AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పేదరికాన్ని జయించి.. ఒకేసారి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన గిరిజన యువతి..!

ఈ రోజుల్లో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటేనే గగనం.. అలాంటిది గిరిజన తండాకు చెందిన ఓ యువతి, ఎలాంటి కోచింగ్ లేకుండా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది.

Telangana: పేదరికాన్ని జయించి.. ఒకేసారి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన  గిరిజన యువతి..!
Banoth Spandana
N Narayana Rao
| Edited By: |

Updated on: Dec 07, 2024 | 1:50 PM

Share

పేద కుటుంబంలో పుట్టి.. అనేక కష్ట, నష్టాలకు ఒడ్చి.. పట్టుదలతో అనుకున్న లక్ష్యాన్ని సాధించింది.. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిందీ గిరిజన యువతి. ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కడో మారుమూల తండా నుంచి మెరిసింది ఈ గిరి పుత్రిక. ఒకే సారి వరుసగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైంది ఆదివాసీ ముద్దుబిడ్డ బాణోత్ స్పందన.

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం భగవాన్ నాయక్ తండా గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థిని బానోత్ స్పందన. నిరుపేద గిరిజన రైతు సీతారాములు, స్వాతి దంపతులకు స్పందన 1996లో జన్మించింది. ఒకటి నుండి పదవ తరగతి వరకు ఏన్కూరు ప్రభుత్వ పాఠశాలలో చదువకుంది. ఖమ్మం కృష్ణవేణి కాలేజీలో ఇంటర్ విద్యను అభ్యసించింది. డిగ్రీ ప్రియదర్శినిలో పూర్తి చేసింది. 2019 లో హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పీజీ పట్టా అందుకుంది. 2022లో బీఈడి పూర్తి చేసిన స్పందన.. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న లక్ష్యం పెట్టుకుంది.

పట్టుదలతో ఎన్ని కష్టాలు ఉన్నా చదివింది. ఎటువంటి కోచింగ్ లేకుండానే గురుకుల పరీక్షలకు దరఖాస్తు చేసుకుని రాసింది. 2024 ఫిబ్రవరిలో వెలువడిన ఫలితాల్లో తొలి ప్రయత్నంలోనే టీజీటీ, పీజీటీ, గురుకుల జూనియర్ లెక్చరర్‌గా ఎంపికైంది. ఏకకాలంలో వరుసగా మూడు ఉద్యోగాలు సాధించింది. ప్రస్తుతం ఖమ్మం రఘునాథపాలెం మహాత్మ గాంధీ జ్యోతిబాపూలే జూనియర్ కళాశాలలో లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తోంది. తాజాగా విడుదలైన జనరల్ ప్రభుత్వ లెక్చరర్ పోస్టుల్లో జువాలజీ లెక్చరర్‌గా మరో ఉద్యోగానికి ఎంపికైంది. జనరల్ కేటగిరీలోనే స్పందన ఎంపిక కావడం విశేషం..!

ఈ రోజుల్లో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటేనే చాలా కష్టం. శ్రమతో కూడుకున్న పని. కొందరు యజ్ఞంలా ప్రిపేర్ అయ్యి.. ఎగ్జామ్స్ రాసినా.. ప్రభుత్వ ఉద్యోగం అనేది కలగానే మారింది. అలాంటి తరుణంలో మారుమూల గిరిజన తండాలో.. పేదరికాన్ని జయించి.. ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది స్పందన. స్థానికులు నుంచి ప్రశంసలు అందుకుంటోంది. స్పందన సాధించిన విజయం స్థానిక గిరిజన యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే అంటోంది స్పందన.

మరిన్న హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..