AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీకు సన్ రూఫ్ కారుందా? అయితే జర జాగ్రత!!

వేసవిలో పెరుగుతున్న తీవ్ర ఉష్ణోగ్రతల వల్ల కార్ల సన్‌రూఫ్ గ్లాస్‌లు అకస్మాత్తుగా పగిలిపోవడం వాహనదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఎక్కువసేపు ఎండలో పార్క్ చేయడం, గ్లాస్‌లో చిన్నపాటి లోపాలు, థర్మల్ షాక్ వంటి కారణాలు ఈ ప్రమాదానికి దారితీస్తాయి. కాబట్టి కారును నీడలో ఉంచడం, ఏసీని నెమ్మదిగా ఆన్ చేయడం, గ్లాస్‌ను తరచూ తనిఖీ చేయడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చు.

మీకు సన్ రూఫ్ కారుందా? అయితే జర జాగ్రత!!
Car Sunroof Issue
Rakesh Reddy Ch
| Edited By: |

Updated on: May 04, 2026 | 8:24 AM

Share

ప్రస్తుత కాలంలో కార్లకు సన్‌రూఫ్ అనేది ఒక లగ్జరీ ఫీచర్‌గా మారింది. ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు, కారులోకి వెలుతురు వచ్చేందుకు చాలామంది దీనిని ఇష్టపడుతున్నారు. అయితే, వేసవి కాలంలో ఎండలు మండిపోతున్న వేళ కారు సన్‌రూఫ్ అద్దాలు అకస్మాత్తుగా పగిలిపోవడం వాహనదారులను కలవరపెడుతోంది. ఎటువంటి ప్రమాదం జరగకపోయినా, ఎవరూ రాయి విసరకపోయినా అద్దం దానంతట అదే పేలిపోవడానికి ప్రధాన కారణం విపరీతమైన ఉష్ణోగ్రతలేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కారు అద్దాలను సాధారణంగా టెంపర్డ్ లేదా లామినేటెడ్ గ్లాస్‌తో తయారు చేస్తారు. ఇవి కొంతమేర ఒత్తిడిని తట్టుకోగలవు. కానీ, కారును నేరుగా ఎండలో ఎక్కువ సేపు పార్క్ చేసినప్పుడు లోపల ఉష్ణోగ్రత 120 డిగ్రీల ఫారెన్‌హీట్ కంటే ఎక్కువగా పెరుగుతుంది. కారు పైభాగంలో ఉండే సన్‌రూఫ్ ఈ వేడిని నేరుగా గ్రహిస్తుంది. గ్లాస్ వేడెక్కినప్పుడు అది వ్యాకోచిస్తుంది. ఈ వ్యాకోచం సమానంగా లేనప్పుడు గ్లాస్‌పై తీవ్రమైన ఒత్తిడి ఏర్పడి, చివరకు అది పగిలిపోతుంది.

తయారీ సమయంలో అద్దంలో ఉండే చిన్నపాటి లోపాలు లేదా రాళ్ల వల్ల కలిగే మైక్రోఫ్రాక్చర్లు వేసవిలో పెద్ద సమస్యగా మారుతాయి. ఎండ వేడికి ఈ చిన్న పగుళ్లు విస్తరించి అద్దం ముక్కలవుతుంది. అలాగే, అద్దాన్ని పట్టి ఉంచే మెటల్ ఫ్రేమ్, గ్లాస్ వేర్వేరు వేగంతో వేడెక్కడం వల్ల కూడా అంచుల వద్ద ఒత్తిడి పెరిగి ప్రమాదం జరుగుతుంది. మరో ముఖ్యమైన కారణం ‘థర్మల్ షాక్’. ఎండలో బాగా వేడెక్కిన కారులోకి రాగానే ఏసీని ఫుల్ స్పీడ్‌లో ఆన్ చేయడం వల్ల అద్దం లోపలి భాగం ఒక్కసారిగా చల్లబడుతుంది, బయటి భాగం వేడిగానే ఉంటుంది. ఈ ఆకస్మిక ఉష్ణోగ్రత మార్పు వల్ల అద్దం పగిలిపోయే అవకాశం ఉంది. అందుకే ఏసీని నెమ్మదిగా పెంచడం లేదా కిటికీలు కొద్దిగా దించి లోపలి వేడి గాలిని బయటకు పంపడం శ్రేయస్కరం.

వాహనదారులు తమ సన్‌రూఫ్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలి. చిన్న చిప్స్ లేదా గీతలు ఉన్నా వెంటనే రిపేర్ చేయించాలి. సాధ్యమైనంత వరకు కారును నీడలో పార్క్ చేయడం లేదా సన్‌షేడ్స్ వాడటం వల్ల సన్‌రూఫ్ ఆయుష్షు పెరుగుతుంది. ఎండలో ఉన్న కారుపై ఒక్కసారిగా చల్లటి నీళ్లు పోయడం కూడా ప్రమాదకరమని గుర్తుంచుకోవాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ ఖరీదైన నష్టాన్ని నివారించవచ్చు.

Follow Us