AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారెవ్వా.. మెదడు వయస్సును తగ్గించుకోవచ్చు.. ఎలాగో తెలుసా..?

Brain Health: ఫ్లోరిడా యూనివర్సిటీ పరిశోధన ప్రకారం.. మన మెదడు వయస్సు జీవనశైలి అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించేవారి మెదళ్లు వారి అసలు వయస్సు కంటే 8 ఏళ్లు చిన్నవిగా పనిచేస్తున్నట్లు తేలింది. తగిన నిద్ర, ఆరోగ్యకరమైన బరువు, పొగాకుకు దూరం, ఒత్తిడి నిర్వహణ, సామాజిక బంధాలు మెదడును యవ్వనంగా ఉంచుతాయి. దీనికి సంబంధించి మరిన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

వారెవ్వా.. మెదడు వయస్సును తగ్గించుకోవచ్చు..  ఎలాగో తెలుసా..?
How To Keep Brain Young
Krishna S
|

Updated on: Dec 18, 2025 | 1:26 PM

Share

మనం పుట్టిన తేదీని బట్టి మన వయస్సును లెక్కిస్తాం. కానీ మన మెదడు వయస్సు మన అలవాట్లపై ఆధారపడి ఉంటుందని మీకు తెలుసా..? ఫ్లోరిడా యూనివర్సిటీ చేసిన తాజా పరిశోధనలో ఒక ఆసక్తికరమైన విషయం వెల్లడైంది. మన జన్యువుల కంటే మనం రోజువారీ తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలే మన మెదడు ఎంత కాలం చురుగ్గా ఉంటుందో నిర్ణయిస్తాయట. పరిశోధకులు సుమారు రెండేళ్ల పాటు 128 మందిని నిశితంగా గమనించారు. అత్యాధునిక MRI స్కాన్‌లు, AI టెక్నాలజీని ఉపయోగించి వారి మెదడు పనితీరును విశ్లేషించారు. ఈ అధ్యయనంలో తేలిందేమిటంటే.. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించే వారి మెదళ్లు వారి అసలు వయస్సు కంటే 8 ఏళ్లు చిన్నవిగా కనిపిస్తున్నాయి. అంటే వారి శరీర వయస్సు 60 ఏళ్లు ఉన్నా మెదడు మాత్రం 52 ఏళ్ల వ్యక్తిలాగే ఎంతో చురుగ్గా పనిచేస్తోంది.

మెదడును యవ్వనంగా ఉంచే 5 సూత్రాలు

మన మెదడు వృద్ధాప్యాన్ని నెమ్మది చేయడంలో ఐదు అలవాట్లు రక్షణ కవచంలా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు గుర్తించారు..

నిద్ర: మెదడు కణాలను రిపేర్ చేయడానికి తగినంత గాఢ నిద్ర అవసరం.

శరీర బరువు: ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది.

పొగాకుకు దూరం: ధూమపానం మెదడు కణాలను త్వరగా దెబ్బతీస్తుంది.

ఒత్తిడి నిర్వహణ: సమస్యలను చూసే విధానం మార్చుకోవడం, ఆశావాదంతో ఉండటం మెదడుకు బలాన్ని ఇస్తుంది.

సామాజిక బంధాలు: ఆత్మీయులతో మాట్లాడటం, స్నేహితులతో సమయం గడపడం మెదడును ఉత్సాహంగా ఉంచుతుంది.

కష్టాలు ఉన్నా.. మెదడును కాపాడుకోవచ్చు!

చాలామంది తక్కువ ఆదాయం, దీర్ఘకాలిక నొప్పులు లేదా సామాజిక ఇబ్బందుల వల్ల మెదడు త్వరగా వృద్ధాప్యానికి గురవుతుందని ఆందోళన చెందుతారు. అయితే ఈ అధ్యయనం ఒక ఆశాజనకమైన విషయాన్ని చెప్పింది. జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా, పైన చెప్పిన ఆరోగ్యకరమైన అలవాట్లను పాటిస్తే మెదడుపై పడే ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా దీర్ఘకాలిక నొప్పితో బాధపడేవారు కూడా మంచి జీవనశైలి ద్వారా తమ మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

 అంతా మన చేతుల్లోనే..

మనం కాలాన్ని ఆపలేము, కానీ మెదడు వృద్ధాప్యాన్ని మాత్రం ఖచ్చితంగా నెమ్మది చేయవచ్చు. ‘‘జీవనశైలి అనేదే ఒక గొప్ప మందు’’ అని ఈ పరిశోధన మరోసారి నిరూపించింది. మనం చేసే ప్రతి చిన్న మంచి పని, మెదడును అల్జీమర్స్, జ్ఞాపకశక్తి సమస్యల నుండి కాపాడుతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.