AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silver: వెండి ఉన్నవారికి గుడ్ న్యూస్.. బంగారంతో పాటే సిల్వర్ ఆభరణాలపై కూడా..

ఇప్పటివరకు బ్యాంకుల్లో బంగారాన్ని మాత్రమే తాకట్టు పెట్టి లోన్స్ తీసుకునేవారు. కానీ ఇప్పుడు వెండిపై కూడా లోన్స్ తీసుకోవచ్చు. దీనికి సంబంధించి ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. కస్టమర్లకు అధిక లబ్ధి, ఆలస్యమైతే పరిహారం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా ఈ కొత్త పాలసీ తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Silver: వెండి ఉన్నవారికి గుడ్ న్యూస్.. బంగారంతో పాటే సిల్వర్ ఆభరణాలపై కూడా..
Silver Loan In Banks
Krishna S
|

Updated on: Dec 18, 2025 | 12:41 PM

Share

భారతీయులకు బంగారం ఎంత సెంటిమెంటో, వెండి కూడా అంతే ముఖ్యం. ఇంట్లో పూజ సామాగ్రి నుంచి ఆభరణాల వరకు వెండి వినియోగం ఎక్కువే. అయితే అత్యవసర ఆర్థిక అవసరాల కోసం బంగారాన్ని తాకట్టు పెట్టినంత సులభంగా వెండిని బ్యాంకుల ద్వారా నగదుగా మార్చుకోవడం ఇప్పటివరకు సాధ్యపడలేదు. ఈ లోటును భర్తీ చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెండిని కూడా అధికారిక పూచీకత్తుగా గుర్తిస్తూ సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు

ఆర్బీఐ నియమాలు 2026 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న కమర్షియల్ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు, NBFCలలో ఒకే విధమైన పారదర్శక విధానం అందుబాటులోకి వస్తుంది. రుణం తీసుకోవాలనుకునే వారు తాకట్టు పెట్టే వెండి, బంగారం విషయంలో RBI స్పష్టమైన నిబంధనలు విధించింది. కేవలం ఆభరణాలు లేదా నాణేల రూపంలో ఉన్న లోహాలను మాత్రమే అంగీకరిస్తారు. బిస్కెట్లు, కడ్డీలు, ETFలు లేదా మ్యూచువల్ ఫండ్ యూనిట్లపై రుణాలు ఇవ్వరు. బంగారు ఆభరణాలు 1 కిలో వరకు, నాణేలు గరిష్టంగా 50 గ్రాములు. వెండి ఆభరణాలు 10 కిలోల వరకు, నాణేలు గరిష్టంగా 500 గ్రాములు తాకట్టు పెట్టొచ్చు.

ఎంత రుణం లభిస్తుంది?

మీ దగ్గర ఉన్న వెండి విలువలో ఎంత శాతం రుణం ఇస్తారనేది మీరు తీసుకునే మొత్తంపై ఆధారపడి ఉంటుంది:

  • రూ. 2.5 లక్షల వరకు 85శాతం వరకు లోన్ ఇస్తారు.
  • రూ. 2.5 లక్షల నుండి రూ. 5 లక్షల వరకు 80శాతం రుణం ఇస్తారు.
  • రూ. 5 లక్షలకు మించిన రుణాలకు 75 శాతం రుణం ఇస్తారు.

వెండి విలువను లెక్కించేటప్పుడు ఆభరణాల్లోని రాళ్లు, ఇతర లోహాలను మినహాయించి.. కేవలం లోహం విలువను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఇందుకోసం ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ధరలను ప్రామాణికంగా తీసుకుంటారు.

కస్టమర్లకు భారీ ఊరట

ఈ కొత్త పాలసీలో వినియోగదారుల ప్రయోజనాలకే పెద్దపీట వేశారు. రుణం పూర్తిగా చెల్లించిన తర్వాత తాకట్టు పెట్టిన ఆభరణాలను 7 పని దినాలలోపు కస్టమర్‌కు తిరిగి ఇచ్చేయాలి. భారీ పరిహారం: ఒకవేళ బ్యాంక్ లేదా ఫైనాన్స్ సంస్థ తరపున పొరపాటు జరిగి ఆభరణాల వాపస్ ఆలస్యమైతే, సదరు సంస్థ కస్టమర్‌కు రోజుకు రూ. 5,000 చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బూస్ట్

గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు వెండి వస్తువులను ఎక్కువగా కలిగి ఉంటారు. ఇప్పటివరకు వారు వెండిని తాకట్టు పెట్టాలంటే వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అధిక వడ్డీలు కట్టేవారు. ఇప్పుడు బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు లభించనుండటంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం కానుంది.

బంగారంతో పోలిస్తే వెండి నిల్వలు సామాన్యుల దగ్గర అధికంగా ఉంటాయి. తాజా నిర్ణయంతో వెండి కూడా లిక్విడ్ అసెట్‌గా మారనుంది. మారుతున్న ఆర్థిక పరిస్థితుల్లో సామాన్యులకు ఇది అతిపెద్ద ఊరటనిచ్చే అంశం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి