AmritMahotsav : 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ 75 వారాలపాటు దేశవ్యాప్తంగా 75 కార్యక్రమాలు.. నేటి నుంచే కౌంట్ డౌన్
AmritMahotsav : భారత స్వాతంత్ర్య 75 వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 75 వారాలపాటు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున 75 కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్రం తలపెట్టింది. ఇందుకోసం..
AmritMahotsav : భారత స్వాతంత్ర్య 75 వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 75 వారాలపాటు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున 75 కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్రం తలపెట్టింది. ఇందుకోసం ఇవాళ ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరిట స్వాతంత్ర్య సంబరాలను ప్రధాని నరేంద్రమోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఉదయం గుజరాత్ లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. ఆశ్రమంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి మోదీ పూలమాల వేశారు. ఆశ్రమం సందర్శించిన సందర్భంగా సందర్శకుల పుస్తకంలో ప్రధాని మోదీ సంతకం చేశారు. ఈ సందర్భంగా మోదీ, “ఈ పండుగ సందర్భంగా, దేశం.. స్వాతంత్ర్య ఉద్యమం యొక్క ప్రతి అడుగు, ప్రతి క్షణం గుర్తుంచుకుంటుంది. అంతేకాదు, భవిష్యత్ అభివృద్ధికి కొత్త శక్తితో ముందుకు సాగుతుంది. బాపు ఆశీర్వాదంతో, భారతీయులైన మనం మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తామని, నిరూపిస్తారని నేను నమ్ముతున్నాను. అదే, ఈ అమృత్ మహోత్సవ్ యొక్క లక్ష్యం. ” అని మోదీ పేర్కొన్నారు.’
ఇవాళ ప్రధాని మోదీ భారతదేశ స్వాతంత్ర్య 75 వ వార్షికోత్సవానికి 75 వారాల కౌంట్‌డౌన్ గుజరాత్ లోని సబర్మతి ఆశ్రమం నుంచి ప్రారంభించారు. ‘అమృత్ మహోత్సవ్’ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని మోదీ స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులర్పించారు. భారతదేశం తన విజయాలను ప్రపంచానికి ప్రదర్శిస్తుందన్నారు. స్వాతంత్య్ర సంగ్రామమే కాకుండా, మన ఆలోచనలు, విజయాలు, చర్యలు, సంకల్పం అనే నాలుగు స్తంభాలు భారతదేశ కలలు, విధులను ప్రేరేపిస్తాయని మోదీ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్ నుంచి మొదలైన 386 కిలోమీటర్ల ‘దండి మార్చ్’ ను మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఏప్రిల్ 6 న నవసరీ జిల్లాలోని దండిలో ఈ యాత్ర ముగుస్తుంది. ఈ వేడుకల్లో భాగంగా 75 కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది, ఈ ఉత్సవం 2023 ఆగస్టు 15 వరకు జరుగుతుంది.