AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుడు కోటీశ్వరుడు.. ఇప్పుడు రాపిడో డ్రైవర్! కోవిడ్ తెచ్చిన కష్టం.. కన్నీళ్లు తెప్పిస్తున్న రియల్ హీరో కథ!

కాలం ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఉంచుతుందో ఎవరూ ఊహించలేరు. నిన్న కోట్లలో వ్యాపారం చేసిన వ్యక్తి, నేడు సామాన్యుడిలా రోడ్డు మీద బైక్ నడుపుతూ కనిపించవచ్చు. ఇది ఏదో సినిమా కథ కాదు.. అక్షరాలా నిజం. ఒకప్పుడు విలాసవంతమైన జీవితం గడిపిన ఓ వ్యక్తి, ..

అప్పుడు కోటీశ్వరుడు.. ఇప్పుడు రాపిడో డ్రైవర్! కోవిడ్ తెచ్చిన కష్టం.. కన్నీళ్లు తెప్పిస్తున్న రియల్ హీరో కథ!
Rapido Driver
Nikhil
|

Updated on: Dec 24, 2025 | 7:30 AM

Share

కాలం ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఉంచుతుందో ఎవరూ ఊహించలేరు. నిన్న కోట్లలో వ్యాపారం చేసిన వ్యక్తి, నేడు సామాన్యుడిలా రోడ్డు మీద బైక్ నడుపుతూ కనిపించవచ్చు. ఇది ఏదో సినిమా కథ కాదు.. అక్షరాలా నిజం. ఒకప్పుడు విలాసవంతమైన జీవితం గడిపిన ఓ వ్యక్తి, ఏకంగా రూ. 14 కోట్ల ఆస్తులను పోగొట్టుకుని, చివరకు తన కుటుంబాన్ని పోషించుకోవడానికి బైక్ టాక్సీ డ్రైవర్‌గా మారాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆయన గాథ ఇప్పుడు లక్షలాది మందికి స్ఫూర్తినిస్తోంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? ఆయనకు అంత కష్టం ఎందుకు వచ్చింది?

కోవిడ్​తో కోలుకోలేని దెబ్బ..

ఆయన పేరు ప్రశాంత్ (పేరు మార్చాం). ఒకప్పుడు ఆయనది చాలా పెద్ద వ్యాపార సామ్రాజ్యం. సుమారు రూ. 14 కోట్ల టర్నోవర్ ఉండే బిజినెస్‌ను ఆయన నడిపేవారు. సొంత కారు, పెద్ద ఇల్లు, సమాజంలో హోదా.. అన్నీ ఉన్నాయి. కానీ, 2020లో వచ్చిన కోవిడ్ మహమ్మారి ఆయన జీవితాన్ని తలకిందులు చేసింది. లాక్‌డౌన్ కారణంగా వ్యాపారం కుప్పకూలిపోయింది. అప్పులు పెరిగిపోయాయి. చేసేదేం లేక తన దగ్గరున్న ఆస్తులన్నీ అమ్మి అప్పులు తీర్చాల్సి వచ్చింది. చివరకు చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితి ఏర్పడింది.

అభిమానం చంపుకుని..

అంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక్కసారిగా కిందకు పడిపోతే కుంగిపోవడం సహజం. కానీ ఆయన అలా చేయలేదు. తన భార్య, పిల్లల ఆకలి తీర్చడం కోసం ఏ పనైనా చేయాలనుకున్నారు. లోకం ఏమనుకుంటుందో అన్న మొహమాటాన్ని పక్కన పెట్టి, తన దగ్గరున్న పాత బైక్‌ను బయటకు తీశారు. ‘రాపిడో’ డ్రైవర్‌గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. రోజుకు వందల కిలోమీటర్లు ప్రయాణిస్తూ, ఎండనక వాననక కష్టపడుతూ గౌరవప్రదంగా జీవనం సాగిస్తున్నారు.

ఇటీవల ఆయన బైక్ ఎక్కిన ఒక ప్రయాణికుడు ప్రశాంత్ కథ విని చలించిపోయాడు. ఆ వివరాలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో అది కాస్తా వైరల్ అయ్యింది. “ఒకప్పుడు రూ. 14 కోట్లు పోగొట్టుకున్నాను.. కానీ నాలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. శ్రమను నమ్ముకుంటే ఏదైనా సాధించవచ్చు” అని ప్రశాంత్ చెప్పిన మాటలు నెటిజన్ల మనసు గెలుచుకుంటున్నాయి. ఓటమి ఎదురైనప్పుడు కుంగిపోకుండా, పోరాడే గుణమే మనిషిని అసలైన విజేతగా నిలబెడుతుంది. ప్రశాంత్ కథే దానికి నిదర్శనం. ఆస్తులు పోయినా పర్వాలేదు, ఆత్మగౌరవం ఉంటే మళ్ళీ నిలబడొచ్చని ఆయన నిరూపించారు. ఆయన పట్టుదల చూసి నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు.