AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mega Kitchens: రోజుకు 2 లక్షల రొట్టెలు.. 10 లక్షల మందికి భోజనం.. దేశంలోనే అతిపెద్ద వంటగదులివి..

భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకే కాకుండా రుచికరమైన ఆహారానికి కూడా ప్రసిద్ధి చెందింది. ఒకే రోజు వేలాది మందికి భోజనం సిద్ధంగా ఉంచడమే వీటి పని. ఈ వంటగదిలో తయారుచేసిన ఆహారం సామర్థ్యాన్ని మీరు ఊహించలేరు. వీటి ప్రత్యేకత ఏమిటంటే ఎటువంటి ఖర్చు లేకుండా ఇక్కడ ఆహారాన్ని వడ్డిస్తారు. రోజుకు దాదాపుగా పది లక్షల మంది కడుపునింపుతున్న ఈ వంటగదుల విశేషాలేంటో చూద్దాం..

Mega Kitchens: రోజుకు 2 లక్షల రొట్టెలు.. 10 లక్షల మందికి భోజనం.. దేశంలోనే అతిపెద్ద వంటగదులివి..
Mega Kitchens Of India
Follow us
Bhavani

|

Updated on: Apr 16, 2025 | 3:10 PM

మన దేశంలో అతిథులను దేవుళ్లుగా భావిస్తారు. అలా వచ్చిన వారికి అన్నం పెట్టడం సంప్రదాయం. ఇంటికి పట్టుమని పదిమంది వస్తేనే వంట చేయడం కష్టమవుతుంది. అలాంటిది మనదేశంలోని పలు ప్రాంతాల్లో నిత్యం లక్షల మందికి వండే వంటగదులున్నాయి. ఇందులో నిరంతరం పొయ్యి వెలుగుతూనే ఉంటుంది. భారతదేశంలో మెగా కిచెన్ లుగా పేరున్నవి ప్రధానంగా ఆలయాలు, గురుద్వారాలు, స్వచ్ఛంద సంస్థలతో సంబంధం కలిగి ఉంటాయి. ఇవి రోజూ వేలాది నుండి లక్షల మందికి ఉచిత లేదా తక్కువ ఖర్చుతో ఆహారాన్ని అందిస్తాయి. వాటి విశేషాలేంటి.. అవి ఎక్కడెక్కడున్నాయో తెలుసుకుందాం..

గోల్డెన్ టెంపుల్, పంజాబ్:

దీనికి ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత కిచెన్‌గా పేరుంది. రోజూ సగటున 1,00,000 మందికి ఉచితంగా వెజిటేరియన్ భోజనం అందిస్తుంది. పండుగల సమయంలో ఈ సంఖ్య 4 లక్షల వరకు పెరుగుతుంది. 300-350 స్థిర సిబ్బంది వేలాది స్వచ్ఛంద సేవకులు ఇరవైనాలుగు గంటలు ఇందుకోసం పనిచేస్తారు. రోజూ 2 లక్షల రొట్టెలు, 1.5 టన్నుల కందిపప్పు వండుతారు. ఈ లంగర్ సిక్కు సంప్రదాయంలోని “సేవా” స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ, జాతి, మతం, ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా అందరికీ ఆహారం అందిస్తుంది.

పూరి జగన్నాథ టెంపుల్, ఒడిషా:

దీనిని ప్రపంచంలో రెండవ అతిపెద్ద కిచెన్‌గా పిలుస్తారు. 150 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పు, 20 అడుగుల ఎత్తుతో 32 గదులలో 250 మట్టి కుండలతో ఆహారం వండుతారు. రోజూ 25,000 నుండి 1,00,000 మందికి, పండుగల సమయంలో 10 లక్షల మంది వరకు ఆహారం అందిస్తుంది. 600 మంది సువారాలు (వంటవారు), 400 మంది సహాయకులు పనిచేస్తారు. 56 రకాల ప్రసాదాన్ని జగన్నాథుడి కోసం తయారుచేస్తారు.

