AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోహినూర్‌ భారత్‌దే... తిరిగివ్వమని అడుగుతా

కోహినూర్‌ భారత్‌దే… తిరిగివ్వమని అడుగుతా

Phani CH
|

Updated on: May 06, 2026 | 7:33 PM

Share

న్యూయార్క్ మేయర్ మమ్దానీ కోహినూర్ వజ్రాన్ని భారత్‌కు తిరిగి ఇవ్వాలని కింగ్ చార్లెస్‌ను కోరతాననడంతో ఈ అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. 1947 నుండి భారత్ ప్రయత్నిస్తుండగా, పాక్ వంటి దేశాలూ డిమాండ్ చేస్తున్నాయి. పల్నాడులో పుట్టి, మొఘల్, పర్షియన్, సిక్కు రాజ్యాలు దాటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేతికి చేరిన ఈ వజ్రం సుదీర్ఘ చరిత్ర కలిగి ఉంది. దీనిని తిరిగి భారత్‌కు తీసుకురావాలని డిమాండ్లు కొనసాగుతున్నాయి.

చారిత్రక ‘కోహినూర్‌ వజ్రం’ అంశం తాజాగా మరోసారి తెర పైకి వచ్చింది. తనకు అవకాశం వస్తే.. ఆ వజ్రాన్ని భారత్‌కు తిరిగి ఇచ్చేయాలని బ్రిటన్‌ రాజు చార్లెస్ 3ని తాను కోరతానని న్యూయార్క్‌ మేయర్‌ జోహ్రాన్‌ మమ్దానీ అన్నారు. భారతీయ మూలాలున్న ఈ మేయర్‌ తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలతో మరోసారి కోహినూర్ చరిత్ర ప్రపంచం దృష్టికి వచ్చింది. బ్రిటన్‌ రాజు చార్లెస్‌ 3 , రాణి కెమిల్లా ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం న్యూయార్క్‌లోని 9/11 స్మారక చిహ్నాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమానికి ముందు మమ్దానీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కోహినూర్‌ అంశాన్ని ప్రస్తావించారు. ‘ఒక కార్యక్రమంలో కాకుండా.. రాజు చార్లెస్‌ 3తో విడిగా మాట్లాడే అవకాశం వస్తే.. కోహినూర్‌ను భారత్‌కు తిరిగి ఇచ్చేయాలని కోరతాను’ అని మమ్దాని అన్నారు. ఆ తర్వాత రాజు చార్లెస్‌3, మమ్దానీల మధ్య సంభాషణ జరిగింది. అయితే, వీరి చర్చల్లో కోహినూర్ వజ్రం గురించి ప్రస్తావన వచ్చిందా, లేదా అనేది తెలియలేదు. న్యూయార్క్‌ మేయర్‌ వ్యాఖ్యలపై స్పందించేందుకు బకింగ్‌హామ్‌ ప్యాలెస్ నిరాకరించింది. రాజు, మమ్దానీల మధ్య చర్చల వివరాలను మేయర్‌ కార్యాలయం వెల్లడించలేదు. ఇక.. కోహినూర్ ను భారత్ కు తెప్పించాలని భారత ప్రభుత్వం 1947 నుంచే ప్రయత్నం చేస్తోంది . 1953లో బ్రిటన్ రాణిగా పట్టాభిషిక్తురాలైన ఎలిజబెత్-2కు విన్నపం చేసింది భారత్. అప్పట్లో కోహినూర్ ను భారత్ కు తెప్పించాలంటూ రాజ్యసభలో తీర్మానాన్ని ప్రవేశ పెట్టి 50 మంది ఎంపీలు సంతకాలు చేశారు. 2009లోనూ దీన్ని తిరిగి ఇండియాకు తెప్పించాలని మహాత్మా గాంధీ మనవడు తుషార్‌ గాంధీ డిమాండ్‌ చేశారు . 