AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాలపొడి వాడితే పిల్లల ఆరోగ్యానికి మంచిదేనా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..?

తాజా పాలు దొరకనప్పుడు పాలపొడి చవకైన ప్రత్యామ్నాయంగా ఉంటుంది. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు పూర్తి పోషణ అందించాలని కోరుకుంటారు. అందుకే పాలపొడి వాడితే పిల్లల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుందని ఆలోచిస్తున్నారు. అసలు పాలపొడి వాడటం వల్ల పిల్లల ఆరోగ్యానికి మంచిదేనా కాదా అనే విషయంపై పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

పాలపొడి వాడితే పిల్లల ఆరోగ్యానికి మంచిదేనా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..?
Is Milk Powder Safe For Kids
Prashanthi V
|

Updated on: Jun 28, 2025 | 4:58 PM

Share

పాలపొడి అంటే తాజా పాల నుంచి నీటిని తీసేసిన తర్వాత మిగిలే ఉత్పత్తి. ఇది పూర్తి కొవ్వుతో (ఫుల్ క్రీమ్), కొవ్వు తీసేసినది (స్కిమ్డ్) అని రెండు రకాలుగా దొరుకుతుంది. దీన్ని ఎక్కువ కాలం నిల్వ చేసుకోవచ్చు. అత్యవసర సమయాల్లో ఉపయోగించుకోవడానికి కూడా ఇది సౌకర్యంగా ఉంటుంది.

ఆరోగ్య నిపుణులు ఈ విషయంపై స్పందిస్తూ.. పాలపొడిని చాలా చోట్ల సురక్షితంగా వాడుతున్నారు. అయితే దీన్ని వాడేటప్పుడు లాభాలు, నష్టాలు రెండింటినీ గమనించాలి. ముఖ్యంగా చిన్నపిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అని వివరించారు.

పాలపొడిని సరిగ్గా నిల్వ చేయకపోతే బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంది. ఇది అరుదుగా జరిగినా.. చిన్నపిల్లల ఆరోగ్యానికి ప్రమాదంగా మారవచ్చు. ఎందుకంటే వారి రోగనిరోధక శక్తి పూర్తిగా అభివృద్ధి చెందదు. అందుకే పాలపొడి వాడే ముందు ఎప్పుడూ శుభ్రమైన నీటితో కలపాలి. దీన్ని ఎండ తగలకుండా చల్లగా ఉండే చోట ఉంచాలి.

కొన్ని బ్రాండ్ల పాలపొడుల్లో తయారీ సమయంలో విషపూరిత లోహాలు, రసాయనాలు కలిసే అవకాశం ఉంది. ఇవి పిల్లల ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చు. దీనికి పరిష్కారంగా గుర్తింపు పొందిన సంస్థల నుంచి సర్టిఫైడ్ ఉత్పత్తులనే ఎంచుకోవాలి. ఆర్గానిక్ బ్రాండ్లైనా కూడా.. ప్రతి ప్యాక్‌ కు భద్రతా ధృవీకరణ ఉందో లేదో చూసుకోవాలి.

చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా తయారయ్యే వాణిజ్య పాలపొడుల్లో ఎక్కువగా చక్కెర, ఫ్లేవర్స్, కెమికల్ ప్రిజర్వేటివ్‌ లు కలుపుతారు. ఇది పిల్లల్లో బరువు పెరగడానికి, పళ్ల సమస్యలకు, భవిష్యత్తులో షుగర్ వచ్చే ప్రమాదం పెరగడానికి కారణం కావచ్చు. అందుకే తల్లిదండ్రులు కొనే ముందు లేబుల్ చదివి.. చక్కెర లేని లేదా తక్కువ చక్కెర ఉన్న పాలపొడిని ఎంచుకోవడం మంచిది.

పాలపొడి కొంతవరకు ముఖ్యమైన పోషకాలు అందించినా.. దీనిపై ఎక్కువగా ఆధారపడితే ఇతర ముఖ్యమైన పోషకాల లోపం ఏర్పడవచ్చు. ముఖ్యంగా సహజంగా ఉండే కొవ్వులు, శక్తివంతమైన పదార్థాలు తాజా పాలలో ఉంటాయి. అలాంటి వాటిని పాలపొడి అందించకపోవచ్చు. అందువల్ల పిల్లల ఆహారంలో అన్ని రకాల ఆహార పదార్థాలతో పాటు పాలపొడిని పరిమితంగా వాడాలి.

పాలపొడిలో కూడా లాక్టోస్ ఉంటుంది. ఇది కొంతమంది పిల్లల జీర్ణవ్యవస్థలో సమస్యలు కలిగించవచ్చు. ముఖ్యంగా లాక్టోస్ పడని పిల్లలకు పొట్ట ఉబ్బరం, పేగుల సమస్యలు, వాంతులు లాంటివి రావచ్చు. అలాంటి పరిస్థితుల్లో లాక్టోస్ ఫ్రీ పాలపొడి లేదా బాదం పాలు, సోయా పాలు లాంటి ప్రత్యామ్నాయాలను తల్లిదండ్రులు ఆలోచించవచ్చు.

పాలపొడి చవకైన ధరలో అవసరమైనప్పుడు మంచి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. కానీ దీన్ని పిల్లల రోజువారీ ఆహారంలో భాగం చేసే ముందు జాగ్రత్త పడాలి. ఎందుకంటే తాజా పాలతో సమానంగా పోషక విలువలు అందించలేకపోవడం, కొంతవరకు ప్రమాదం కలిగించే అవకాశం ఉండడం వల్ల.. దీనిపై నిర్ణయం తీసుకునే ముందు మీ పిల్లల ఆరోగ్య పరిస్థితిని బట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.