Covid-19: పొంచిఉన్న వేరియంట్ల ప్రమాదం.. వీలైనంత త్వరగా చిన్నారులకు టీకాలివ్వాలి..

Covid-19: పొంచిఉన్న వేరియంట్ల ప్రమాదం.. వీలైనంత త్వరగా చిన్నారులకు టీకాలివ్వాలి..
Coronavirus

Dr Vineeta Bal on Coronavirus: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిత్యం లక్షలాది కేసులు, వందలాది మరణాలు నమోదవుతున్నాయి. గతంలో ఎన్నడూలేనంతగా

Shaik Madarsaheb

|

Jan 18, 2022 | 2:40 PM

Dr Vineeta Bal on Coronavirus: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిత్యం లక్షలాది కేసులు, వందలాది మరణాలు నమోదవుతున్నాయి. గతంలో ఎన్నడూలేనంతగా రెండు లక్షలకు పైగా కేసులు వస్తున్నాయి. ఈ క్రమంలో ఒమిక్రాన్ సైతం అలజడి రేపుతోంది. థర్డ్ వేవ్ నేపథ్యంలో ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. దీనిలో భాగంగా జనవరి 3 నుంచి 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు కూడా వ్యాక్సిన్ ఇస్తున్నారు. అయితే.. ఇలాంటి పరిస్థితుల మధ్య చిన్న పిల్లలకు వీలైనంత త్వరగా వ్యాక్సిన్ అందించాలని డాక్టర్ వినీతా బాల్ సూచించారు. ఇమ్యునాలజిస్ట్, పూణేలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER)లో విజిటింగ్ ప్రొఫెసర్ అయిన వినీతా థర్డ్ వేవ్ నేపథ్యంలో News9తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా పలు కీలక సూచనలు చేశారు. రాబోయే రోజుల్లో పలు వేరియంట్ల ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు వీలైనంత త్వరగా టీకాలు వేయాలని ఆమె సూచించారు. చిన్నారులకు పరీక్షలు చేయడం లేదని.. అలాంటి సమయంలో వారు ఆల్ఫా, డెల్టా లేదా ఓమిక్రాన్ వేరియంట్‌ సోకిందా లేదా అనేది తెలుసుకోవడం అసాధ్యం అన్నారు. మనం సెరో పాజిటివిటీని కలిగి లేమని అందుకే పిల్లలకు త్వరగా టీకాలు వేయాలంటూ వినీతా పేర్కొన్నారు.

పాజిటివిటీ శాతం, కరోనా పరీక్షల గురించి వినీతా మాట్లాడుతూ.. మనకు పెద్దఎత్తున ఆరోగ్య మౌలిక సదుపాయాలు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే.. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికీ రోగనిర్ధారణ చేయడం చాలా అవసరమన్నారు. ఇలా చేస్తే.. వ్యాధి సోకిన ప్రతి ఒక్కరూ వైరస్ వ్యాప్తి చెందకుండా నివారించవచ్చన్నారు. అంతేకాకుండా అవసరమైన వారికి చికిత్స అందించడం చాలా సులభమని వినీతా తెలిపారు. కొత్త వేరియంట్‌పై ఇమ్యునైజేషన్ ప్రభావాన్ని, పురోగతి ఇన్‌ఫెక్షన్‌లకు కారణం ఏమిటో బాగా అర్థం చేసుకోవడానికి కూడా పరీక్షలు సహాయపడతాయన్నారు. రోగ నిర్ధారణ చేయడం ముఖ్యమైన పనే కానీ.. దేశంలో పెద్ద స్థాయిలో ఆరోగ్య మౌలిక సదుపాయాలు ఉన్నా సాధ్యం కావడం లేదన్నారు.

రోజుకు నాలుగు లక్షలు..

థర్డ్ వేవ్ గురించి మాట్లాడుతూ.. ఈ నెలాఖరు నాటికి ఎక్కువ కేసులు నమోదవుతాయన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రతిరోజూ 4 లక్షల కేసులు నమోదయ్యే అవకాశముందన్నారు. ముంబై, కోల్‌కతా, ఢిల్లీలో ఉన్నట్లుగా ప్రతిరోజూ వ్యాధి బారిన పడే వారి సంఖ్య పెరుగుతూ ఉండే అవకాశముందన్నారు. అయితే.. ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వినీతా సూచించారు. ఒమిక్రాన్, సాధారణ కరోనా కేసులు కూడా ఒకే విధంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు.

ఆర్టీపీఆర్‌తోనే కచ్చితత్వం..

ఆర్టీసీఆర్ టెస్టింగ్ ద్వారా కచ్చితమైన రోగ నిర్ధారణ జరుగతుందని వినీతా తెలిపారు. కొత్త హోమ్ టెస్టింగ్ కిట్‌లు (రాపిడ్ టెస్టింగ్ కిట్స్) అందుబాటులో ఉన్నాయి. కానీ వాటి కంటే.. RT-PCR ద్వారానే కచ్చితమైన రిపోర్టు వస్తుందన్నారు. హోమ్ టెస్టింగ్ కిట్‌లతో పరీక్షించి, అధికారులకు నివేదించాల్సి ఉంటే.. ఎవరికి పాజిటివ్‌గా వచ్చింది అనేది ఎప్పటికీ తెలియదన్నారు. ల్యాబ్ టెస్టింగ్ నుండి వచ్చే సాధారణ డేటాపై ఇప్పటివరకు ఎలాంటి నియంత్రణ లేదని.. కానీ కొంచెం దుర్వినియోగం జరిగే అవకాశముందని వినీతా అభిప్రాయపడ్డారు.

వ్యాక్సినేషన్.. 

కరోనా కొత్త వేరియంట్లు డెల్టా, ఒమిక్రాన్ లాంటివి రూపాంతరం చెందుతున్న ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో కరోనా కట్టడికి వ్యాక్సినేషన్‌ను పెంచాలని అభిప్రాయపడ్డారు. ప్రతిఒక్కరూ వ్యాక్సినేట్ కావాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా చిన్నారులకు వ్యాక్సిన్ అందించాలన్నారు. 18 ఏళ్ల లోపు పిల్లలకు వ్యాక్సిన్ అందించడం ద్వారా వ్యాధి తీవ్రతను తగ్గించే అవకాశముందని ప్రొఫెసర్ వినీతా బాల్ పేర్కొన్నారు.

Also Read:

Coronavirus: త్వ‌ర‌లోనే భార‌త్‌లో రోజుకు 4 ల‌క్ష‌ల క‌రోనా కేసులు.. ఆసక్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించిన ఐఐటీ ప్రొఫెస‌ర్‌.

Onion Juice: ఎన్నో సమస్యలకు దివ్యఔషధం.. ఉల్లి రసంతో కిడ్నీ సమస్యలకు చెక్..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu