Chia Seeds Benefits: ఈ గింజలు చిన్నవిగా ఉన్నా.. తింటే మాత్రం మస్తు లాభాలుంటాయి..!
చియా విత్తనాలు చిన్నవిగా కనిపించినా వాటిలో ఉన్న పోషక పదార్థాలు ఎంతో శక్తివంతంగా ఉంటాయి. మామూలుగా వీటిని ఉదయాన్నే తీసుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ రాత్రి నిద్రించే ముందు వీటిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు అద్భుతంగా ఉంటాయి.

చియా గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. రాత్రి తీసుకునే ఆహారం సరిగ్గా జీర్ణమయ్యేలా ఇవి సహాయపడతాయి. జీర్ణక్రియను మెరుగుపరచడం ద్వారా కాలేయం ఉదయం సజావుగా పనిచేయడానికి తోడ్పడుతుంది. మలబద్ధకంతో బాధపడే వారికి చియా గింజలు ఉపశమనం ఇవ్వగలవు.
చియా గింజలు నీటిలో నానబెట్టిన తర్వాత దాదాపు పది రెట్లు పెరిగి జెల్ లా మారతాయి. ఇవి కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. ఫలితంగా రాత్రి వేళ ఎక్కువగా తినకుండా నియంత్రించవచ్చు. తక్కువగా తినడమే కాదు ఆరోగ్యాన్ని కూడా కాపాడటంలో ఇవి మంచి సహాయంగా ఉంటాయి.
నానబెట్టిన చియా గింజలు నీటిని నిలిపి ఉంచే శక్తి కలిగి ఉంటాయి. శరీరం నిద్రలో ఉండగా నీరు కోల్పోకుండా రక్షిస్తాయి. ముఖ్యంగా వేసవిలో ఇవి ఎక్కువ ఉపయోగపడతాయి. రాత్రి చియా గింజలు తీసుకుంటే శరీరం హైడ్రేటెడ్ గా ఉండి ఉదయం తాజా భావన కలుగుతుంది.
చియా విత్తనాల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియం, మెగ్నీషియం, ప్రోటీన్లు వంటి అనేక శక్తివంతమైన పోషకాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని శక్తివంతంగా ఉంచడంతో పాటు ఎముకలకు బలాన్ని అందిస్తాయి. రాత్రి తీసుకుంటే ఈ పోషకాలు నిద్ర సమయంలో శరీరంలో నెమ్మదిగా విడుదలవుతూ పని చేస్తాయి.
ఈ విత్తనాల్లో ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది. ఇది శరీరంలో సెరోటోనిన్, మెలటోనిన్ అనే హార్మోన్లను ఉత్పత్తి చేసే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఇది నిద్ర బాగా రావడానికి సహాయపడుతుంది. నిద్రలేమితో బాధపడే వారు ఈ చియా గింజలను తినడం వల్ల మంచి నిద్ర అనుభవించగలుగుతారు.
చియా విత్తనాలు తిన్న తర్వాత శక్తిని క్రమంగా విడుదల చేస్తాయి. ఈ ప్రక్రియ వల్ల రాత్రంతా గ్లూకోజ్ స్థాయిలు స్థిరంగా ఉంటాయి. ఇది ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి బాగా ఉపయోగపడుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా మారకుండా నియంత్రణలో ఉంచేందుకు ఇది సహాయపడుతుంది.
చియా గింజలు చిన్నగా కనిపించినా వాటిలో ఉన్న శక్తి చాలా ఎక్కువ. రాత్రి వేళ నానబెట్టిన చియా గింజలను తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. ఇది నిద్రకు తోడ్పడటమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరిచి, ఎక్కువగా తినే అలవాటు తగ్గిస్తుంది. శరీరాన్ని తేమగా ఉంచుతుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