2013లో… కోహినూర్ తిరిగి ఇవ్వాలని భారత్ చేస్తున్న డిమాండ్ ను నాటి బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ తోసిపుచ్చారు. కోహినూర్ డైమండ్ తిరిగిచ్చే అంశం 2025 మేలోనూ వార్తల్లో నిలిచింది. గత ఏడాది బ్రిటన్‌ సాంస్కృతిక, మీడియా, క్రీడల శాఖ మంత్రి లీసా నాండీ భారత్ లో పర్యటించారు. ఈ సమయంలో ‘కోహినూర్ ను తిరిగిస్తారా?’ అనే ప్రశ్న మీడియా నుంచి ఆమెకు ఎదురైంది. దీనికి ఆమె బదులిస్తూ..భారత్‌, బ్రిటన్ మధ్య సాంస్కృతిక కళాఖండాల మార్పిడి కోసం ఉన్నత స్థాయిలో సంప్రదింపులు జరుగుతున్నట్లు చెప్పారు. అన్నీ సానుకూలంగా జరిగితే.. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం రావొచ్చని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశంపై భారత్‌ సాంస్కృతిక శాఖ మంత్రితోనూ చర్చించినట్లు ఆమె చెప్పారు. మరోవైపు.. కోహినూర్ మాదేనంటూ పాకిస్తాన్, ఇరాన్, అప్గానిస్తాన్ వంటి దేశాలూ గతంలో డిమాండ్ చేశాయి. ఆ వజ్రం తమదేనంటూ పాక్‌ ప్రధాని భుట్టో 1976లో బ్రిటన్‌ ప్రధానికి లేఖ రాశారు. తర్వాత 2000 సంవత్సరంలో కోహినూర్ మాదేనంటూ తాలిబాన్లు ఒక ప్రకటన చేశారు. ఇక.. ఇంత చర్చకు కారణమైన కోహినూర్ కు సుదీర్ఘమైన చరిత్రే ఉంది. క్రీ.శ 1630 ప్రాంతాల్లో నేటి పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లికి సమీపంలోని కోల్లూరు గ్రామంలో ఒక వితంతువుకి ఈ వజ్రం దొరికగా, ఆమె దీన్ని గ్రామ పెద్దకు ఇచ్చారు. అప్పట్లో అది 700 క్యారెట్ల పైనే ఉండేదని , కానీ దాన్ని ఆ గ్రామ పెద్ద ముక్కలు చేశాడనీ చెబుతారు. తర్వాత అది గ్రామ పెద్ద చేతి నుంచి.. నాటి కుతుబ్ షాహీల మంత్రి, వజ్రాల వ్యాపారి అయిన మీర్ జుమ్లా వద్దకు ఈ వజ్రం చేరింది. 1645-60 ప్రాంతంలో మొఘల్ చక్రవర్తి షాజహాన్‌ను ప్రసన్నం చేసుకునేందుకు గోల్కొండ నవాబులు కోహినూర్‌ను ఆయనకు కానుకగా ఇచ్చారు. అలా మొఘలుల దగ్గరకు చేరిన ఆ వజ్రం, నెమలి సింహాసనంలో ఒదిగిపోయింది. 1739లో పర్షియా పాలకుడు నదీర్ షా దిల్లీ మీద దండయాత్ర చేసి భారీ సంపదను దోచుకుని పోతూపోతూ నెమలి సింహాసనాన్నీ పట్టుకుపోయాడు. అతని దగ్గర నుంచి అహ్మద్ షా అబ్దాలి వద్దకు ఇది చేరింది. తర్వాత 1813లో తిరిగి పంజాబ్ మహారాజు..రాజా రంజిత్ సింగ్ చేతికి కోహినూర్ వచ్చింది. ఆ తరువాత 1849లో పంజాబ్ పాలకుడైన 10ఏళ్ల బాలుడిని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దించేసి ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తెచ్చుకుంది . అలా కోహినూర్ వారి వద్దకు చేరింది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఆ వజ్రాన్ని నాటి బ్రిటన్ రాణి విక్టోరియాకు బహూకరించారు. 