AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దాహం వేయట్లేదని నీళ్లు తాగట్లేదా..? అయితే మీరు డేంజర్ జోన్‌లో ఉన్నట్లే..!

సాధారణంగా ఎండలో తిరిగే వారికే డీహైడ్రేషన్ అవుతుందని మనం భావిస్తాం. కానీ, చల్లని ఏసీ గదుల్లో కూర్చుని పనిచేసే ఐటీ, ఇతర రంగాల ఉద్యోగులు దీని బారిన పడే అవకాశం ఇంకా ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏసీ గదుల్లో పనిచేసే ఆఫీసు ఉద్యోగులు ఎదుర్కొనే నిశ్శబ్ద ముప్పు 'డీహైడ్రేషన్'.

దాహం వేయట్లేదని నీళ్లు తాగట్లేదా..? అయితే మీరు డేంజర్ జోన్‌లో ఉన్నట్లే..!
Office Ac Can Make Dehydrated
Balaraju Goud
|

Updated on: May 07, 2026 | 5:13 PM

Share

సాధారణంగా ఎండలో తిరిగే వారికే డీహైడ్రేషన్ అవుతుందని మనం భావిస్తాం. కానీ, చల్లని ఏసీ గదుల్లో కూర్చుని పనిచేసే ఐటీ, ఇతర రంగాల ఉద్యోగులు దీని బారిన పడే అవకాశం ఇంకా ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏసీ గదుల్లో పనిచేసే ఆఫీసు ఉద్యోగులు ఎదుర్కొనే నిశ్శబ్ద ముప్పు ‘డీహైడ్రేషన్’.

హైదరాబాద్ ప్రముఖ హాస్పిటల్స్ నెఫ్రాలజిస్ట్ విశ్లేషణ ప్రకారం.. బయట ఎండలో ఉండేవారికి చెమట పట్టడం వల్ల దాహం వేస్తుంది, తద్వారా వారు నీళ్లు తాగుతారు. కానీ ఏసీ గదుల్లో ఉండేవారికి చెమట పట్టదు, వేడి తెలియదు. దీనివల్ల మెదడుకు అందాల్సిన ‘దాహం’ సంకేతాలు బలహీనపడతాయి. శరీరం లోపల నీటి శాతం తగ్గుతున్నా, మనకు దాహం అనిపించకపోవడమే అసలైన ప్రమాదం. ఎయిర్ కండీషనర్లు గదిలోని తేమను పీల్చేస్తాయి. ఈ పొడి గాలి మన చర్మం నుండి, అలాగే మనం వదిలే శ్వాస ద్వారా శరీరంలోని తేమను నిరంతరం లాగేస్తుంటుంది. దీనిని ‘ఇన్సెన్సిబుల్ వాటర్ లాస్’ అంటారు. ఇది కంటికి కనిపించదు కాబట్టి, మన శరీరం ఎండిపోతున్న విషయం మనకు అర్థం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చాలామంది ఆఫీసులో అలసటను తగ్గించుకోవడానికి పదేపదే టీ లేదా కాఫీలు తాగుతుంటారు. తాము ద్రవ పదార్థాలు తీసుకుంటున్నామని వారు అనుకుంటారు, కానీ వాస్తవం దీనికి విరుద్ధం. కెఫిన్ అధికంగా ఉండే పానీయాలు ‘డైయూరెటిక్స్’ (Diuretics) గా పనిచేస్తాయి. అంటే ఇవి శరీరంలోని నీటిని మూత్రం రూపంలో బయటకు పంపేలా చేస్తాయి. ఫలితంగా హైడ్రేషన్ పెరగడానికి బదులు, శరీరం మరింత నీటిని కోల్పోతుందని వైద్యులు వివరిస్తున్నారు.

డీహైడ్రేషన్ లక్షణాలు ఎలా ఉంటాయి?

చాలామంది ఆఫీసులో సాయంత్రం అయ్యేసరికి వచ్చే అలసటను ‘వర్క్ స్ట్రెస్’ అనుకుంటారు. కానీ అవి డీహైడ్రేషన్ లక్షణాలు కావచ్చని వైద్యులు హెచ్చరిస్తు్న్నారు.

* తేలికపాటి తలనొప్పి, నీరసం.

* పనిపై ఏకాగ్రత తగ్గడం.

* కళ్లు మంటలు పుట్టడం లేదా చర్మం పొడిబారడం.

* మూత్రం ముదురు పసుపు రంగులో రావడం.

దీర్ఘకాలికంగా నీరు తక్కువగా తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడటం, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు (UTI), మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయి. కిడ్నీల పనితీరుపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

నిపుణుల సూచనలుః

1. వాటర్ అలారమ్స్: దాహం వేసే వరకు ఆగకుండా, ప్రతి గంటకు ఒక గ్లాసు నీరు తాగేలా రిమైండర్ పెట్టుకోవాలి.

2. కెఫిన్ తగ్గించండి: టీ, కాఫీలకు బదులుగా మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం వంటివి తీసుకోవాలి.

3. నీటి బాటిల్ అందుబాటులో: మీ పని డెస్క్‌పై ఎప్పుడూ నిండుగా ఉన్న నీటి బాటిల్‌ను ఉంచుకోండి.

4. చిన్న విరామాలు: గంటకోసారి సీటులో నుంచి లేచి కాసేపు నడవడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడి శరీరానికి సంకేతాలు అందుతాయి.

ఏసీ సౌకర్యం మీకు పనిలో హాయిని ఇవ్వవచ్చు, కానీ మీ శరీరానికి అవసరమైన నీటిని మాత్రం అది అందించలేదు. కాబట్టి, దాహం వేయకపోయినా నీళ్లు తాగడం అలవాటు చేసుకోవడమే ఆరోగ్యానికి అసలైన సూత్రం..!

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us