Threading Dangers: ఐబ్రో థ్రెడింగ్‌తో కాలేయానికి ముప్పు.. ఎలాగో తెలుసా..?
అందంగా కనిపించడానికి మహిళలు చాలామంది థ్రెడింగ్ చేయించుకుంటారు. ఇది సాధారణ సౌందర్య ప్రక్రియగా అనిపించినా, దీనివల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా, అపరిశుభ్రమైన థ్రెడింగ్ పద్ధతులను అనుసరించడం వల్ల చర్మ సమస్యలతో పాటు, కాలేయానికి కూడా ప్రమాదం కలిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

అందం కోసం మహిళలు ఎక్కువగా చేయించుకునే థ్రెడింగ్ వల్ల కాలేయానికి ప్రమాదం ఉందని మీకు తెలుసా? నిపుణుల హెచ్చరికల ప్రకారం, అపరిశుభ్రమైన థ్రెడింగ్ పద్ధతుల వల్ల మన కాలేయంపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా థ్రెడింగ్ సమయంలో ఒకే దారాన్ని చాలా మందికి వాడడం లేదా దారాన్ని శుభ్రం చేయకపోవడం వంటివి జరుగుతుంటాయి. దీనివల్ల సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపిస్తాయి. ముఖ్యంగా, థ్రెడింగ్ చేసేటప్పుడు చర్మంపై చిన్న గాయాలు లేదా చీలికలు ఏర్పడవచ్చు. ఈ గాయాల ద్వారా బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించి, ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది.
కాలేయానికి ఎలా ప్రమాదం? థ్రెడింగ్ వల్ల చర్మ ఇన్ఫెక్షన్లు మాత్రమే కాకుండా, హెపటైటిస్ వంటి తీవ్రమైన వ్యాధులు కూడా వ్యాపించవచ్చని నిపుణులు చెబుతున్నారు. హెపటైటిస్ బి, సి వంటి వైరస్‌లు ఒకరి నుంచి మరొకరికి రక్తం, ఇతర శరీర ద్రవాల ద్వారా సంక్రమించే అవకాశం ఉంది. శుభ్రత పాటించని థ్రెడింగ్ దారం ద్వారా ఈ వైరస్‌లు ఒకరి చర్మంపై ఏర్పడిన గాయం నుంచి మరొకరి శరీరంలోకి ప్రవేశించవచ్చు.
ఒకవేళ ఈ వైరస్లు శరీరంలోకి ప్రవేశిస్తే, అవి నేరుగా కాలేయంపై దాడి చేస్తాయి. దీనివల్ల కాలేయానికి తీవ్రమైన నష్టం జరిగి, చివరికి కాలేయ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే థ్రెడింగ్ చేయించుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
మీరు వెళ్లే బ్యూటీ పార్లర్‌లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తున్నారా లేదా అని గమనించండి.
థ్రెడింగ్ కోసం కొత్త దారాన్ని వాడేలా చూసుకోండి.
థ్రెడింగ్ చేసిన తర్వాత చర్మంపై ఎర్రటి దద్దుర్లు, దురద వంటివి వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.