1851లో జరిగిన ది గ్రేట్ ఎగ్జిబిషన్‌లో కోహినూర్‌ను ప్రదర్శించారు. ఆ తరువాత కొన్ని దుష్టశక్తులు ఉన్నాయనే కారణంతో దాన్ని కోసి మార్పులు చేశారు. తర్వాతి రోజుల్లో అది రాజవంశ పాలకుల కిరీటంలో భాగమైంది. కోహినూర్ వజ్రం కేవలం మహిళలకే కలిసొచ్చిందని, దీనిని ధరించిన పురుషులంతా జీవితంలో అష్టకష్టాలు పడ్డారనే మాట కూడా ఉంది. 13వ శతాబ్దం చివరలో అల్లావుద్దీన్ ఖిల్జీ తన సొంత మామను చంపి ఢిల్లీ సుల్తానేట్‌ను చేజిక్కించుకున్నాక, దక్షిణ భారతదేశ దండయాత్రల ద్వారా ఈ వజ్రాన్ని సంపాదించాడు. కాలక్రమేణా ఇది షాజహాన్ నిర్మించిన ప్రసిద్ధ నెమలి సింహాసనాన్ని అలంకరించింది. అయితే,తన కుమారుడు ఔరంగజేబు చేతిలోనే బందీ అయిన షాజహాన్ జీవితాంతం జైలు పాలయ్యారు. 1739లో పర్షియన్ పాలకుడు నాదిర్ షా ఢిల్లీని ఆక్రమించి వేలాది మందిని ఊచకోత కోసి ఈ వజ్రాన్ని ఎత్తుకెళ్లినా.. 1747లో అతడూ హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత ఈ వజ్రం సిక్కు సామ్రాజ్య పాలకుడు మహారాజా రంజిత్ సింగ్ చేతికి వచ్చింది. 1839లో ఆయన మరణానంతరం ఆయన కుమారుడు, మనవడు కూడా అనుమానాస్పద స్థితిలో మరణించారు. చివరగా 1849లో నాటి సిక్కు పాలకుడైన పదేళ్ల బాలుడు మహారాజా దులీప్ సింగ్ ద్వారా లాహోర్ ఒప్పందం ప్రకారం కోహినూర్‌ను విక్టోరియా రాణికి అప్పగించారు. ఈ వజ్రం పురుషులకు అరిష్టం తెస్తుందనే నమ్మకంతో, బ్రిటిష్ రాజకుటుంబంలోని పురుషులెవరూ దీనిని ముట్టుకోలేదు. కానీ, క్వీన్ విక్టోరియా నుండి క్వీన్ ఎలిజబెత్ II వరకు అందరూ దీనిని తమ కిరీటాలలో అలంకరించుకున్నారు. వీరంతా గొప్ప పాలన కూడా అందించడంతో ఇది మహిళలు మాత్రమే ధరించదగిన వజ్రమనే నమ్మకం బలపడింది. ఇప్పుడు లండన్ టవర్‌లోని జ్యువెల్ హౌస్‌లో కోహినూర్ ప్రజా ప్రదర్శనలో ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా సందర్శకులను ఆకర్షిస్తూనే ఉన్నప్పటికీ, దానిని భారతదేశానికి తిరిగి ఇవ్వాలనే డిమాండ్లు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. మరి ఈ డిమాండ్ ఏనాటికైనా నిజమవుతోందో లేదో వేచి చూడాల్సిందే.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాపం! కృష్ణరాజు సొంత కొడుకు.. ఎలా చనియాడో తెలుసా

తామర ఆకులనే ఫేస్‌ మాస్క్‌లుగా..! వేసవిలో వైరల్ ట్రెండ్

విమానం ఎక్కేముందు ప్రతీసారీ.. వారికి నోట్‌ పంపుతానన్న ఆమిర్‌

Trisha: అసెంబ్లీ బరిలో త్రిష ?? విజయ్ వదిలేసే స్థానం నుంచి పోటీ..!

విదేశం నుంచి వచ్చి ఓటేసిన విజయ్‌ ఫ్యాన్.. ఆ ఒక్క ఓటుతో గెలిచిన టీవీకే అభ్యర్థి

Follow Us