మళ్లీ కరోనా కలకలం.. ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్ పంజా.. ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
కరోనా మహమ్మారి ముగిసిపోయిందని ఊపిరి పీల్చుకుంటున్న వేళ.. మరో కొత్త వేరియంట్ రూపంలో వైరస్ మళ్లీ కలకలం రేపుతోంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వెలుగుచూసిన PJ.2.1 అనే సరికొత్త సబ్ వేరియంట్ ఇప్పుడు వైద్య నిపుణుల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. సాధారణ జలుబు, ఫ్లూ తరహా లక్షణాలతోనే మొదలయ్యే ఈ వేరియంట్ ఎంతవరకు ప్రమాదకరం? అనే విషయాలు తెలుసుకుందాం..

ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్-19 వైరస్ మరో కొత్త రూపంలో మళ్లీ వార్తల్లోకి వచ్చింది. PJ.2.1 అనే సరికొత్త సబ్ వేరియంట్ పలు దేశాల్లో వెలుగుచూడటంతో వైద్య నిపుణుల్లో కొత్త చర్చ మొదలైంది. ఈ వేరియంట్ ఎంత వేగంగా వ్యాపిస్తుంది? దీని లక్షణాలు ఎలా ఉంటాయి? పాత వేరియంట్ల కంటే ఇది మరింత ప్రమాదకరమైనదా? అనే అంశాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తో పాటు అంతర్జాతీయ పరిశోధకులు కీలక వివరాలు వెల్లడించారు. అక్టోబర్ 2026 ప్రిప్రింట్ అధ్యయన నివేదిక ప్రకారం.. PJ.2.1 వేరియంట్ తొలి కేసు 2026 మే 2న కెనడాలోని అంటారియోలో నమోదైంది. ఆ తర్వాత కెనడాలోని ఇతర ప్రాంతాలతో పాటు జూన్ 30న అమెరికాలోని న్యూయార్క్‌లోనూ గుర్తించారు. ప్రస్తుతం స్పెయిన్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సహా పలు దేశాల్లో ఈ వేరియంట్ వ్యాప్తి చెందుతున్నట్లు పరిశోధకులు ధ్రువీకరించారు.
ఈ వేరియంట్ స్పైక్ ప్రొటీన్‌లో పలు మ్యుటేషన్లు జరిగాయని ల్యాబ్ పరీక్షల్లో తేలింది. మానవ కణాల్లోకి చొచ్చుకెళ్లడానికి వైరస్ ఉపయోగించే ‘ACE2 రిసెప్టర్’తో ఇది మరింత బలంగా అతుక్కునే లక్షణాన్ని కలిగి ఉందని, దీనివల్ల ఇది వేగంగా వ్యాపించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
లక్షణాలు ఎలా ఉన్నాయి? పాత జలుబేనా.. కొత్త ముప్పా?
PJ.2.1 వేరియంట్ లక్షణాలు సాధారణ జలుబు, సీజనల్ ఫ్లూ లేదా ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే ఉంటున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. అందువల్ల కేవలం లక్షణాల ఆధారంగా ఇది ఏ వైరస్ అనేది గుర్తించడం అసాధ్యమని, వైద్య పరీక్షలు మాత్రమే సరైన సమాధానం ఇస్తాయని పేర్కొంది.
సాధారణంగా కనిపించే లక్షణాలు
- జ్వరం, తగ్గని పొడి దగ్గు
- గొంతు నొప్పి, ముక్కు కారడం లేదా ముక్కు దిబ్బడ
- తీవ్రమైన తలనొప్పి, ఒళ్లు నొప్పులు
- విపరీతమైన నీరసం, అలసట
- కొందరిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వాసన, రుచి కోల్పోవడం, జీర్ణ సమస్యలు
రష్యన్ వైరాలజిస్ట్ ఎలెనా మాలీన్నికోవా అభిప్రాయం ప్రకారం.. ఈ వేరియంట్ సోకిన వారిలో గొంతు నొప్పి చాలా తీవ్రంగా ఉంటోందని, కోలుకున్న తర్వాత కూడా దీర్ఘకాలిక అలసట వేధిస్తోందని పేర్కొన్నారు. అయితే దీనిని పూర్తిగా నిర్ధారించేందుకు మరిన్ని క్లినికల్ ఆధారాలు అవసరమని చెప్పారు.
పాత వేరియంట్ల కంటే ఇది ప్రమాదకరమా?
జర్నల్ ఆఫ్ ఇన్‌ఫెక్షన్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. ఈ వేరియంట్ కణాలకు వేగంగా అంటుకునే స్వభావాన్ని కలిగి ఉన్నప్పటికీ, శరీరంలోని యాంటీబాడీలను తప్పించుకునే శక్తి దీనికి సాధారణ స్థాయిలోనే ఉందని తేలింది. ముఖ్యంగా LP.8.1 ఆధారిత వ్యాక్సిన్లు తీసుకున్న వ్యక్తుల్లోని రోగనిరోధక శక్తిని ఇది భారీగా తప్పించుకుంటున్న దాఖలాలేవీ కనిపించలేదు. ప్రస్తుతానికి ఈ వేరియంట్ వల్ల ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య పెరగడం గానీ, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు లేదా మరణాల ముప్పు పెరిగినట్లు ఎలాంటి క్లినికల్ ఆధారాలు లేవని నిపుణులు స్పష్టం చేశారు.
ఎవరికి ఎక్కువ ప్రమాదం?
వేరియంట్ ఏదైనా కొన్ని వర్గాల ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
- వృద్ధులు
- రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు
- డయాబెటిస్, గుండె జబ్బులు, ఆస్తమా వంటి దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు
తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు
- రద్దీగా ఉండే ప్రాంతాల్లో, గాలి వెలుతురు సరిగ్గా లేని ప్రదేశాల్లో సరైన మాస్క్ ధరించాలి.
- తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం అలవాటు చేసుకోవాలి.
- అనారోగ్య లక్షణాలు ఉన్నప్పుడు ఇతరులకు దూరంగా ఉండటం మంచిది.
- ఇళ్లలో, ఆఫీసుల్లో గాలి ధారాళంగా ఆడేలా చూసుకోవాలి.
