AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sitting Disease: గంటల తరబడి కుర్చీలో కూర్చుంటున్నారా.. అయితే ఈ షాకింగ్ న్యూస్ మీ కోసమే..

అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్‌లో ప్రచురించబడిన ఓ పరిశోధన ప్రకారం, ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కండరాలు బలహీనపడతాయి. అంతేకాదు వాటిలో రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. జీవక్రియ కూడా బలహీనమవుతుంది. ఇది గుండె జబ్బులు, మధుమేహం, స్ట్రోక్‌తో సహా అనేక తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది. కనుక ఈ రోజు జర్నల్‌లో ప్రచురించిన ఎక్కువసేపు కూర్చుంటే కలిగే ఆరోగ్య ప్రమాదాల గురించి తెలుసుకుందాం.. 

Sitting Disease: గంటల తరబడి కుర్చీలో కూర్చుంటున్నారా.. అయితే ఈ షాకింగ్ న్యూస్ మీ కోసమే..
Sitting Disease
Surya Kala
|

Updated on: Mar 08, 2024 | 12:19 PM

Share

ప్రస్తుతం ఉద్యోగం చేసే వారిలో శారీరక శ్రమ కంటే మానసికంగా కష్టపడేవారు ఎక్కువ. ఇంకా చెప్పాలంటే  గంటల తరబడి ఒకే చోట కూర్చుని ఉద్యోగం చేయాల్సి వస్తుంది. అంతేకాదు రోజూ తగిన వ్యాయామం చేసే సమయం కూడా తక్కువే.. అయితే ఇలా చేయడం వల్ల మీకు ప్రాణాంతకం కావచ్చు. ఎక్కువ సేపు నిరంతరం కూర్చోవడం వల్ల అకాల మరణాల ముప్పు 30 శాతం పెరుగుతుందని ఇటీవల ఒక పరిశోధన వెల్లడించింది. తీవ్రమైన విషయం ఏమిటంటే.. క్రమం తప్పకుండా వ్యాయామం చేసినప్పటికీ, ఎక్కువసేపు కూర్చున్నా అది ప్రమాదకరం. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్‌లో ప్రచురించబడిన ఓ పరిశోధన ప్రకారం, ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కండరాలు బలహీనపడతాయి. అంతేకాదు వాటిలో రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. జీవక్రియ కూడా బలహీనమవుతుంది. ఇది గుండె జబ్బులు, మధుమేహం, స్ట్రోక్‌తో సహా అనేక తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది. కనుక ఈ రోజు జర్నల్‌లో ప్రచురించిన ఎక్కువసేపు కూర్చుంటే కలిగే ఆరోగ్య ప్రమాదాల గురించి తెలుసుకుందాం..

మనిషి బరువు, మధుమేహం మధ్య చాలా అవినావభావ సంబంధం ఉంది. బరువు పెరగడంతో మధుమేహం వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. ఎక్కువసేపు కూర్చుంటే కొవ్వును విచ్ఛిన్నం చేసే ఎంజైమ్ లైపోప్రొటీన్ లైపేస్ నెమ్మదిగా పని చేయడం ప్రారంభిస్తుంది. దీని కారణంగా బరువు పెరుగుతారు.  అటువంటి పరిస్థితిలో ట్రైగ్లిజరైడ్స్ , బ్లడ్ షుగర్ పెరగడం ప్రారంభమవుతుంది. ఇన్సులిన్ బ్యాలెన్స్ కోల్పోతుంది. ఇది శరీరంలో మధుమేహానికి కారణం అవుతుంది. అందువల్ల ప్రతి 30 నుండి 60 నిమిషాలకు ఒకసారి సీటు నుంచి లేచి కనీసం 3 నుండి 5 నిమిషాలు అటు ఇటు తిరగండి.

కండరాలు బలహీనపడటానికి అతి పెద్ద కారణం

ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోవడం వల్ల కండరాలపై చెడు ప్రభావం పడుతుంది. దీని కారణంగా కండరాల పని తీరు తగ్గడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా కండరాలలో నిల్వ చేయబడిన ప్రోటీన్ విరిగిపోయే అవకాశం పెరుగుతుంది. అటువంటి సమయంలో కండరాల పని తీరుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. బలం కూడా తగ్గుతుంది. అందువల్ల ప్రతిసారీ కూర్చున్న స్థలం నుంచి లేచి కండరాలను సాగదీయండి. అలాగే వారానికి రెండు మూడు సార్లు కండరాలకు బలం ఇచ్చే విధంగా యోగా చేయండి.

ఇవి కూడా చదవండి

తీవ్రమైన వెన్ను, మెడ నొప్పి

తొమ్మిది నుంచి పది గంటల పాటు ఆఫీసులో కూర్చొని పనిచేసేవారిలో ఎక్కువ మందికి వెన్ను, మెడ నొప్పులు వస్తుంటాయి. ఈ అకారణంగా చిన్న సమస్య కూడా జీవితకాల బాధను ఇస్తుంది. ఎక్కువ సేపు ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల వెన్నుపూసలోని ఇంటర్వర్‌టెబ్రల్ డిస్క్‌లు, కీళ్లు, లిగమెంట్లు, కండరాలపై ఒత్తిడి పడుతుంది. ఇది వెన్ను, మెడ నొప్పికి కారణమవుతుంది. అందువల్ల ప్రతి 30 నిమిషాలకు మెడను ఎడమ, కుడి వైపుకు తిప్పండి. నిలబడి వెన్నెముకకు విశ్రాంతి ఇవ్వండి.

గుండె జబ్బులు లేదా గుండెపోటు ప్రమాదం

అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్‌లో ప్రచురించబడిన ఈ నివేదికలో ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చునే లేదా వ్యాయామం చేయని వ్యక్తులకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం అధికం అని పేర్కొంది. అంతే కాదు అధిక బరువు లేనివారిలో కూడా రిస్క్ కూడా ఎక్కువే. ఎందుకంటే ఒకే చోట కూర్చోవడం వల్ల గుండె ధమనులు గట్టిపడతాయి. శరీరంలో రక్త ప్రసరణ కూడా దెబ్బతింటుంది. కనుక వారానికి కనీసం 150 నిమిషాల వ్యాయామం చేయాలి.

ఎముకలు బలహీనం

ఎక్కువ సేపు కూర్చోవడం లేదా వ్యాయామం చేయకపోవడం సౌకర్యంగా భావించవచ్చు. అయితే ఈ అలవాట్లు ఎముకలను బలహీనపరుస్తాయి. నిరంతరం కూర్చోవడం వల్ల తుంటి, కాళ్ల ఎముకలపై అధిక ఒత్తిడి ఏర్పడుతుంది. ఎముకలకు బలాన్ని ఇచ్చే ఖనిజాలకు నష్టం కలిగిస్తుంది. ఈ స్థితిలో ఆస్టియోపెనియా లేదా బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

దేశంలోని ప్రఖ్యాత కార్డియాలజిస్ట్ డాక్టర్ మొహ్సిన్ వలీ జర్నల్ ఆఫ్ ది అమెరికన్ హార్ట్ అసోసియేషన్‌లో ప్రచురించిన నివేదికపై ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో వేగంగా పెరుగుతున్న ఆకస్మిక గుండెపోటు సంఘటనలకు ఇది ప్రధాన కారణమని అన్నారు. కనుక ప్రజలు తమ జీవనశైలిని మార్చుకోవాలి లేకపోతే కుర్చీపై నిరంతరం కూర్చోవడం తీవ్రమైన శారీరక దుష్ప్రభావాలకు కారణం కావచ్చు అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..