Alzheimer Vs Dementia: వృద్ధులకు అలర్ట్.. ఆ రెండింటితో జాగ్రత్త.. ఈ లక్షణాలుంటే వెంటనే అప్రమత్తం అవ్వండి..
ఎక్కువగా 60 నుంచి 65 ఏళ్ల పైబడిన వృద్ధుల్లో ఈ అల్జీమర్స్, డిమెన్షియా లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ రెండూ ఒకటేనా? వేర్వేరా? అల్జీమర్స్ వస్తే ఎలా ఉంటుంది? డిమెన్షియా వస్తే ఎలా ఉంటుంది? రెండింటికీ లింక్ ఏమైనా ఉందా? తెలుసుకుందాం రండి..

శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయాలంటే మెదడు ఆరోగ్యంగా ఉండాలి. శరీరంలో మెదడు ఒక కేంద్ర బిందువు లాంటిది. అన్ని అవయవాలకు ఆదేశాలు, సూచనలు, సలహాలు అందేది మెదడు నుంచే. మన దైనందిన జీవితంలో నిర్వర్తించే అన్ని విధులు దాని ఆదేశాలకు అనుగుణంగానే జరుగుతాయి. జరిగిన ప్రతి విషయాన్ని మెదడు స్టోర్ చేసుకొని సమయానుగుణంగా గుర్తు చేసి, తదనుగుణంగా ప్రవర్తించేలా చేస్తుంది. అయితే జ్ఞాపకశక్తి లోపించినా, లేదా డెమెన్షియా, అల్జీమర్స్ వంటి వ్యాధులు వచ్చినా ఈ వ్యవస్థ దెబ్బతింటుంది. ఆలోచనాశక్తి దెబ్బతింటుంది. ఏ విషయం గుర్తుండదు. ఇటువంటి లక్షణాలు కనిపిస్తే కచ్చితంగా అల్జీమర్స్ గానీ లేదా డిమెన్షియా(చిత్త వైకల్యం) గానీ అవుతుంది. సాధారణంగా వయస్సు పైబడే కొద్దీ ఇటువంటి వ్యాధులు వస్తుంటాయి. ఎక్కువగా 60 నుంచి 65 ఏళ్ల పైబడిన వృద్ధుల్లో ఈ అల్జీమర్స్, డిమెన్షియా లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ రెండూ ఒకటేనా? వేర్వేరా? అల్జీమర్స్ వస్తే ఎలా ఉంటుంది? డిమెన్షియా వస్తే ఎలా ఉంటుంది? రెండూ మెదడు సంబంధిత వ్యాధులే గానీ తేడాలేంటి? రెండింటికీ లింక్ ఏమైనా ఉందా? తెలుసుకుందాం రండి..
డిమెన్షియా అంటే ఏమిటి?
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం చిత్తవైకల్యం(డిమెన్షియా) అనేది ఒక సిండ్రోమ్. ఇది సాధారణంగా దీర్ఘకాలిక ప్రభావం కలిగి ఉంటుంది. వృద్ధాప్యంలో ఆలోచనాశక్తి లోపించడం, సరిగ్గా నిర్ణయాలు తీసుకోలేకపోవడం జరుగుతుంది. ఇది తలకు ఏదైనా గాయాలు కలిగినా దీర్ఘకాలంలో ఇది బయటపడుతుంది.
డిమెన్షియా లక్షణాలు ఇవి..
- జరిగిన విషయాలు గుర్తుపెట్టుకొనే సామర్థ్యం కోల్పోవడం, అంటే జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది.
- మాట్లాడటం కష్టమవుతుంది. త్వరగా పదాలు వారికి దొరకవు. భావ వ్యక్తీకరణ చేయలేరు.
- డ్రైవింగ్ చేసే సమయంలో కళ్లు మసకలవడం, దూరాలు సరిగ్గా అంచనా వేయలేకపోవడం. సమస్యను పరిష్కరించడంలో లోపాలు, తార్కికజ్ఞానం లోపించడం
- ఒకేసారి ఎక్కువ పనులు చేయలేకపోవడం
- ప్లానింగ్, ఆర్గనైజింగ్ సరిగ్గా చేయలేకపోవడం
- ప్రతి దానికి టెన్షన్ పడటం, గందరగోళం ఫీల్ అవడం, దిక్కుతోచని స్థితిలోకి వెళ్లడం వంటివి జరుగుతుంటాయి.
అల్జీమర్స్ అంటే ఏమిటి?
అల్జీమర్స్ వ్యాధి అనేది మెదడుకు సంబంధించిన వ్యాధి. ఇది నెమ్మదిగా జ్ఞాపకశక్తిని తగ్గిస్తుంది. ఆలోచనా నైపుణ్యాలను దెబ్బ తీస్తుంది. చివరికి సరళమైన పనులను చేయలేని పరిస్థితికి మనిషిని తీసుకెళ్తుంది. ఇది మనిషి ప్రవర్తనను కూడా ప్రభావితం చేస్తుంది. దీనిని త్వరితగతిన గుర్తించకపోతే రోజువారీ పనులు కూడా చేసుకోలేనంతగా ఇబ్బంది పెడుతుంది. అల్జీమర్స్ అసోసియేషన్ చెబుతున్న దాని ప్రకారం అల్జీమర్స్ అనేది డిమెన్షియాకు ప్రధాన కారణం. దాదాపు 60 నుంచి 80 శాతం డిమన్షియా కేసుల్లో అల్జీమర్స్ ఉన్నవారే ఉంటారు.



అల్జీమర్స్ లక్షణాలు..
- ఇటీవలి సంఘటనలు లేదా సంభాషణలను గుర్తుపెట్టుకోలేకపోవడం
- ఉదాసీనత పెరిగిపోతుంది.
- డిప్రెషన్
- స్పష్టంగా ఏది చెప్పలేకపోవడం
- దిక్కుతోచని స్థితి
- గందరగోళం
- ప్రవర్తనలో మార్పులు
- వ్యాధి ముదిరిన దశలలో మాట్లాడటం, మింగడం లేదా నడవడం కూడా కష్టమవుతుంది.
వాస్తవానికి డిమెన్షియా, అల్జీమర్స్ ఒకే గొడుగు కిందకు వస్తాయి. అయితే డిమెన్షియా రావడానికి అల్జీమర్స్ ఒక ప్రధాన కారణం. రెండు మెదడు సంబంధిత వ్యాధులే. ముందుగా గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే వాటి ప్రభావాలను నివారించవచ్చు. లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..