Digital Babysitter: పిల్లలకు మొబైల్ ఫోన్ ఇస్తున్నారా? జాగ్రత్త.. ‘డిజిటల్ బానిసత్వం’ దిశగా చిన్నారులు!
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో తల్లిదండ్రులు తమ పనిలో తాము నిమగ్నమై, పిల్లలను కాసేపు అల్లరి చేయకుండా ఉంచడానికి, తినడానికి, డిస్టర్బ్ చేయకుండా ఉండటానికి వారి చేతికి మొబైల్ ఫోనో లేదా టాబ్లెట్టో ఇస్తున్నారు. ప్రస్తుతం ఇవి 'డిజిటల్ బేబీసిటర్'లుగా మారిపోయాయి.

పిల్లలు కూడా ఆ రంగుల ప్రపంచంలో మునిగిపోయి గంటల తరబడి కదలకుండా కూర్చుంటున్నారు. పైకి ఇది సాధారణంగానే కనిపిస్తున్నప్పటికీ, లోపల ఆ పసివారి మెదడు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతోందని మీకు తెలుసా? మొబైల్ స్క్రీన్ నుండి వచ్చే ఆ కాంతి కేవలం కళ్లకే కాదు, వారి ఆలోచనా శక్తికి, ప్రవర్తనకు కూడా చేటు చేస్తోంది. పిల్లలు తిండి తిన్నా తినకపోయినా ఫోన్ ఉంటే చాలు అన్నట్టుగా తయారవుతున్నారు. దీనివల్ల వారి మెదడు త్వరగా అలసిపోవడమే కాకుండా, మానసిక సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. వైద్యులు హెచ్చరిస్తున్న ఆ భయంకరమైన నిజాలేంటో తెలుసుకుందాం.
- నిపుణుల అభిప్రాయం ప్రకారం, మొబైల్ లేదా ల్యాప్‌టాప్ స్క్రీన్‌లపై వేగంగా మారుతున్న కంటెంట్ పిల్లల మెదడును నిరంతరం యాక్టివ్‌గా ఉంచుతుంది. మెదడు ఎప్పుడూ కొత్త విషయాల కోసం వెతుకుతూ ఉండటం వల్ల అది విశ్రాంతి తీసుకోవడానికి సమయం దొరకదు. దీనివల్ల చాలా త్వరగా మానసిక అలసట ఏర్పడుతుంది. ఏదైనా ఒక విషయంపై దృష్టి పెట్టే సామర్థ్యం క్రమంగా తగ్గిపోతుంది.
- స్క్రీన్ వాడకం వల్ల కలిగే అతిపెద్ద నష్టం నిద్రలేమి. మొబైల్ నుండి వచ్చే బ్లూ లైట్ శరీరంలోని సహజ నిద్ర హార్మోన్ మెలటోనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీనివల్ల పిల్లలకు త్వరగా నిద్ర రాదు. సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల మరుసటి రోజు ఉదయం నుండి పిల్లలు ఎంతో అలసటగా, చిరాకుగా కనిపిస్తారు. చిన్న చిన్న విషయాలకే కోప్పడటం లేదా ఏడవడం మొదలుపెడతారు.
- పిల్లలు ఒత్తిడికి లోనైనా లేదా బోర్ కొట్టినా వెంటనే ఫోన్ వైపు మొగ్గు చూపుతున్నారు. అంటే వారు భావోద్వేగ పరంగా స్క్రీన్‌లపై ఆధారపడుతున్నారు. ఫోన్ లేకపోతే చిన్న సమస్యను కూడా వారు తట్టుకోలేకపోతున్నారు.
పరిష్కార మార్గాలు..
- పిల్లల నుండి ఫోన్‌ను పూర్తిగా లాక్కోవడం సమస్యకు పరిష్కారం కాదని వైద్యులు చెబుతున్నారు. దానికి బదులుగా ఒక క్రమశిక్షణను అలవర్చడం ముఖ్యం. రోజులో ఎంతసేపు ఫోన్ వాడాలో సమయాన్ని నిర్ణయించాలి.
- ఫోన్‌కు బదులుగా శారీరక శ్రమ ఉండే ఆటలు ఆడేలా ప్రోత్సహించాలి. పడుకోవడానికి కనీసం ఒక గంట ముందే ఫోన్లు, టాబ్స్‌ను పక్కన పెట్టేయాలి. పిల్లలకు ఫోన్ వద్దని చెప్పే ముందు, తల్లిదండ్రులు కూడా వారి ముందు ఫోన్ వాడటం తగ్గించాలి.
టెక్నాలజీ అవసరమే కానీ అది మన పిల్లల భవిష్యత్తును అంధకారం చేయకూడదు. స్క్రీన్ టైమ్ కంటే వారి మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమని గుర్తించాలి. పిల్లల ప్రవర్తనలో పైన చెప్పిన మార్పులు ఏవైనా గమనిస్తే వెంటనే అప్రమత్తం అవ్వండి.
