ESI Dispensary: మూతపడుతోన్న ఈఎస్‌ఐ డిస్పెన్సరీలు.. తాళాలు వేస్తున్న భవన యజమానులు..!

నేను రాను బిడ్డో.. సర్కారు దవాఖానకు అన్నట్టుందీ తెలంగాణలో ఈఎస్‌ఐ ఆస్పత్రుల దుస్థితి. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పలు ఈఎస్‌ఐ ఆసుపత్రుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. రోగుల కంటే చికిత్స అందించాల్సిన దవఖానలే దుర్భరస్థితికి చేరాయి. ఇక ఈఎస్‌ఐ రోగుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. మందులు అందక... తీవ్ర అవస్థలు పడుతున్నారు రోగులు.

ESI Dispensary: మూతపడుతోన్న ఈఎస్‌ఐ డిస్పెన్సరీలు.. తాళాలు వేస్తున్న భవన యజమానులు..!
Esi Dispensary
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Apr 28, 2024 | 11:48 AM

నేను రాను బిడ్డో.. సర్కారు దవాఖానకు అన్నట్టుందీ తెలంగాణలో ఈఎస్‌ఐ ఆస్పత్రుల దుస్థితి. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పలు ఈఎస్‌ఐ ఆసుపత్రుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. రోగుల కంటే చికిత్స అందించాల్సిన దవఖానలే దుర్భరస్థితికి చేరాయి. ఇక ఈఎస్‌ఐ రోగుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. మందులు అందక… తీవ్ర అవస్థలు పడుతున్నారు రోగులు.

రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యంతో ఈఎస్ఐ డిస్పెన్సరీలు మూత పడుతున్నాయి. చిరుద్యోగులు, కార్మికులకు ఉచితంగా మందులు, వైద్య సేవలు అందించే డిస్పెన్సరీలు మూత పడుతున్నాయి. మందుల కొరతకు తోడు అద్దె బకాయిలతో ఇప్పటికే కొన్ని డిస్పెన్సరీలు మూతపడగా, త్వరలో మరికొన్ని మూత పడనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా .2.10 కోట్ల రూపాయల అద్దె బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో వైద్య సేవలు అందక కార్మికులు అల్లాడుతున్నారు.

చిరుద్యోగులు, కార్మికులకు ఉచితంగా వైద్యం అందించి, ఉచిత మందులు సరఫరా చేసే ఈఎస్‌ఐ డిస్పెన్సరీలు మూతపడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు తొమ్మిది డిస్పెన్సరీలకు తాళాలు పడ్డాయి. ముందు ముందు మిగతా డిస్పెన్సరీలు కూడా మూతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ అద్దె చెల్లించకపోవడంతో ఈఎస్‌ఐ డిస్పెన్సరీలకు ఎక్కడికక్కడ తాళాలు వేస్తున్నారు భవన యజమానులు. ఈ క్రమంలోనే జహీరాబాద్‌, తూప్రాన్‌, నల్గొండతోపాటు 9 డిస్పెన్సరీలకు తాళాలు వేశారు ఓనర్స్‌. రాష్ట్రవ్యాప్తంగా రెండు కోట్ల రూపాయలకు పైగా అద్దె బకాయిలు ఉన్నట్టు తెలుస్తోంది.

రాష్ట్రంలో కార్మికుల సంక్షేమం కోసం ఈఎస్ఐ ఏర్పాటు చేశారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, నల్లగొండ, నిజామాబాద్‌ జిల్లాల్లో 1,55,525 ఈఎస్‌ఐ కార్డు దారులు ఉండగా.. 17 డిస్పెన్సరీలు ఉన్నాయి. వీటిలో రోజుకు ఒక్కో డిస్పెన్సరీకి 200 మందికి పైగా కార్మికులు చికిత్సకు వస్తుంటారు. అనారోగ్య సమస్యలతో ఇక్కడికొచ్చే కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు ఇస్తుంటారు. స్థానికంగా చికిత్స అందని రోగులను వరంగల్, హైదరాబాద్‌ ఆస్పత్రులకు రెఫర్‌ చేస్తారు. స్థానిక డిస్పెన్సరీలతో పాటు వరంగల్, హైదరాబాద్‌ ఆస్పత్రుల్లో సైతం పూర్తి స్థాయి వైద్య పరీక్షలు, చికిత్సలు, మందులు ఉచితంగా ఇవ్వాల్సి ఉంటుంది

