Kolleru Lake: ఇంకిపోయిన కొల్లేరు.. బీడు వారుతున్న చెరువు.. ఆహారం కొరతతో పక్షుల విలవిల..!

ఆసియా ఖండంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు మన కొల్లేరు.. ఓ పక్క మంచి నీటితో కళకళలాడుతూ మరోపక్క విదేశీ వలస పక్షుల కిలకిలలతో, సందర్శకుల బిజీ తో మనోహరంగా ఉండే కొల్లేరు కళావిహీనంగా మారింది. కొల్లేరు సరస్సు ప్రస్తుతం నీళ్లు లేక బీటలు వారి భూమి నెరలు బారింది.

Kolleru Lake: ఇంకిపోయిన కొల్లేరు.. బీడు వారుతున్న చెరువు.. ఆహారం కొరతతో పక్షుల విలవిల..!
Kolleru Lake
Follow us
B Ravi Kumar

| Edited By: Balaraju Goud

Updated on: May 22, 2024 | 10:23 AM

ఆసియా ఖండంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు మన కొల్లేరు.. ఓ పక్క మంచి నీటితో కళకళలాడుతూ మరోపక్క విదేశీ వలస పక్షుల కిలకిలలతో, సందర్శకుల బిజీ తో మనోహరంగా ఉండే కొల్లేరు కళావిహీనంగా మారింది. కొల్లేరు సరస్సు ప్రస్తుతం నీళ్లు లేక బీటలు వారి భూమి నెరలు బారింది. ప్రతి ఏడాది వర్షాకాలంలో వచ్చే వరదల కారణంగా కొల్లేరు పూర్తిగా నీటితో నిండి కళకళలాడుతూ ఉంటుంది. వేసవిలో మాత్రం ఆ నీరంతా ఆవిరై కళావిహీనంగా కనిపిస్తుంది.

కొల్లేరులో వలస పక్షలకు నీటి కష్టాలు ఎదురవుతున్నాయి. మండుతున్న ఎండలకు నీరు ఆవిరి అవుతుండటంతో చేపలు సైతం మృత్యువాత పడుతున్నాయి. కైకలూరు మండలం ఆటపాక పక్షుల కేంద్రం 286 ఎకరాల ల్లో నీరు లేక విదేశీ పక్షులు, చేపలు చనిపోతున్నాయి. ఈ పక్షుల కేంద్రంలో 186 రకాల జాతుల పక్షులు విడిది చేస్తుంటాయి. 90 రకాల విదేశీ పక్షులు ప్రతియేటా మార్చి నుండి అక్టోబర్ వరకు ఆటపాక పక్షుల కేంద్రంలో ఉండి సంతానోత్పత్తి చేసుకుని తమ పిల్లలను తీసుకుని విదేశాలకు వెళ్తుంటాయి.

పక్షుల కేంద్రంలో అర అడుగు కూడా నీరు లేక ఇంకిపోవడంతో పక్షుల మనుగడ కష్టంగా మారింది. అధిక ఎండలకు నీరు బాగా వేడెక్కి పోవడంతో చేపలు సైతం మృత్యువాత పడుతున్నాయి .పక్షులకు తిండిలేక ఆకలితో అలమటించి చనిపోతున్నాయి. పక్షుల కేంద్రంలో నీరు తక్కువగా ఉండడంతో బోట్ షికారు సైతం నిలిచిపోయింది. పక్షుల కేంద్రమైన 286 ఎకరాల చెరువును నీటితో నింపి నీరు తగ్గకుండా చర్యలు తీసుకోవాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.

సాధారణంగా కొల్లేరు నీటి నిల్వ సామర్థ్యం 40 టీఎంసీలు వరకు ఉంటుంది. అయితే కొల్లేరులో పెద్ద ఎత్తున ఆక్రమణలు పెరిగిపోవడంతో ప్రస్తుతం 7 నుండి 8 టీఎంసీల నీరు కూడా నిల్వ ఉండని పరిస్థితి ఏర్పడింది. గత ఏడాది తుఫానుల వల్ల 20. అడుగుల పైబడి భారీ వరద నీరు కొల్లేరుకు చేరుకుంది. ఆ నీరంతా ప్రస్తుతం ఆవిరై కొల్లేరు బీడు భూమిలా తయారైంది. కొల్లేరుకు వచ్చిన వరద నీరు అంతా ఉప్పుటేరు ద్వారా సముద్రంలోకి వెళ్ళిపోతుంది. ప్రతి వేసవిలోనూ కొల్లేరులో నీరు ఇంకిపోయి ఉప్పు మడులుగా మారిపోతుంది.

కొల్లేరులో నీరు సముద్రంలోకి కలవకుండా నిల్వచేసే విధంగా కొల్లేరు సరస్సులో రెగ్యులేటర్లు నిర్మిస్తామని ఇప్పటికే ప్రభుత్వాలు హామీ ఇచ్చాయి. అయితే ఇప్పటివరకు ఆ హామీలు నెరవేరకపోవడంతో కొల్లేరు ఎప్పటి స్థితిలోనే ఉండిపోయింది. అంతేకాక కొల్లేరుకు ప్రత్యేకంగా విదేశీ పక్షుల సందర్శనం కోసం వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా తగ్గిపోయింది. సరస్సులో నీళ్లు లేకపోవడంతో తిండి లేక విదేశీ వలస పక్షులు సైతం ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయి.

వీడియో చూడండి… 

ఇప్పటికైనా ప్రభుత్వాలు కొల్లేరు పై ప్రత్యేక శ్రద్ధ చూపి వరద నీరు వృధాగా సముద్రంలోకి పోకుండా రెగ్యులేటర్లు నిర్మించి నీటిని నిల్వ చేయాలని, అలాగే టూరిజం హబ్ అలాగే కొల్లేరు ప్రాంతాన్ని టూరిజం హబ్ గా అభివృద్ధి చేసి పర్యాటకుల సంఖ్య పెరిగే విధంగా చర్యలు చేపట్టాలని, ప్రస్తుతం పర్యాటకుల కోసం ఏర్పాటుచేసిన వసతులతో పాటు మరిన్ని సౌకర్యాలు అదనంగా కల్పించాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..