అక్షయ పాత్ర ఫౌండేషన్, కర్ణాటక:

ప్రపంచంలోనే అతిపెద్ద మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని నిర్వహించే స్వచ్ఛంద సంస్థ ఇది. దేశవ్యాప్తంగా 50కి పైగా కేంద్రీకృత కిచెన్‌ల ద్వారా రోజూ 18 లక్షల మంది పాఠశాల విద్యార్థులకు ఆహారం అందిస్తుంది.

హైదరాబాద్ లో..

హైదరాబాద్‌లోని ఖండి కిచెన్ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ నిధులతో నిర్మించారు. ఇది రోజూ 2 లక్షల భోజనాలను సిద్ధం చేస్తుంది. ఐఎస్వో 22000 ధృవీకరణతో, ఈ కిచెన్‌లు అత్యాధునిక సాంకేతికత శుభ్రత ప్రమాణాలను అనుసరిస్తాయి.

షిర్డీ, మహారాష్ట్ర:

భారతదేశంలో అతిపెద్ద సోలార్-ఆధారిత కిచెన్‌లలో ఒకటి, 73 సోలార్ డిష్‌లతో నడుస్తుంది. దీనిని సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ నిర్వహిస్తోంది. రోజూ 40,000 భోజనాలు అల్పాహార ప్యాకెట్‌లను సిద్ధం చేస్తుంది. మూడు పెద్ద కిచెన్ హాల్స్‌లో 3,200 మందికి ఒకేసారి ఉచిత భోజనం అందించగల సామర్థ్యం ఉంది. పండుగ సమయంలో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది.

ధర్మస్థల, కర్ణాటక:

శివుడికి అంకితమైన మంజునాథ ఆలయ కిచెన్ రోజూ 50,000 మందికి ఆహారం అందిస్తుంది. జైన హెగ్గడే కుటుంబం నిర్వహణలో, వైష్ణవ పూజారులు పూజలు నిర్వహిస్తారు. బయోగ్యాస్ ఒత్తిడి ఆవిరి వంటి పర్యావరణ అనుకూల పద్ధతులను ఉపయోగిస్తుంది. లక్షదీపోత్సవం వంటి పండుగల సమయంలో 1 లక్ష మందికి పైగా భోజనం అందిస్తుంది.

ఇతర ప్రముఖ కిచెన్‌లు:

భారతీయ రైల్వేలు (ఐఆర్సీటీసీ):

నోయిడాలోని కేంద్ర కిచెన్‌తో సహా, రోజూ 6-7 లక్షల మంది ప్రయాణికులకు ఆహారం అందిస్తుంది. ముంబై సెంట్రల్ బేస్ కిచెన్ గంటకు 1,500 పరాఠాలు తయారు చేస్తుంది.

తాజ్‌సాట్స్ ఎయిర్ క్యాటరింగ్: ముంబై, ఢిల్లీ, చెన్నై, అమృత్‌సర్, కోల్‌కతా వంటి నగరాల్లో విమాన ఆహారాన్ని అందిస్తూ, రోజూ వేలాది మందికి సేవలు అందిస్తుంది. డయాబెటిక్, జైన్, పిల్లల ఆహారాలను కూడా సిద్ధం చేస్తుంది.

కళింగ ఇన్‌స్టిట్యూట్, భువనేశ్వర్: ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పాఠశాలగా, రోజూ 25,000 మంది విద్యార్థులకు ఆహారం, వసతి, విద్యను అందిస్తుంది.

ఈ కిచెన్‌లు భారతదేశంలో సామాజిక సేవ, ఆధ్యాత్మికత, సాంకేతికత అద్భుతమైన సమ్మేళనాన్ని ప్రదర్శిస్తాయి. గోల్డెన్ టెంపుల్ లంగర్ జగన్నాథ టెంపుల్ రోసఘర పరిమాణం, సేవలో టాప్ ప్లేస్ లో ఉన్నాయి, అయితే అక్షయ పాత్ర వంటి సంస్థలు పిల్లల ఆకలిని తీర్చడంలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాయి.