మీ టూత్ బ్రష్ ఎక్కడ పెడుతున్నారు..? ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారా.. లేదా..?
వైద్య నిపుణుల ప్రకారం వాష్ రూమ్ అనేక రకాల బ్యాక్టీరియా, సూక్ష్మజీవుల నివాసంగా ఉంటుంది. వాష్ రూమ్ శుభ్రం చేస్తూ ఉన్నప్పుడు.. వ్యాధికర సూక్ష్మకణాలు గాలిలోకి వెదజల్లబడతాయి. ఆ హానికర కణాలు గాలిలో తేలుతూ టాయిలెట్ కు దగ్గరగా ఉన్న వస్తువులపై చేరుతాయి.

మన రోజువారీ జీవితంలో టూత్ బ్రష్ ఎంతో అవసరమైనది. మన పళ్లను శుభ్రంగా ఉంచడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది. అయితే చాలా మంది టూత్ బ్రష్ ను ఉపయోగించిన తర్వాత అదే బాత్రూంలోనే ఉంచేస్తారు. అనేక ప్రాంతాల్లో బాత్రూమ్, టాయిలెట్ రెండు కలిపి ఉంటాయి. అలా ఉంచినప్పుడు బ్రష్ టాయిలెట్ సమీపంలో ఉండటంతో అనేక రకాల హానికర బ్యాక్టీరియా తాకే ప్రమాదం ఉంటుంది.
బ్రష్ ను టాయిలెట్ దగ్గర ఉంచడం వల్ల ఈ.కోలై, సాల్మొనెల్లా, స్టాఫిలోకోకస్ వంటి ప్రమాదకర సూక్ష్మజీవులు దానిపై చేరే అవకాశం ఉంటుంది. ఇవి నేరుగా నోటి ద్వారా శరీరంలోకి వెళ్లి జీర్ణ సంబంధిత సమస్యలు, ఇన్‌ఫెక్షన్లు, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం వంటి ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు.
చాలా మంది తమ బ్రష్ ను మూత పెట్టి ఉంచే అలవాటు కలిగి ఉంటారు. కానీ అది కూడా శాశ్వతంగా సురక్షితం కాదు. ఎందుకంటే బ్రష్ తడిగా ఉన్న వాతావరణం బ్యాక్టీరియా వృద్ధికి అనుకూలంగా ఉంటుంది. అంతేకాక తడి గదుల్లో టూత్ బ్రష్ ను ఉంచడం వల్ల అటు బయట నుంచి వచ్చే ధూళి, బ్యాక్టీరియా అంతే కాకుండా ఫంగస్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది.
బ్రష్ పూర్తిగా ఆరిపోయేలా చూసుకోవడం అత్యవసరం. బ్రష్ ను టాయిలెట్ గదిలో కాకుండా ఎక్కడైనా వెలుతురు, గాలి వచ్చే ప్రదేశంలో ఉంచితే అది ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా గాలి సరిగా లేని వాష్ రూమ్ లో తడి ఎక్కువగా ఉండడం వల్ల బ్రష్ పై ఫంగస్ పెరిగే ప్రమాదం ఉంది. ఇది శ్వాస సంబంధిత సమస్యలు, అస్థమా, అలెర్జీలు వంటి వాటికి దారితీయవచ్చు. అలాంటి పరిస్థితులు రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి మరింత ప్రమాదకరం.
సామాన్యంగా కనిపించే ఈ చిన్న తప్పిదం వలన పెద్ద ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. కాబట్టి టూత్ బ్రష్ ను ఎక్కడ ఉంచుతున్నామో జాగ్రత్తగా పరిగణించాలి. ప్రతి రోజూ ఉపయోగించే వస్తువు అయినందున దానిని శుభ్రంగా, సురక్షితంగా ఉంచడం వల్ల మాత్రమే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.




