Humanity: హిందూ మహిళకు అంతిమ సంస్కారాలు చేసి మానవత్వాన్ని చాటుకున్న ముస్లిం మహిళ..!

కులం మతం పేరిట విద్వేషాలకు పోతున్న ఈ రోజుల్లో ఓ ముస్లిం మహిళలో మానవత్వం పరిమళించింది. కన్నుమూసిన వృద్ధురాలికి చివరి మజిలీ అయిన.. అంతిమ సంస్కారాలు చేసి గొప్ప మనసు చాటుకుంది. అనారోగ్యంతో ప్రాణాలు విడిచిన వృద్ధురాలికి దహన సంస్కారాలు చేసేందుకు అయినా వారు ముందుకు రాకున్నా.. ముస్లిం మహిళ ఆ తంతు పూర్తి చేసి మానవత్వం చాటుకుంది. మానవత్వానికి కుల మతాలు అతీతమని చాటి చెప్పింది.

Humanity: హిందూ మహిళకు అంతిమ సంస్కారాలు చేసి మానవత్వాన్ని చాటుకున్న ముస్లిం మహిళ..!
Last Rites
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Mar 26, 2024 | 11:39 AM

కులం మతం పేరిట విద్వేషాలకు పోతున్న ఈ రోజుల్లో ఓ ముస్లిం మహిళలో మానవత్వం పరిమళించింది. కన్నుమూసిన వృద్ధురాలికి చివరి మజిలీ అయిన.. అంతిమ సంస్కారాలు చేసి గొప్ప మనసు చాటుకుంది. అనారోగ్యంతో ప్రాణాలు విడిచిన వృద్ధురాలికి దహన సంస్కారాలు చేసేందుకు అయినా వారు ముందుకు రాకున్నా.. ముస్లిం మహిళ ఆ తంతు పూర్తి చేసి మానవత్వం చాటుకుంది. మానవత్వానికి కుల మతాలు అతీతమని చాటి చెప్పింది. ఈ ఘటన గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

యాదాద్రి జిల్లా భువనగిరి మండలం రాయగిరి చెందిన ముస్లిం దంపతులు యాకూబీ, చోటులకు మొదటి నుంచి సామాజిక సేవ పట్ల ఆసక్తి ఉండేది. దీంతో రాయగిరిలో సహృదయ అనాథ వృద్ధాశ్రమాన్ని ఏర్పాటుచేసి 15 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. అనాథ వృద్ధాశ్రమానికి వచ్చే వారి పట్ల ప్రేమ ఆప్యాయతలు కనబరుస్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల గ్రామానికి చెందిన చంద్రకళ(72) భర్త కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు. ఈమెకు పిల్లలు లేకపోవడంతో ఒంటరిగా ఉంటుంది. వృద్ధాప్యంలో చంద్రకళ అలనా పాలన చూసేవారు లేకపోవడంతో ఆమె సోదరుడు గంగ ప్రసాద్ ఈ ఏడాది జనవరి 19న రాయగిరి లోని సహృదయ అనాథ వృద్ధాశ్రమంలో చేర్పించాడు.

అనారోగ్యంతో ఉన్న చంద్రకళ బాగోగులను ఆశ్రమ నిర్వాహకులు యాకూబీ, చోటు చూస్తున్నారు. తీవ్ర అనారోగ్యానికి గురైన చంద్రకళ మార్చి 23వ తేదీన మృతి చెందింది. ఈ విషయాన్ని చంద్రకళ సోదరుడు గంగాప్రసాద్‌కు ఆశ్రమ నిర్వాహకులు సమాచారం ఇచ్చారు. అయితే చంద్రకళ మృతదేహం కోసం సోదరుడు గంగా ప్రసాద్ రాక కోసం ముస్లిం దంపతులు రెండు రోజులపాటు వేచి చూశారు. చంద్రకళ మృతదేహాన్ని తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహించేందుకు సోదరుడు గంగా ప్రసాద్ నిరాకరించాడు. దీంతో ఆశ్రమ నిర్వాహకులు యాకూబీ, చోటు రాయిగిరి శ్మశాన వాటికలో చంద్రకళ మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు.

హైందవ సంప్రదాయం ప్రకారం.. చితి చుట్టూ కుండతో తిరిగి.. యాకూబీనే తన చేతితో చితికి నిప్పంటించి దహన సంస్కారాలు చేశారు. మృతి చెందిన వృద్ధురాలికి హిందూ సంప్రదాయం మేరకు అన్నీ తానై అంత్యక్రియలు నిర్వహించిన ముస్లిం మహిళ యాకుబీ మానవత్వాన్ని పరిమళింపజేసింది. అయితే ముస్లిం మహిళ అయినప్పటికీ హిందూ సంప్రదాయం ప్రకారం దహనసంస్కారాలు చేయడంపై పలువురు ఆమెను అభినందించారు. ఇప్పటివరకు యాకూబీ, చోటు దంపతులు యాదాద్రి, వరంగల్‌ జిల్లాల్లో 200మంది అనాథలకు దహనసంస్కారాలు నిర్వహించారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…