AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జుట్టు తెల్లబడకుండా ఉండాలంటే ఇలా చేయండి.. యవ్వనంగా కనిపిస్తారు..!

ప్రస్తుత రోజుల్లో చిన్న వయసు లోనే జుట్టు తెల్లబడడం చాలా మందికి సమస్యగా మారింది. అయితే జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే.. సహజమైన పద్ధతులు పాటిస్తే.. ఈ సమస్యను ఆలస్యం చేయడం పూర్తిగా సాధ్యం అవుతుంది. ఈ ప్రక్రియలో ఆహారం, ఒత్తిడి నియంత్రణ, ఆయుర్వేద చిట్కాలు కీలకపాత్ర పోషిస్తాయి.

జుట్టు తెల్లబడకుండా ఉండాలంటే ఇలా చేయండి.. యవ్వనంగా కనిపిస్తారు..!
White Hair
Prashanthi V
|

Updated on: Jul 01, 2025 | 5:19 PM

Share

ప్రస్తుత రోజుల్లో చాలా మందికి చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం మొదలవుతోంది. దీనికి పోషకాలు సరిగా లేకపోవడం, ఒత్తిడి, జీవనశైలి సరిగా లేకపోవడం, వారసత్వంగా రావడం లాంటి అనేక కారణాలు ఉండొచ్చు. అయితే కొన్ని మంచి అలవాట్లతో జుట్టు తెల్లబడటాన్ని ఆలస్యం చేయొచ్చు. ఇప్పుడు అలాంటి సహజ పద్ధతులు, సులభమైన మార్గాల గురించి తెలుసుకుందాం.

జుట్టు ఆరోగ్యానికి యాంటీఆక్సిడెంట్లు

జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే శరీరాన్ని ఆక్సిడేటివ్ ఒత్తిడి నుంచి కాపాడుకోవాలి. బెర్రీలు, ఆకుకూరలు, బాదం, వాల్‌నట్ లాంటివి మంచి యాంటీఆక్సిడెంట్లను ఇస్తాయి. ఇవి జుట్టు పెరగడానికి, నలుపు రంగును నిలబెట్టుకోవడానికి సహాయపడతాయి. ప్రతిరోజూ మనం తినే ఆహారంలో ఇవి ఉండేలా చూసుకోవాలి.

తలకు ఆయిల్ మసాజ్

నూనెను తలకు రాసి మెల్లగా మసాజ్ చేస్తే తల చర్మంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇది జుట్టు ఒత్తిడిని తగ్గించి, బలంగా పెరిగేలా చేస్తుంది. కొబ్బరి నూనె, భృంగరాజ్ నూనె, నువ్వుల నూనె లాంటివి మంచి ఫలితాలను ఇస్తాయి.

శరీరానికి సరిపడా నీరు

నీరు తక్కువగా తాగితే జుట్టు వాడిపోయి, రంగు మారే అవకాశం ఉంటుంది. రోజూ కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగడం వల్ల శరీరంలోని విష పదార్థాలు బయటకు వెళ్లిపోయి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. తల తేమగా ఉండటం వల్ల జుట్టులో సహజ మెరుపు కనిపిస్తుంది.

ఒత్తిడి తగ్గిస్తే జుట్టు తెల్లబడదు

ఎక్కువ ఒత్తిడికి గురయ్యే వారిలో జుట్టు త్వరగా తెల్లబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. యోగా, ధ్యానం, నడక, సంగీతం లాంటివి మనసుకు ప్రశాంతతను ఇచ్చి ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇది జుట్టు రంగుపై మంచి ప్రభావాన్ని చూపుతుంది.

పొగతాగడం మానేయండి

పొగతాగడం వల్ల శరీరంలోని కణాలు తొందరగా పాడవుతాయి. ఇది జుట్టు రంగును ప్రభావితం చేస్తుంది. పొగతాగడం వల్ల రక్త ప్రసరణకు అడ్డు వస్తుంది. దానివల్ల తల జుట్టుకు సరిపడా ఆక్సిజన్, పోషకాలు అందవు. కాబట్టి ఈ అలవాటును పూర్తిగా మానేయడం మంచిది.

విటమిన్ B12 లోపం

విటమిన్ B12 లోపం వల్ల జుట్టు తెల్లబడే అవకాశం ఉంటుంది. దీనిని ఆపడానికి B12 ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి. చికెన్, చేపలు, గుడ్లు, పాల పదార్థాలు లాంటివి బాగా ఉపయోగపడతాయి. శాఖాహారులు ఫోర్టిఫైడ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఈ విటమిన్ లభిస్తుంది.

తులసి, గోరింటాకుతో తలస్నానం

తులసి ఆకులు, గోరింటాకులు, ఉల్లిపాయ పొడిని సమానంగా తీసుకుని వాటిని కొద్దిగా నీటిలో మరిగించాలి. ఆ నీరు చల్లారిన తర్వాత తలస్నానానికి ఉపయోగించవచ్చు. వారానికి రెండు లేదా మూడు సార్లు ఇలా చేయడం వల్ల జుట్టు నల్లగా మారడానికి సహాయపడుతుంది.

ఉలువలు, ఉల్లిపాయ రసం ట్రీట్‌ మెంట్

ఉలువలును నీటిలో మరిగించి ఆ నీటిని వడకట్టాలి. దానికి ఉల్లిపాయ రసం కలిపి తలకి పట్టించాలి. ఇది తల చర్మానికి పోషకాలను అందించి జుట్టు బలంగా మారేలా చేస్తుంది. 20 నిమిషాల తర్వాత తలను శుభ్రంగా కడగాలి. ఇది సహజమైన, రసాయనాలు లేని చికిత్స.

జుట్టు తెల్లబడటాన్ని పూర్తిగా ఆపలేకపోయినా.. కొన్ని సహజమైన పద్ధతుల ద్వారా దాన్ని ఆలస్యం చేయొచ్చు. సరైన ఆహారం, వ్యాయామం, తగిన జాగ్రత్త, ఆయుర్వేద ఇంటి చిట్కాల ద్వారా సహజ నలుపు జుట్టును ఎక్కువ కాలం నిలుపుకోవచ్చు. ఈ సలహాలను పాటిస్తే మీ జుట్టు ఆరోగ్యంగా, నల్లగా ఉంటుంది.