రాజన్నకు వెన్నుదన్నుగా ఉన్న నేత రాజకీయాలు వదిలేశారు.. పార్టీయే సర్వం అనుకున్నవారే సైలెంట్ అయ్యారు.. రఘువీరా అజ్ఞాతవాసం అసలు కథ..!
లైఫ్ లో ఉండాల్సింది ఇదే… ప్రతి విషయంలో ఎంత అటాచ్ మెంట్ ఉండాలో..సమయం అయిపోయిన తర్వాత డిటాచ్ మెంట్ కూడా అంతే ఉండాలి...పి.సి.సి. అధ్యక్షుడిగా, మంత్రిగా పని చేసిన రఘవీరారెడ్డి...
అటాచ్డ్.. డిటాచ్డ్.. లైఫ్ లో ఉండాల్సింది ఇదే… ప్రతి విషయంలో ఎంత అటాచ్ మెంట్ ఉండాలో..సమయం అయిపోయిన తర్వాత డిటాచ్ మెంట్ కూడా అంతే ఉండాలి…పి.సి.సి. అధ్యక్షుడిగా, మంత్రిగా పని చేసిన రఘవీరారెడ్డి ప్రస్తుతం సాగిస్తున్న జీవితం చూసిన తర్వాత కలిగిన అభిప్రాయం అది. రఘవీరారెడ్డి వ్యవసాయ మంత్రిగా పని చేస్తున్న రోజుల్లో మేఘమధనానికి సంబంధించిన వ్యవహారంలో అనేక ఆరోపణలు వచ్చాయి. జగన్ కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు చేసిన సందర్భంలో, కాంగ్రెస్ లోనే కొనసాగిన రఘవీరారెడ్డి మీద విమర్శలు ఉన్నాయి. కాంగ్రెస్ లో ఉంటూనే రఘవీరారెడ్డికి జగన్ కోవర్టులా మారారని రాజకీయవర్గాల్లో చర్చ సాగింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత దాదాపు మునిగిపోయిన కాంగ్రెస్ పార్టీ కాడె భుజాన వేసుకుని కొంత కాలం పాటు ఏటికి ఎదురీదే ప్రయత్నం చేశారు రఘవీరారెడ్డి. ఇక లాభం లేదు అనుకున్నారో ఏమో కానీ కాడె కింద పడేసి తనకి ఈ అధ్యక్ష పదవి వద్దని కాంగ్రెస్ అధిష్టానానికి తేల్చి చెప్పేశారు. తనకున్న రాజకీయ పరిచయాలతో అధికార వైసిపిలోనో, ప్రతిపక్ష తెలుగుదేశంలోనే కాకుంటే జనసేన, బిజెపి ల్లాంటి పార్టీలోనే చేరే అవకాశం లేకపోలేదు. కానీ, రఘవీరారెడ్డి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు గుడ్ బై చెప్పి తన సొంత గ్రామానికి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటే మళ్ళీ మర్చిపోయిన మట్టి వాసనల్ని గుర్తు చేసుకుంటూ జీవితాన్ని గడపడం ప్రారంభించారు. ఇది చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని మీడియా అడగడానికి ప్రయత్నించినా కూడా సున్నితంగా నవ్వేసి మాట దాటేశారే కానీ, కనీసం తన మనసులో మాట మాత్రం బయట పెట్టలేదు. తాను ఏదో అద్భుతమైన నిర్ణయం తీసుకున్నానని రాజకీయ నాయకుడిగా పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వలేదు. తన రాజకీయ మిత్రుడైన డాక్టర్ Y.S.రాజశేఖరరెడ్డి కూడా దాదాపు అదే రకమైన ఆలోచనా విధానం ఉండేది. రాజకీయాలకు కూడా రిటైర్మెంట్ వయసు ఉండాలని 60 ఏళ్ళు దాటిన వాళ్ళు స్వచ్ఛందంగా రాజకీయాల నుంచి తప్పుకోవాలని వై.ఎస్. అనే వారు. 2009 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తొలి సారిగా జరిగిన శాసన సభ సమావేశాల సందర్భంలో ఆయనకు సన్నిహితంగా ఉన్న కొంత మంది మీడియా మిత్రులు ఆ విషయాన్నే వై.ఎస్. దగ్గర ప్రస్తావించారు. దానికి వై.ఎస్. చెప్పిన సమాధానం..నిజమే 60 ఏళ్ళకు రిటైర్మెంట్ ఉండాలని చెప్పిన మాట నిజమేకానీ, ఇప్పుడు అందుబాటులో ఉన్న వైద్య సౌకర్యాలు, మెరుగైన జీవన విధానం తో బహుశా ఆ లిమిట్ ఇప్పుడు కాస్త పెంచాలేమో అని..నవ్వుతూ చెప్పారు. కానీ, అనుకోకుండా ఆ సమావేశాలు ముగిసిన మర్నాడే రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ వై.ఎస్. ప్రయాణించిన హెలికాప్టర్ ప్రమాదానికి గురైన ఆయన శాశ్వతంగా రిటైర్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది. బహుశా రఘవీరారెడ్డి మీద ఆనాడు జరిగిన ఘటనల ప్రభావం కూడా ఉండి ఉంటుందోమో.. మిధునం సినిమాలో బాలసుబ్రమణ్యం (అప్పదాసు) కి ఐదుగురు పిల్లలు..ఆ సినిమాలో ఆ పిల్లలు ఎక్కడా కనిపించరు. కేవలం అప్పదాసు దంపతులు మాట్లాడుకునే మాటల బట్టీ మాత్రమే ఈ విషయం అర్ధమవుతుంది. అయితే తన పిల్లల గురించి పదే పదే అప్పదాసు భార్యగా నటించిన లక్ష్మి మాట్లాడుతుంటే..బాలు చెప్పే మాటలవి. లైఫ్ లో అటాచ్డ్ డిటచ్డ్ ఉండాలే. ఎంత పిల్లలైనా వాళ్ల మీద వాలిపోకూడదు. ఎవరి బతుకులు వాళ్ళవి అని. జీవితంలోనే కాదు, రాజకీయంలోనూ ఆ మాటకొస్తే ఏ వృత్తి లో అయినా అలాగే ఉండాలేమో. తన పాత్ర ఎంత వరకైతే అంత వరకే నటించాలి. కారెక్టర్ ముగిసిన తర్వాత కూడా స్టేజి మీదే ఉంటానంటే బలవంతంగా దింపేస్తారు. రఘవీరారెడ్డి నిర్ణయంతో రెండు అంశాలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. ఒకటి రాజకీయాలకు కూడా రిటైర్మెంట్ వయసు ఉండాలా అని..రెండవది ఈ డిటాచ్మెంట్ వ్యవహారం గురించి..అన్ని పార్టీల రాజకీయ నాయకులు కాస్త సీరియస్ గా దృష్టి సారించాల్సిన విషయం ఇది… ~మురళీ కృష్ణ .ఎం
మరిన్ని ఇక్కడ చదవండి:
ఈ ఫోటోలోని రాజకీయ నాయకుడిని గుర్తుపట్టారా.! ఎక్కడో చూసినట్లు ఉందా.?
ఏటీఎం పిన్ మర్చిపోయారా.! డోంట్ వర్రీ.. ఎస్‌బీఐ సరికొత్త ఫీచర్.. వివరాలివే.!
రెప్పపాటులో ఘోరం.. సెల్‌ఫోన్ మోజులో ఒకరు.. ర్యాష్ డ్రైవింగ్‌తో మరొకరు.. వీడియో వైరల్.!