Shocking Survey: పెళ్లి చేసుకుని తప్పు చేశామని భార్యల అసంతృప్తి.. కాలం వెనక్కి తిరిగితే అంటూ సంచలన కామెంట్లు
అత్యాధునిక సాంకేతికతకు మారుపేరుగా నిలిచే దేశం జపాన్, సంప్రదాయాలకు కూడా పెట్టింది పేరు. క్రమశిక్షణతో కూడిన జీవనశైలికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆ ద్వీపదేశంలో ఇప్పుడు వివాహ బంధాలు కుప్పకూలుతున్నాయా? బయటకు ఎంతో అన్యోన్యంగా కనిపించే దంపతుల మధ్య అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయా? తాజాగా వెలువడిన ఒక అంతర్జాతీయ సర్వే నివేదిక ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని ఆలోచనలో పడేసింది.

పెళ్లి చేసుకొని జీవితంలో పెద్ద తప్పు చేశామని, అవకాశం ఉంటే కాలం వెనక్కి వెళ్లి ఆ నిర్ణయాన్ని మార్చుకుంటామని అక్కడి మహిళలు బహిరంగంగానే చెబుతున్నారు. జపాన్ మహిళల్లో అంతటి పశ్చాత్తాపం కలగడానికి కారణాలేంటి? వివాహ బంధం వెనుక ఉన్న భయంకరమైన వాస్తవాలేంటో తెలుసుకుందాం.
షాకింగ్ సర్వే ఫలితాలు
జపనీస్ వివాహ సంబంధాల సంస్థ ‘ప్రెసియా’ తాజాగా ఒక సర్వే నిర్వహించింది. ఇందులో 20 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు గల సుమారు 287 మంది వివాహిత మహిళల అభిప్రాయాలను సేకరించింది. “మీరు మీ భర్తను వివాహం చేసుకున్నందుకు చింతిస్తున్నారా?” అనే సరళమైన ప్రశ్నకు వచ్చిన సమాధానాలు చూసి సర్వే ప్రతినిధులు సైతం అవాక్కయ్యారు. పాల్గొన్న వారిలో ఏకంగా 70 శాతం మంది అవును అని సమాధానం ఇచ్చారు. తాము పెళ్లి చేసుకున్నందుకు ఏదో ఒక సందర్భంలో కచ్చితంగా బాధపడ్డామని వారు వెల్లడించారు.
కాలం వెనక్కి తిరిగితే..
ఈ సర్వేలో వెల్లడైన మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఒకవేళ కాలం వెనక్కి తిరిగితే, ఇప్పుడున్న భర్తను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకోబోమని 54 శాతం మంది స్పష్టం చేశారు. సంప్రదాయాలకు అధిక ప్రాధాన్యమిచ్చే జపాన్ లాంటి దేశంలో మహిళలు ఈ స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేయడం సామాజిక విశ్లేషకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వివాహ బంధంలో భావోద్వేగాల కంటే ఇతర కారణాలు ఎక్కువగా ప్రభావం చూపుతున్నాయని ఈ సర్వే స్పష్టం చేస్తోంది.
అందం కంటే ఆస్తికే ప్రాధాన్యత..
ప్రస్తుత కాలంలో ప్రేమ, అందం కంటే ఆర్థిక స్థిరత్వమే ముఖ్యం అని జపాన్ మహిళలు భావిస్తున్నట్లు ఈ సర్వే తేల్చింది. కేవలం 36.6% మంది మహిళలు మాత్రమే తమ భర్త శారీరక రూపం విషయంలో రాజీ పడటానికి బాధపడుతున్నారట. అంటే మెజారిటీ మహిళలు భర్త అందంగా లేకపోయినా పర్వాలేదు కానీ, ఆర్థికంగా బలంగా ఉండాలని కోరుకుంటున్నారు. జపాన్‌లో పెరుగుతున్న నిత్యావసర ధరలు, పిల్లల పెంపకం ఖర్చులు పెరగడం వల్ల మహిళలు ‘ప్రేమ’ కంటే ‘ఆర్థిక భద్రత’కే ఎక్కువ మొగ్గు చూపుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పెళ్లి అనేది నూరేళ్ల పంట అని మన పెద్దలు చెబుతుంటారు. కానీ జపాన్ లో మారుతున్న పరిస్థితులు చూస్తుంటే ఆ పంట ఇప్పుడు చేదుగా మారుతున్నట్లు అనిపిస్తోంది. ఆర్థిక భరోసా లేని చోట అనురాగం కూడా ఆవిరైపోతుందని ఈ సర్వే ఫలితాలు హెచ్చరిస్తున్నాయి. ఇది ఒక్క జపాన్ కే పరిమితం కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆధునిక జంటలకు ఒక గుణపాఠం లాంటిది.
