Heart Attack: ‘గుండె’కు పెరుగుతున్న ముప్పు.. ఈ 5 కారణాలే అంటున్న డాక్టర్లు..
సడెన్‌గా గుండె ఆగిపోతోంది. అంతకుముందే కళ్ల ముందు నవ్వుతూ కనిపించిన మనిషి విగతజీవిగా మారిపోతున్నాడు. సెలబ్రిటీల నుంచి సామాన్యుల దాకా హార్ట్ అటాక్‌కు బలైపోతున్నారు.
సడెన్‌గా గుండె ఆగిపోతోంది. అంతకుముందే కళ్ల ముందు నవ్వుతూ కనిపించిన మనిషి విగతజీవిగా మారిపోతున్నాడు. సెలబ్రిటీల నుంచి సామాన్యుల దాకా హార్ట్ అటాక్‌కు బలైపోతున్నారు. లేదా గుండెపోటుతో మూలన పడే పరిస్థితి వస్తోంది. గుండెపోటు, హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్. పేరేదైనా అసలు గుండె జబ్బులు ఎందుకు వస్తున్నాయి? వాటికి కారణాలేంటి? చిన్న వయసులో కూడా హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తున్నాయి? గుండె దెబ్బ తినడానికి, గుండె పోటు రావడానికి 5 కారణాలు ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు. గుండెను ఇబ్బంది పెడుతున్న ఆ 5 కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
గుండెజబ్బులు రావడానికి 5 ప్రధాన కారణాలు ఉన్నాయంటున్నారు కార్డియాలజిస్టులు. స్ట్రెస్ వల్ల గుండె మీద ఒత్తిడి పెరిగిపోయి అది దెబ్బ తినే పరిస్థితి వస్తుంది. ఇక లైఫ్‌స్టైల్.. అంటే మన జీవనశైలి. ఇది కూడా హార్ట్‌ను బాగా డ్యామేజ్ చేస్తోంది. ఇక బ్యాడ్ హ్యాబిట్స్ కూడా హార్ట్ స్పీడుకు బ్రేకులు వేసి స్లో పాయిజన్‌లా దెబ్బ తీస్తున్నాయి. ఇక జెనెటికల్‌గా వచ్చే జబ్బులు. అంటే మన తల్లిదండ్రుల నుంచి తాతముత్తాల నుంచి మనకు వారసత్వ ఆస్తిలా సంక్రమించే జెనెటికల్ జబ్బులు కూడా మన గుండెను పరేషాన్‌లో పడేస్తున్నాయి. ఇక కోవిడ్ పోయినా దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ మాత్రం గుండెలకు గురి పెట్టి మరీ దెబ్బ తీస్తున్నాయి.
ఒత్తిడి..
ఒత్తిడి, ఒత్తిడి, ఒత్తిడి. అవును, ఇప్పుడు స్ట్రెస్ చంపేస్తోంది. ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్లేదాకా త్వరగా వెళ్లాలనే ఒత్తిడి. ఆఫీసుకు వెళ్లాక పని ఒత్తిడి. ఇంట్లో స్ట్రెస్, బయట స్ట్రెస్. రెస్ట్ లేని జీవితాలు. దంతా మీ గుండెపై ఎంత ఒత్తిడిని పెంచేస్తోందో మీకు తెలుసా? ఉరుకుల పరుగుల జీవితాలు.. ఒత్తిడి పెరిగి పెరిగి ఏదో ఒక పాయింట్ దగ్గర హార్ట్ అటాక్‌తో రనౌట్ అయిపోతున్నాయి. స్ట్రెస్‌తో మన లైఫ్.. ప్రెజర్ కుక్కర్‌లో పెట్టిన టమోటాలా పేలిపోయే స్టేజీకి చేరుతోంది. ఈ ఒత్తిడికి ఫ్రస్ట్రేషన్స్, ఒంటరితనం, డిప్రెషన్, మానసిక సమస్యలు తోడైతే… గుండె భరించలేక బరస్ట్ అయ్యే స్టేజ్‌కి చేరుకుంటుంది అంటున్నారు డాక్టర్లు.
లైఫ్ స్టైల్..
ఇక లైఫ్ స్టైల్ మన ప్రాణాలు తోడేస్తోంది. అర్ధరాత్రి దాటాక లేటుగా పడుకోవడం లేటుగా లేవడం లాంటివి గుండెను దెబ్బ తీసి పేరుకు ముందు లేట్.. అనగా కీర్తిశేషులు అని వచ్చేలా చేసే ప్రమాదం ఉందంటున్నారు డాక్టర్లు. టీవీలు, కంప్యూటర్ల ముందు కూర్చుని గంటలుగంటలు కాలక్షేపం చేయడం మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు. దీనికితోడు ఫుడ్ హ్యాబిట్స్, శారీరక శ్రమ లేకపోవడం లాంటివి హార్ట్‌కు రిస్క్ ఫ్యాక్టర్‌ను మరింత పెంచేస్తున్నాయి.
