AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పొద్దున్న కాఫీ తాగుతున్నరా..? అయితే మీ బ్రెయిన్, మైండ్ రెండూ కిర్రాక్ ఉంటయ్..!

ఉదయం వేళ మొదటి కప్పు కాఫీ చాలా మందికి రోజులో తప్పనిసరి అలవాటు. అయితే ఇది కేవలం అలవాటు మాత్రమే కాదు.. శరీరానికి శక్తిని ఇవ్వడంతో పాటు, మెదడు పనితీరు, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుందని కొత్త పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

పొద్దున్న కాఫీ తాగుతున్నరా..? అయితే మీ బ్రెయిన్, మైండ్ రెండూ కిర్రాక్ ఉంటయ్..!
Coffee
Prashanthi V
|

Updated on: Jun 25, 2025 | 2:18 PM

Share

అమెరికాలో జరిగిన ఒక పెద్ద పరిశోధన ఈ విషయాన్ని రుజువు చేసింది. 30 ఏళ్లు పైబడిన సుమారు 50,000 మంది మహిళలను దశలవారీగా ఈ అధ్యయనంలో పరిశీలించారు. 1984 నుంచే వీరి ఆహారం, జీవనశైలి, ఆరోగ్య పరిస్థితులపై వివరాలు సేకరించారు. ఈ పరిశోధన ఫలితాలను ఇటీవల ఒర్లాండోలో జరిగిన అమెరికన్ సొసైటీ ఫర్ న్యూట్రిషన్ వార్షిక సదస్సులో (2025 మే 31 – జూన్ 3 మధ్య) ప్రదర్శించారు. ముఖ్యంగా కాఫీ, టీ, కోలా, డీకాఫ్ కాఫీ వంటి డ్రింక్ ల ద్వారా కెఫిన్ శరీరాన్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో ఈ అధ్యయనం విశ్లేషించింది.

ఈ పరిశోధనలో ఆరోగ్యకరమైన వృద్ధాప్యం అంటే.. వయసు వచ్చినా పెద్ద జబ్బులు లేకుండా, శారీరకంగా చురుగ్గా ఉండటం, మానసికంగా స్పష్టంగా ఉండటం, భావోద్వేగ పరంగా ప్రశాంతంగా ఉండటం, జ్ఞాపకశక్తి మందగించడం వంటి సమస్యలు లేకుండా ఉండటం అని నిర్వచించారు. ఈ లక్షణాలను బట్టి చూస్తే.. రోజూ కాఫీ తాగే మహిళల్లో ఈ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు.

కాఫీలో ఉండే కెఫిన్ మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఉదయం నిద్రలేవగానే ఒక కప్పు కాఫీ తాగడం వల్ల ఏకాగ్రత, ఉత్సాహం పెరుగుతాయి. ఇది మన రోజును సానుకూలంగా ప్రభావితం చేస్తుంది.

శక్తి తగ్గిపోయినా లేదా అలసటగా అనిపించినా.. ఒక కప్పు తాజా కాఫీ మీ మనస్సును మళ్లీ ఉత్సాహంతో నింపుతుంది. కెఫిన్ వల్ల మెదడులోని న్యూరోట్రాన్స్‌ మీటర్ల ప్రభావం పెరిగి మనశ్శాంతి, ఉత్సాహం అధికమవుతాయి.

ఉదయం నిద్రలేవగానే 30 నుంచి 60 నిమిషాలు ఆగి కాఫీ తాగితే.. శరీర సహజ శక్తితో కలిసి కెఫిన్ ప్రభావం మరింత మెరుగ్గా ఉంటుంది. ఈ సమయంలో కెఫిన్ తీసుకుంటే అది రోజంతా మానసిక ఉల్లాసాన్ని ఇవ్వడంలో సహాయపడుతుంది. మధ్యాహ్నం తర్వాత కాఫీ తాగడం తగ్గించడం వల్ల నిద్రపోయే సమయానికి దాని ప్రభావం తగ్గిపోయి.. నిద్రకు ఆటంకం కలిగే అవకాశం తక్కువగా ఉంటుంది.

కాఫీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీర కణాలను పాడవకుండా కాపాడతాయి. దీని వల్ల వయసు పెరిగే కొద్దీ వచ్చే పార్కిన్సన్స్, అల్జీమర్స్, గుండె జబ్బులు వంటి సమస్యల నుంచి రక్షణ కలుగుతుందని పరిశోధకులు తెలిపారు.

రోజూ ఉదయాన్నే కాఫీ తాగడం కేవలం అలవాటుగా కాకుండా.. దీర్ఘకాలంలో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచగల శక్తిని కలిగి ఉంది. ముఖ్యంగా మహిళల్లో దీని ప్రభావం స్పష్టంగా కనిపించిందని ఈ అధ్యయనం తేల్చింది. అయితే కాఫీని తగినంతగా, సరైన సమయానికి తాగే అలవాటు ఉంటేనే దాని ప్రయోజనాలను పూర్తిగా పొందవచ్చు.