AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెదడు చురుకుగా ఉండాలంటే నడవాల్సిందే.. కేవలం రోజుకు 40 నిమిషాలు చాలు..!

వయసు పెరిగే కొద్దీ మన శరీరంలోనే కాదు.. మెదడులో కూడా చాలా మార్పులు వస్తాయి. ముఖ్యంగా గుర్తుంచుకునే శక్తి, కొత్త విషయాలు నేర్చుకునే సామర్థ్యం వంటి మానసిక పనులు నెమ్మదిస్తాయి. ఈ సమస్యలను అధిగమించడంలో సాధారణ నడక కూడా గొప్ప ప్రయోజనాన్ని ఇస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.

మెదడు చురుకుగా ఉండాలంటే నడవాల్సిందే.. కేవలం రోజుకు 40 నిమిషాలు చాలు..!
Walking Benefits
Prashanthi V
|

Updated on: Jun 29, 2025 | 12:08 PM

Share

నడక వయసుతో సంబంధం ఉన్న మానసిక మార్పులను తగ్గించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా మెదడులో హిపోక్యాంపస్ అనే భాగం సరిగ్గా పనిచేయాలంటే.. దాన్ని ఉత్సాహంగా ఉంచే శారీరక కదలిక అవసరం. ఈ భాగమే మన జ్ఞాపకశక్తి, కొత్త విషయాలు నేర్చుకోవడం వంటి పనులకు బాధ్యత వహిస్తుంది.

గంటల తరబడి నడవాల్సిన అవసరం లేదంటున్నారు శాస్త్రవేత్తలు. వారానికి కేవలం మూడుసార్లు, ఒక్కోసారి 40 నిమిషాల పాటు నడవడం కూడా మెదడు పనితీరులో స్పష్టమైన మార్పులు తేగలదని వారు స్పష్టం చేస్తున్నారు.

ఒక అంతర్జాతీయ అధ్యయనంలో 120 మంది వృద్ధులను ఎంపిక చేసుకున్నారు. వారిని రెండు వేర్వేరు గుంపులుగా విభజించారు. వీరంతా సాధారణంగా కూర్చునే జీవనశైలిని కలిగి ఉన్నవారే. ఒక గ్రూప్ వారానికి మూడుసార్లు ఏరోబిక్ వ్యాయామాలు చేస్తుండగా.. మరొక గ్రూప్ వ్యాయామం చేయకుండా కొనసాగించారు.

సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత పరిశీలనలో ఏరోబిక్ వ్యాయామం చేసినవారి మెదడులో హిపోక్యాంపస్ పరిమాణం సగటున 2 శాతం పెరిగినట్లు గుర్తించారు. అదే సమయంలో ఇతర గ్రూప్ లో మాత్రం ఈ భాగం తగ్గినట్లు కనిపించింది. అంతేకాదు మెదడులో న్యూరోట్రోఫిక్ ఫ్యాక్టర్ల (BDNF) స్థాయిలు కూడా హిపోక్యాంపస్ మార్పులకు సంబంధం కలిగి ఉన్నాయని వెల్లడించారు.

వృద్ధాప్యంలో మెదడు పనితీరు నెమ్మదించడం సహజం. ఇది హిపోక్యాంపస్ అనే భాగం క్రమంగా తగ్గిపోవడం వల్లే జరుగుతుంది. దీని ప్రభావం వల్ల మనం మర్చిపోవడం. కొత్త విషయాలను గుర్తుపెట్టుకోలేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అంతేకాదు నిద్రలేమి, ఒత్తిడి, కదలకుండా ఉండే జీవనశైలి కూడా మెదడు పనితీరును మరింత దెబ్బతీస్తాయి.

కానీ శారీరక కదలిక, సాధారణ నడక, మంచి ఆహారపు అలవాట్లు, మానసిక ప్రశాంతత వంటి విషయాలు మెదడు క్షీణతను ఆలస్యం చేస్తాయని పరిశోధనల్లో తేలింది.

రోజుకు 40 నిమిషాల నడక మీ మెదడును చురుకుగా ఉంచడంలో కీలకంగా పని చేస్తుంది. మీరు ఈ నడకను రెండు లేదా మూడుసార్లు విభజించుకొని.. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం.. ఒక్కోసారి 15 నుంచి 20 నిమిషాలుగా కొనసాగించవచ్చు. దీన్ని వారం రోజుల్లో కనీసం మూడుసార్లు చేయగలిగితే.. మీ మానసిక ఆరోగ్యంలో మెరుగుదల కనిపించవచ్చు.

అయితే రోజూ నడవడం సాధ్యమైతే అది మరింత మంచిదని నిపుణులు అంటున్నారు. ఇది మీ మెదడును క్రమంగా ఉత్తమ స్థితికి తీసుకెళ్లడమే కాకుండా.. మానసిక ఒత్తిడిని తగ్గించడంలోనూ సహాయపడుతుంది.

వృద్ధుల ఆరోగ్యాన్ని మెరుగుపరచేందుకు నడక అత్యంత సులభమైన బలమైన సాధనం. నిత్యం కొంతసేపు నడవడం ద్వారా మెదడు పనితీరు మెరుగవుతుంది. కాబట్టి వయసుతో మానసిక చురుకుదనం కోల్పోకుండా ఉండాలంటే.. వారానికి కనీసం మూడుసార్లు అయినా నడకను అలవాటు చేసుకోవడం ఎంతో అవసరం.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)