ఫైనల్ గేమ్‌లో ఏం స్కెచ్ రా మావా.. RCB, GTలో ఏ టీం గెలిచినా.. ట్రోఫీ చేరేది మాత్రం వాళ్లకే..!
Gujarat Titans Sponsor, Royal Challengers Bengaluru Owner: మైదానంలో ఆటగాళ్ల మధ్య జరిగే పోరు రసవత్తరంగా సాగనున్నప్పటికీ, తెరవెనుక జరిగిన కార్పొరేట్ వ్యూహం మాత్రం అద్భుతమనే చెప్పాలి. ట్రోఫీ ఎవరు గెలుచుకుంటారనే ఉత్కంఠ ఒకవైపు ఉన్నా, వ్యాపార సామ్రాజ్యంలో మాత్రం బిర్లా గ్రూప్ ఇప్పటికే తన జయకేతనాన్ని ఎగురవేసింది.

RCB vs GT Final 2026: ఐపీఎల్ 19వ సీజన్ మహా సంగ్రామానికి అహ్మదాబాద్ వేదికగా సర్వం సిద్ధమైంది. నేడు జరగబోయే అత్యంత ఉత్కంఠభరితమైన ఫైనల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ (జీటీ) జట్లు తలపడనున్నాయి. అయితే, మైదానంలో కప్పు కోసం ఈ రెండు జట్లు కొట్టుకుంటుంటే, వ్యాపార ప్రపంచంలో మాత్రం ఒకే ఒక్క సంస్థ విజయోత్సవాలకు సిద్ధమవుతోంది.
ఐపీఎల్ ఫైనల్ ఫైట్: మైదానంలో ఆట.. తెరవెనుక కోట్ల వ్యాపారం..!
ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 క్లైమాక్స్ ఘట్టం వచ్చేసింది. గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈరోజు రాత్రి గం. 7:30 నిమిషాలకు ప్రారంభం కానున్న ఈ ఫైనల్ మ్యాచ్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వరుసగా రెండోసారి ట్రోఫీని ముద్దాడాలని ఆర్సీబీ కసితో ఉంటే, శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ రెండోసారి ఐపీఎల్ విజేతగా నిలిచి తమ ఆధిపత్యాన్ని చాటాలని ఉవ్విళ్లూరుతోంది. బలబలాల పరంగా ఇరుజట్లు ఎంతో సమతూకంగా కనిపిస్తున్నాయి. మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో గుజరాత్‌ను చిత్తు చేసి ఆర్సీబీ నేరుగా ఫైనల్ చేరగా, గుజరాత్ టైటాన్స్ రెండో క్వాలిఫైయర్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి పట్టుదలతో ఫైనల్‌కు దూసుకొచ్చింది.
ఆర్సీబీ వర్సెస్ జీటీ: ట్రోఫీ ఎవరిదైనా.. లాభం మాత్రం ఆ గ్రూప్‌దే..!
మైదానంలో ఏ జట్టు గెలిచినా.. కప్పు ఏ నగరానికి వెళ్లినా, ఈ ఫైనల్ మ్యాచ్ ద్వారా వ్యాపార పరంగా అసలైన విజేతగా నిలవబోతోంది మాత్రం ‘ఆదిత్య బిర్లా గ్రూప్’ మాత్రమేనని సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తోంది. దీనికి గల కారణాలు వింటే క్రికెట్ అభిమానులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు.
వ్యాపార వ్యూహాల్లో ఆదిత్య బిర్లా గ్రూప్ ఎంతటి చాణక్యతనుదర్శించిందో ఈ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ స్పష్టం చేస్తోంది. ఈ లీగ్‌లో ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ‘బిర్లా ఎస్టేట్స్’ గుజరాత్ టైటాన్స్ జట్టుకు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. ఈ ఒప్పందంలో భాగంగా గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్ల జర్సీలపై ముందు భాగంలో అందరికీ స్పష్టంగా కనిపించేలా ‘బిర్లా ఎస్టేట్స్’ పెద్ద లోగోను మనం చూడవచ్చు.
మరోవైపు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు యాజమాన్యంలో కూడా బిర్లా గ్రూప్ భాగస్వామిగా ఉంది. దాదాపు 16వేల కోట్ల రూపాయలకు పైగా భారీ వ్యయంతో మరో ముగ్గురు భాగస్వాములతో కలిసి బిర్లా గ్రూప్ ఈ ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అంటే, ఒకవైపు ఫైనల్ ఆడుతున్న ఆర్సీబీ జట్టులో యాజమాన్య భాగస్వామ్యం, మరోవైపు ప్రత్యర్థిగా తలపడుతున్న గుజరాత్ టైటాన్స్ జట్టుకు ప్రధాన స్పాన్సర్‌షిప్.. ఇలా రెండు జట్లతోనూ బిర్లా గ్రూప్‌నకు విడదీయరాని ఆర్థిక బంధం ఉంది.
సోషల్ మీడియాలో ట్రెండింగ్: ‘ఫైనల్ ఫలితం ఏదైనా.. విజేత బిర్లానే!’
ఈ ఆసక్తికరమైన సమీకరణాల నేపథ్యంలో, నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో రకరకాల మీమ్స్, విశ్లేషణలతో సందడి చేస్తున్నారు. ఆర్సీబీ గెలిచినా, గుజరాత్ టైటాన్స్ గెలిచినా అంతిమంగా లభించే భారీ లాభం, బ్రాండ్ గుర్తింపు ఆదిత్య బిర్లా గ్రూప్‌నకే దక్కుతాయని క్రీడా విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా బిర్లా బ్రాండ్ విలువ అంతర్జాతీయ స్థాయిలో మారుమోగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