చెడు అలవాట్లు..
ఇక అలవాటులో పొరపాట్లు పర్వాలేదు. కానీ దురలవాట్లు ఉంటే మాత్రం వెంటనే మానెయ్యండి. ఉఫ్ అంటూ ఊది పడేసే సిగరెట్ మీ జీవితాన్నే ఊది పారేస్తుంది. అది గుండెకు పొగ చూరేలా చేస్తుంది. స్మోకింగ్, డ్రింకింగ్ లాంటివి హార్ట్‌కి రిస్క్ ఫ్యాక్టర్‌ని పెంచేసిన ఆయుష్షును తగ్గించేస్తాయి. వీటికితోడు హై కొలెస్ట్రాల్ కూడా తోడైతే పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది. సిగరెట్లు, మద్యం, పొగాకుతో గుండెకు చేటు జరుగుతుంది. పొగాకులోని కెమికల్స్ వల్ల రక్తం చిక్కబడుతుంది. రక్త నాళాలు వాచి రక్తం సరఫరాకు ఆటంకం ఏర్పడుతుంది. స్మోకింగ్ వల్లే 25 శాతం గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి. స్మోకింగ్‌తో పాటు పాసివ్ స్మోకింగ్ కూడా చాలా డేంజర్ అంటున్నారు వైద్యులు. ఆల్కహాల్‌తో బీపీ, రక్తంలో ఫ్యాట్స్ పెరుగుతాయి. మద్యానికి బానిసలైతే హార్ట్ బీట్‌లో హెచ్చుతగ్గులు వస్తాయి. గుండె రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్ అయ్యే ప్రమాదం ఉంది.
జన్యు సంబంధిత కారణాలు..
ఇక జెనెటికల్‌గా వచ్చే జబ్బులు కూడా హార్ట్‌కు రిస్క్ ఫ్యాక్టర్‌ని పెంచుతాయంటున్నారు వైద్యులు. మన తల్లిదండ్రులు, తాతముత్తాతలు మనకు ఆస్తులతో పాటు అంతు తెలియని రోగాలను కూడా వారసత్వంగా ఇచ్చిపోతారు. అందుకే వారసత్వం రోగాలను కూడా మోసుకొస్తుంది. బీపీ, షుగర్ లాంటివి లైఫ్ స్టైల్ వల్లే కాకుండా వారసత్వంగా కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఈ వారసత్వ వ్యాధులు వచ్చిన వాళ్లకు హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
కోవిడ్ ఎఫెక్ట్..
ఇప్పుడు చాలామంది యువకుల్లో కూడా గుండెపోటు వస్తోంది. పెద్దగా వయసు లేనివాళ్ల కూడా హార్ట్ అటాక్ దెబ్బతీస్తోంది. దీనికి కోవిడ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కారణమంటున్నారు. కోవిడ్ పోయినా దీర్ఘకాలంలో గుండెను దాని ప్రభావం దెబ్బతీస్తోందని చెబుతున్నారు. అయితే ఇది ఎంతవరకు నిజం? కోవిడ్ వచ్చి తగ్గినవాళ్ల గుండె ఎంతవరకు సేఫ్? గుండెపై కోవిడ్ చూపిస్తున్న ప్రభావం ఎంత? అనేది తేలాల్సి ఉంది.
ఇవి కంట్రోల్ చేసుకుంటే..
ఇలా సప్త వ్యసనాలు కాదు, పంచ భూతాల్లాంటి పంచ కారణాలను కంట్రోల్‌లో ఉంచితే ప్రమాదం మన గుండె దాకా రాదు. మన గుండె గట్టిగా ఉండి పది కాలాల పాటు ఆగకుండా కొట్టుకుంటుంది. మీ హార్ట్‌ని కాపాడుకునే ఉపాయం, అవకాశం మీ చేతుల్లోనే ఉంది. హార్ట్‌ని పరేషాన్ చేసే అలవాట్లకు దూరంగా ఉండండి. యోగ, మెడిటేషన్ లాంటివి చేయడం, ఒత్తిడి తగ్గించుకుని, దురలవాట్లకు దూరంగా ఉంటే హార్ట్‌కి రిస్క్ ఫ్యాక్టర్స్ చాలావరకు తగ్గిపోతాయి అంటున్నారు డాక్టర్లు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..