే ఆ దర్పం ఓ రేంజ్‌లో ఉంటుంది. కానీ ఢిల్లీలో ఓ కౌన్సిలర్ సఫాయి కార్మికుడి అవతారంతో ఆశ్చర్యంలో ముంచెత్తాడు.
Councilor Drain Clean: జస్ట్ సర్పంచ్ అయితేనే బిల్డప్ మామూలుగా ఉండదు. అదే ఏ కౌన్సిలరో.. ఎమ్మెల్యే అయితే ఆ దర్పం ఓ రేంజ్‌లో ఉంటుంది. కానీ ఢిల్లీ(Delhi)లో ఓ కౌన్సిలర్ సఫాయి కార్మికుడి అవతారంతో ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఢిల్లీలో అధికార ఆమ్‌ఆద్మీ పార్టీ(AAP)కి చెందిన ఓ కౌన్సిలర్ సాదాసీదా వ్యక్తిత్వం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. ఈస్ట్ ఢిల్లీకి చెందిన ఆప్ కౌన్సిలర్ హసీబుల్ హాసన్(Haseeb-ul-Hasan) సఫాయి కార్మికుడిగా మారిపోయారు. ఏకంగా మురుగు కాల్వలో క్లీనింగ్‌కు దిగాడు. చేతులతో మురుగు కాల్వలోని చెత్తాచెదారాన్ని తొలగించాడు. కౌన్సిలర్ వెంట వచ్చిన కార్యకర్తలు, నేతలు మాత్రం ఉత్సవ విగ్రహాల్లా చూస్తూ ఉండిపోయారు. చేతులు కట్టుకొని కౌన్సిలర్ చేస్తున్న పనిని వింతగా వీక్షించారు. ఈ ఘటన మొత్తం స్థానికులు ఫోన్‌లో వీడియో తీశారు. సదరు కౌన్సిలర్ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఈ ప్రాంతంలో కాలువలు శుభ్రం చేయడం లేదని తూర్పు కార్పొరేషన్ ప్రతిపక్ష నాయకుడు మనోజ్ త్యాగి ఆరోపించారు. దీంతో మంగళవారం శాస్త్రి పార్క్ వార్డులోని బులంద్ మసీదు సమీపంలోని డ్రెయిన్ వద్దకు ఆప్ కౌన్సిలర్ హసీబుల్ హాసన్ చేరుకున్నాడు. ఇక్కడ ఆయనే స్వయంగా డ్రెయిన్‌ను శుభ్రం చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఛాతీ లోతు కాలువలోకి దిగాడు. ఆ తర్వాత చెత్తను తొలగించాడు. డ్రెయిన్ పరిశుభ్రంగా లేకపోవడంతో సమీపంలోని కాలనీల్లో మురికి నీరు నిండుతుందని స్థానిక ప్రజల నుంచి చాలా కాలంగా ఫిర్యాదులు వస్తున్నాయని మనోజ్ త్యాగి తెలిపారు. దీని వల్ల వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. డ్రెయిన్‌ను శుభ్రం చేయడంపై కార్పొరేషన్ అధికారులతో మాట్లాడగా వారి సమాధానం ప్రతికూలంగా ఉందన్నారు. ఇది చూసి నేనే డ్రెయిన్ శుభ్రం చేయడానికి ఇక్కడికి రావాల్సి వచ్చిందన్నారు.
మురుగు కాల్వ క్లీనింగ్ తర్వాత అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు కౌన్సిలర్ హసీబుల్. కౌన్సిలర్‌కు పాలాభిషేకం చేశారు స్థానికులు. మురుగు కాల్వ పొంగిపొర్లుతోందని.. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే, కౌన్సిలర్‌కు స్థానికులు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని వెల్లడించాడు కౌన్సిలర్. ఏం చేయాలో తెలియక తానే మురుగు కాల్వను శుభ్రం చేసినట్టు చెప్పాడు. ఢిల్లీలో స్థానిక ఎన్నికల నిర్వహణ పెండింగ్‌లో పడుతూ వస్తోంది. స్థానిక ఎన్నికల్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోడీకి పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. దీంతో స్థానిక పాలన పడకేసింది. కాలనీల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి.
ఇక.. నిన్నటి పార్లమెంట్ సెషన్‌లో ఢిల్లీకి సంబంధించిన కీలక బిల్లు పాస్ అయింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అమెండ్‌మెంట్ యాక్ట్ బిల్లుకు ఆమోదం లభించింది. దీని ప్రకారం ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, ఈస్ట్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఒకే గొడుగు కిందకు రానున్నాయి.