అద్దె బకాయిలతో మూతపడుతున్న ఈఎస్ఐ డిస్పెన్సరీలు

రాష్ట్రంలో ఫ్యాక్టరీలు, ఇతర ప్రైవేటు సంస్థల్లో పనిచేసే కార్మికులు (నెలసరి ఆదాయం రూ.21వేల లోపు ఉన్న వారు) ఈఎస్‌ఐ పరిధిలోకి వస్తారు. కార్మికుడికి చెల్లించే జీతం నుంచి 0.75 శాతం కార్మికుడి వాటాగా చెల్లించాలి. పనిచేసే కంపెనీ యాజమాన్యం వారు 3.25 శాతం ఈఎస్‌ఐకి చెల్లిస్తుంది. కార్మికులకు వైద్య సేవల కోసం రాష్ట్రవ్యాప్తంగా 71 ఈఎస్ఐ డిస్పెన్సరీలుండగా వాటిలో 57 అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. డిస్పెన్సరీలకు అద్దె చెల్లించక పోవడంతో ఇప్పటికే 9 డిస్పెన్సరీ కేంద్రాలకు తాళాలు పడ్డాయి. త్వరలోనే మరికొన్ని మూతపడే పరిస్థితి వచ్చింది. అద్దె భవనాల్లో కొనసాగుతున్న ఈఎస్ఐ డిస్పెన్సరీలకు అద్దెలు సకాలంలో చెల్లించడం లేదు. కొన్నింటికి రెండేళ్లుగా, మరి కొన్నింటికి ఏడాదిగా, నెలలుగా అద్దెలు పెండింగ్ లో ఉండటంతో యజమానులు తాళాలు వేస్తున్నారు.

ఇటీవల హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని తార్నాక, మేడ్చల్, శామీర్‌పేట, బొల్లారం, ఉమ్మడి మెదక్ జిల్లాలోని జహీరాబాద్, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ, బీబీనగర్ డిస్పెన్సరీలకు తాళాలు వేశారు. ప్రస్తుతం 57 డిస్పెన్సరీలకు సంబంధించిన అద్దెలు సుమారు రూ.2.10 కోట్ల వరకు పెండింగ్ లో ఉన్నాయి. ఇందులో రూ.1.25 కోట్లకు సంబంధించి బిల్లులు ఆర్థిక శాఖ వద్ద పెండింగ్ లో ఉన్నట్లు సమాచారం. మిర్యాలగూడలోని ఈఎస్ఐ డిస్పెన్సరీకి రెండేళ్లకు పైగా పెద్దబకాయలు ఉన్నాయని, దీంతో డిస్పెన్సరీకి తాళం వేశానని భవన యజమాని చెబుతున్నారు. అద్దె బకాయలు చెల్లించాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ అధికారులు పట్టించుకోవడంలేదని భవన యజమానులు చెబుతున్నారు.

రాష్ట్రంలోని డిస్పెన్సరీలకు తాళం పడటంతో కార్మికులకు అందే వైద్య సేవల్లో అంతరాయం ఏర్పడుతుంది. రాష్ట్రంలో బీమా చేయించుకున్న కార్మికుల కుటుంబ సభ్యులు 18 లక్షల మందికి ఈఎస్ఐ వైద్య సేవలందిస్తోంది. వీరిని ఇన్సూర్డ్ పర్సన్ (ఐపీ)గా వ్యవహరిస్తారు. ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ ద్వారా ఈఎస్ఐ లబ్ధిదారులకు వైద్యం, మందులు ఉచితంగా అందిస్తున్నారు. ఈఎస్ఐ నెట్వర్క్ కింద 4 ఆస్పత్రులు, 2 డయాగ్నోస్టిక్ కేంద్రాల తోపాటు 71 డిస్పెన్సరీలున్నాయి.

రాష్ట్రం నుంచి ఈఐపీల ద్వారా ఢిల్లీలోని ఈఎస్ఐ కార్పొరేషన్ కు ఏటా సుమారు రూ.1.250 కోట్ల వరకు వెళ్తాయి. ఈఎస్ఐ కార్పొరేషన్ ప్రతి ఐపీకి ఏడాదికి సగటున రూ.3వేలు కేటాయిస్తుండగా.. అంతే మొత్తాన్ని తిరిగి రాష్ట్ర ఈఎస్ఐకి పంపుతుంది. రాష్ట్ర యంత్రాంగం వాటి వినియోగానికి సంబంధించిన యుటిలిటీ సర్టిఫికెట్ (యూసీ)ను కార్పొరేషన్ పంపాలి. అయితే రాష్ట్రం నుంచి యూసీలు పంపకపోవడంతో నిధులు సరిగ్గా రావడం లేదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. యూసీలు సమర్పించక పోవడంతో కనీసం రూ.200 కోట్లు రావడంలేదనే ఆరోపణలున్నాయి. డిస్పెన్సరీల మూతతో కార్మికుల వైద్య సేవలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని కార్మిక సంఘాల నేతలు వాపోతున్నారు. మూతపడిన డిస్పెన్సరీలను వెంటనే తెరవాలని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…