AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Attack: గుండెపోటు రావడానికి వారం ముందు శరీరం ఇచ్చే హెచ్చరికలు.. గుర్తిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు!

గుండెపోటు (హార్ట్ అటాక్) అనగానే చాలామందికి ఛాతిలో నొప్పి మాత్రమే గుర్తొస్తుంది. కానీ నిజానికి గుండెపోటు రాకముందు వారం రోజుల నుంచే శరీరం చాలా సూక్ష్మమైన, అసాధారణ సంకేతాలు ఇస్తుంది. వీటిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం అవుతుంది. ప్రస్తుతం గుండెనొప్పి మరణాలు ఎక్కువయ్యాయి.

Heart Attack: గుండెపోటు రావడానికి వారం ముందు శరీరం ఇచ్చే హెచ్చరికలు.. గుర్తిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు!
Heart Attack
Nikhil
|

Updated on: Nov 18, 2025 | 12:17 AM

Share

గుండెపోటు (హార్ట్ అటాక్) అనగానే చాలామందికి ఛాతిలో నొప్పి మాత్రమే గుర్తొస్తుంది. కానీ నిజానికి గుండెపోటు రాకముందు వారం రోజుల నుంచే శరీరం చాలా సూక్ష్మమైన, అసాధారణ సంకేతాలు ఇస్తుంది. వీటిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం అవుతుంది.

అమెరికన్ హార్ట్ అసోసియేషన్, మయో క్లినిక్, జర్నల్ ఆఫ్ అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీలో చేసిన రీసెర్చ్ ప్రకారం 50–80% మంది రోగుల్లో గుండెపోటుకు ముందు ఈ లక్షణాలు కనిపించాయని తేలింది. గుండెపోటు లక్షణాలను ముందుగానే గుర్తించి జాగ్రత్తలు తీసుకుంటే సరైన సమయంలో చికిత్స అంది ప్రాణనష్టం జరగకుండా కాపాడవచ్చు. గుండెపోటు రావడానికి ముందు శరీరంలో కలిగే మార్పులేంటో తెలుసుకుందాం..

లక్షణాలు-తీసుకోవాల్సిన జాగ్రత్తలు

* ఏ పని చేయకపోయినా చాలా త్వరగా అలసిపోతారు. ముఖ్యంగా మహిళల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. గుండెకు రక్తం సరిగ్గా అందకపోతే శరీరం ఆక్సిజన్ కొరత ఎదుర్కొంటుంది. ఫలితంగా నీరసం ఆవహిస్తుంది.

* రాత్రి నిద్రపోతున్నప్పుడు ఛాతీ ఒత్తిడి, శ్వాస తీసుకోవడం కష్టమై ఒంటినిండా చెమటలు పడతాయి. దీన్ని నైట్ స్వెట్స్ అంటారు. గుండె ధమనుల్లో బ్లాకేజీ పెరిగినప్పుడు ఇలా జరుగుతుంది.

* ఛాతీలో మంట, కడుపు ఉబ్బరం, వికారం వంటివి కూడా గుండె సమస్యల సంకేతాలు కావచ్చు. మహిళల్లో 40% మందికి గుండెపోటు ఈ రూపంలోనే వస్తుందని పలు అధ్యయనాల్లో తేలింది.

* మెట్లు ఎక్కినప్పుడు, త్వరగా నడిచినప్పుడు ఊపిరి తీసుకోలేకపోవడం, చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. గుండె బలహీనంగా ఉంటే ఊపిరితిత్తులకు ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది.

* ఎడం భుజం, చేయి, మెడ, దవడ, వెన్నునొప్పి.. ఇవి గుండె నొప్పికి సంకేతాలు, కానీ చాలామంది దీన్ని సాధారణ నొప్పిగా తేల్చేస్తారు.

* ఒక్కసారిగా తల తిరగడం, గజిబిజిగా అనిపించడం, కళ్లకి చీకటి వచ్చినట్లు అనిపించడం వంటి లక్షణులు గుండెకు రక్త ప్రసరణ తగ్గినప్పుడు కనిపిస్తాయి. తద్వారా మెదడుకు ఆక్సిజన్​ సరఫరా తగ్గి పలు సమస్యలు ఎదురవుతాయి. ఈ లక్షణాలు ఒక్కొక్కటిగా లేదా రెండు మూడు కలిపి వారం నుంచి 10 రోజుల ముందే కనిపించవచ్చు. 45 ఏళ్లు దాటిన వాళ్లు, షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ ఉన్నవాళ్లు, స్మోకింగ్ చేసేవాళ్లు, ఒబేసిటీ ఉన్నవాళ్లు ఈ సంకేతాలను ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు.

వెంటనే కార్డియాలజిస్ట్‌ను కలవాలి. డాక్టర్ల సలహా మేరకు ECG, Echo, TMT, లేదా Angiogram చేయించుకుని మందులు వాడాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా ప్రాణానికే ప్రమాదం. గుండెపోటు హఠాత్తుగా రాదు, మీ శరీరం ముందే హెచ్చరిస్తుంది. ఆ హెచ్చరికలను అనుసరించి జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాలు కాపాడుకోవచ్చు!

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)