పిల్లల్లో ఏకాగ్రత పెంచే సూపర్ ఫుడ్స్ ఇవే..! మిస్సవ్వకండి..!
పిల్లల మెదడు ఆరోగ్యంగా ఉండి తెలివితేటలు పెరగాలంటే సరైన ఆహారం ఎంతో ముఖ్యం. కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు మెదడు శక్తిని పెంచి ఏకాగ్రతను మెరుగుపరచేలా సహాయపడతాయి. బాదం, వాల్ నట్స్, గుడ్డు, బెర్రీలు, ఆకుకూరలు, ఓట్స్ వంటి వాటిని పిల్లల డైట్‌లో చేర్చడం వల్ల వారు మరింత తెలివిగా, చురుకుగా ఎదుగుతారు.

పిల్లల మెదడు ఆరోగ్యంగా ఉండి మంచి తెలివితేటలు పెరగాలంటే సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. మెదడు శక్తిని పెంచే కొన్ని ముఖ్యమైన ఆహార పదార్థాలు ఉన్నాయి. ఇవి పిల్లల్లో ఏకాగ్రత, నేర్చుకునే శక్తిని మెరుగుపరిచే విధంగా పనిచేస్తాయి. అలాంటి ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం.
గుడ్డు పిల్లల మెదడు అభివృద్ధికి చాలా ఉపయోగకరం. ఇందులో విటమిన్ B12, ప్రోటీన్, సెలీనియం పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు మెదడుకు శక్తిని అందించి ఏకాగ్రతను పెంచుతాయి. పిల్లలకు ప్రతిరోజూ ఒక గుడ్డు తినిపించడం వల్ల వారి మేధస్సు మరింత చురుకుగా మారుతుంది.
బాదం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్ E, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మెదడును ఆరోగ్యంగా ఉంచి మతిమరుపు సమస్యలను తగ్గించేందుకు సహాయపడుతాయి. రోజూ నాలుగు నుంచి ఆరు బాదం గింజలు తినిపిస్తే పిల్లల మేధస్సు పెరుగుతుంది.
వాల్ నట్స్ ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా కలిగి ఉండటంతో మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. పిల్లల తెలివితేటలు పెరగాలంటే వారికీ ప్రతిరోజూ కొన్ని వాల్ నట్స్ ను తినిపించడం ఉత్తమం.
స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్ప్‌బెర్రీ వంటి బెర్రీలు మెదడు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో విటమిన్ C, ఫ్లేవనాయిడ్లు అధికంగా ఉండటంతో మెదడు కణాలను నష్టపోకుండా కాపాడుతాయి. బెర్రీలు తినడం వల్ల పిల్లలు త్వరగా నేర్చుకునే శక్తిని పెంచుకోగలరు.
పాలకూర, మెంతి, బ్రోకలీ, కాకరకాయ వంటి ఆకుకూరలు మెదడుకు అవసరమైన ఐరన్, విటమిన్లు, ఖనిజాలను అందిస్తాయి. ఇవి మెదడు అభివృద్ధికి ఎంతో సహాయపడుతాయి. పిల్లలు వీటిని ఇష్టంగా తినేలా రుచికరమైన వంటల రూపంలో అందించాలి.
ఓట్స్ లేదా ఓట్‌మీల్ పిల్లలకు ఉత్తమమైన బ్రేక్‌ఫాస్ట్ ఆహారం. ఇందులో అధికంగా ఉండే ఫైబర్ మెదడుకు శక్తిని అందించడమే కాకుండా జీర్ణవ్యవస్థను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఉదయాన్నే ఓట్స్ తినిపిస్తే పిల్లలు రోజంతా ఉల్లాసంగా, చురుగ్గా ఉంటారు.
పాల ఉత్పత్తులు పిల్లల మెదడు అభివృద్ధికి అవసరమైన కాల్షియం, ప్రోటీన్, విటమిన్ B12 లను అందిస్తాయి. వీటిలో పెరుగు, చీజ్, వెన్న వంటి ఆహారాలు మెదడుకు చక్కటి పోషకాలను అందిస్తాయి.
పిల్లల మేధస్సు, బుద్ధి, ఏకాగ్రత మెరుగుపడాలంటే వారికీ సరైన పోషకాహారం అందించడం చాలా ముఖ్యం. తెలివిగా, ఆరోగ్యంగా ఎదగాలంటే ఈ ఆహారాలను వారి రోజువారీ ఆహారంలో చేర్చడం మంచిది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)