వర్షాకాలం ఈ వ్యాధులతో జాగ్రత్త.. అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు..! నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..?
వర్షా కాలం ఆరోగ్యపరంగా సవాళ్ల తో కూడుకున్నది. ఈ కాలంలో నీటి నిల్వ, గాలి లో తేమ కారణంగా డెంగ్యూ, టైఫాయిడ్, విరేచనాలు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు వంటి వ్యాధులు విస్తరిస్తాయి. కాబట్టి పరిశుభ్రత, సరైన ఆహారం, దోమల నివారణ చర్యలు తప్పనిసరి.

వర్షాకాలం.. ఈ సీజన్‌లో చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా అంటువ్యాధులు విపరీతంగా పెరుగుతాయి. వర్షాల వల్ల నీరు నిల్వ ఉండటం, గాలిలో తేమ, అలాగే పరిసరాల పరిశుభ్రత సరిగా లేకపోవడం వల్ల నీటి ద్వారా, దోమల ద్వారా, గాలి ద్వారా వచ్చే రోగాలు పెరుగుతాయి. ఈ పరిస్థితుల్లో మనం జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
నీటి కాలుష్యం వల్ల వచ్చే వ్యాధులు
ఈ కాలంలో వచ్చే అతి పెద్ద సమస్య నీటి కాలుష్యం వల్ల వచ్చే వ్యాధులు. డయేరియా, కలరా, టైఫాయిడ్, హెపటైటిస్ A, E లాంటివి ఎక్కువగా వస్తాయి. ఇవి కలుషితమైన నీరు, బయట ఫుడ్ తినడం వల్ల వస్తాయి. అందుకే మరిగించిన నీళ్లు మాత్రమే తాగాలి. వీలైనంత వరకు ఇంట్లోనే వండిన ఫ్రెష్ ఫుడ్ తినడం మంచిది.
దోమల ద్వారా వచ్చే వ్యాధులు
డెంగ్యూ, మలేరియా, చికున్ గునియా లాంటి వ్యాధులు ఈ కాలంలో వేగంగా వ్యాపిస్తాయి. ఇంటి చుట్టూ ఉన్న నిల్వ నీటిలో దోమలు ఎక్కువగా పెరుగుతాయి. పాత టైర్లు, బకెట్లు, పూల కుండీలు, కూలర్ లలో నీళ్లు లేకుండా ఎప్పటికప్పుడు చూసుకోండి. రాత్రి పడుకునేటప్పుడు మోస్కిటో నెట్ వాడటం, రిపెల్లెంట్లు ఉపయోగించడం మంచిది. అలాగే ఫుల్ హ్యాండ్, ఫుల్ లెగ్స్ ఉన్న దుస్తులు ధరిస్తే దోమకాటు నుంచి రక్షణ పొందవచ్చు.
గాలి ద్వారా వచ్చే వ్యాధులు
వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువ కాబట్టి బ్యాక్టీరియా, ఫంగస్ వేగంగా పెరుగుతాయి. దీంతో ఆస్తమా, అలర్జీలు, ఫ్లూ, జ్వరం లాంటివి వస్తాయి. తుమ్ము, దగ్గు ద్వారా కూడా రోగాలు పాకుతాయి. అందుకే గదులు గాలి వచ్చేలా చూసుకోవాలి. తడి దుస్తులు ఎక్కువసేపు వేసుకోకుండా శరీరం పొడిగా ఉండేలా చూసుకోవాలి.
చర్మ సమస్యలు
వాతావరణ మార్పుల వల్ల చర్మ సమస్యలు కూడా వస్తాయి. ఈ కాలంలో చిన్న గాయాలు కూడా త్వరగా ఇన్‌ఫెక్షన్‌కు గురవుతాయి. ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు, దద్దుర్లు ఎక్కువగా వస్తాయి. కాబట్టి చర్మాన్ని ఎప్పుడూ శుభ్రంగా, పొడిగా ఉంచుకోవాలి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- మరిగించిన నీళ్లు మాత్రమే తాగండి.
- బయట ఫుడ్ తినడం మానేయండి.
- పాత లేదా పాడైన ఆహారం తినవద్దు.
- దోమల నివారణకు చర్యలు తీసుకోండి.
- శరీరం పూర్తిగా కప్పబడేలా బట్టలు వేసుకోండి.
- పరిశుభ్రతను ఎప్పుడూ పాటించండి.
- చెప్పులు లేకుండా బయటికి వెళ్ళవద్దు.
వర్షాకాలం అందంగా ఉన్నా ఆరోగ్యానికి కొన్ని సవాళ్లను తీసుకొస్తుంది. ఈ జాగ్రత్తలు పాటిస్తేనే మనం ఈ సీజన్‌ను హ్యాపీగా, హెల్తీగా ఎంజాయ్ చేయొచ్చు.




