AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali: భారత్‌తో పాటు దీపావళి జరుపుకునే దేశాలు ఏవో తెలుసా..?

దీపావళి అనేది చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచించే దీపాల పండుగ. దేశంలో దీనిని ఐదు రోజుల పాటు వైభవంగా జరుపుకుంటారు. దీపాలు వెలిగించడం, స్వీట్లు పంచడం, లక్ష్మీ, గణేశుని పూజించడం జరుగుతుంది. ఈ పండుగ మన దేశానికే పరిమితం కాలేదు. అనేక దేశాలలో దీనిని జరుపుకుంటారు. ఆ దేశాలు ఏవో తెలుసుకుందాం..

Diwali: భారత్‌తో పాటు దీపావళి జరుపుకునే దేశాలు ఏవో తెలుసా..?
Diwali Is Celebrated Worldwide
Krishna S
|

Updated on: Oct 19, 2025 | 1:05 PM

Share

దీపావళి పండుగ అంటే భారతీయులకు ఎంతో ప్రత్యేకం. ఈ వెలుగుల పండుగ చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుంది. ఈ రోజున దీపాలు వెలిగించడం, స్వీట్లు పంచుకోవడం, లక్ష్మీదేవి, గణేశుడిని పూజించడం ప్రధాన ఆచారాలు.దేశంలో దీపావళి ఐదు రోజుల పాటు ధంతేరస్, నరక చతుర్దశి, దీపావళి, గోవర్ధన పూజ, భాయ్ దూజ్‌లతో వైభవంగా జరుగుతుంది. అయితే ఈ దీపావళి వెలుగు కేవలం మన దేశానికే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ఈ పండుగను గొప్ప వైభవంగా జరుపుకుంటారు. భారత్‌తో పాటు దీపావళిని జరుపుకునే ప్రధాన దేశాలు, అక్కడి ప్రత్యేకతలు ఇక్కడ తెలుసుకుందాం.

నేపాల్‌లో తిహార్

నేపాల్‌లో దీపావళిని తిహార్ అని పిలుస్తారు. ఇది కూడా ఐదు రోజుల పండుగే. ఇక్కడ విచిత్రంగా పండుగ కాగ్ తిహార్ (కాకుల పూజ)తో ప్రారంభమై, కుకుర్ తిహార్ (కుక్కల పూజ)తో కొనసాగుతుంది. ఆవుల పూజ తర్వాత ప్రధాన రోజున లక్ష్మీ పూజ చేస్తారు. చివరి రోజున భాయ్ టికాపేరుతో అక్కాచెల్లెళ్లు తమ సోదరుల దీర్ఘాయుష్షు కోసం ప్రార్థిస్తారు.

శ్రీలంక – మారిషస్

శ్రీలంకలో ముఖ్యంగా తమిళ సమాజం దీపావళిని ఉత్సాహంగా జరుపుకుంటుంది. ఇక్కడ కూడా దీపాలు వెలిగిస్తారు. సాంప్రదాయ స్వీట్లు తయారు చేస్తారు. మారిషస్‌లో గణనీయమైన భారతీయ-అమెరికన్ జనాభా కారణంగా దీపావళి వేడుకలు వారాల ముందు నుంచే మొదలవుతాయి.

సింగపూర్ – మలేషియా

సింగపూర్, మలేషియాలో హిందూ సమాజానికి దీపావళి ఒక ప్రధాన పండుగ. సింగపూర్‌లోని “లిటిల్ ఇండియా” ప్రాంతం దీపావళి సమయంలో లైట్లు, అలంకరణలతో మెరిసిపోతుంది. మలేషియాలో దీన్ని హరి దీపావళి అని పిలుస్తారు. ప్రజలు ఉదయాన్నే నూనె స్నానం చేసి, ప్రార్థనలు చేసి సంతోషంగా పండగ జరుపుకుంటారు.

ఫిజీ – కరేబియన్ దేశాలు

ఫిజీ జనాభాలో దాదాపు 40శాతం మంది భారతీయులు ఉన్నారు. ఇక్కడ దీపావళిని పెద్ద పండుగగా జరుపుకుంటారు. ఇళ్లను దియాలు, బల్బులతో అలంకరించి బాణసంచా కాల్చి ఆనందిస్తారు. అదేవిధంగా కరేబియన్ దేశాలైన ట్రినిడాడ్, టొబాగో, గయానాలలో కూడా దీపావళిని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.

పాశ్చాత్య దేశాలలో వైభవం

యూకే , యూఎస్, కెనడా వంటి పాశ్చాత్య దేశాలలో పెద్ద సంఖ్యలో భారతీయలు ఈ పండుగను జరుపుకుంటున్నారు. లీసెస్టర్‌లో జరిగే దీపావళి కవాతు ప్రపంచంలోనే అతిపెద్ద వేడుకలలో ఒకటిగా పేరుగాంచింది. ఈ దేశాల్లోని రాజకీయ నాయకులు కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్‌బోర్న్, న్యూజిలాండ్‌లలో కూడా దీపావళి వేడుకలు పెద్ద ఎత్తున జరుగుతాయి. స్థానిక ప్రభుత్వాలు సహకరించడంతో ఈ పండుగ బహుళ సాంస్కృతిక వేడుకగా రూపాంతరం చెందింది.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..