AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pregnant Care: చలికాలంలో గర్భిణీలు ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి..

చలికాలం ఎంత ఉల్లాసంగా ఉంటుందో.. అంతే ప్రమాదకరం కూడా. ఈ సీజన్‌లో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు అనేక సమస్యలు తలెత్తుతాయి. వివిధ రకాల అలెర్జీలు, అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉంది.

Pregnant Care: చలికాలంలో గర్భిణీలు ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి..
Pregnancy
Shiva Prajapati
|

Updated on: Dec 17, 2022 | 10:24 PM

Share

చలికాలం ఎంత ఉల్లాసంగా ఉంటుందో.. అంతే ప్రమాదకరం కూడా. ఈ సీజన్‌లో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు అనేక సమస్యలు తలెత్తుతాయి. వివిధ రకాల అలెర్జీలు, అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ సీజన్‌లో తగిన దుస్తులు ధరించి.. వెచ్చగా, హైడ్రేట్‌గా ఉండటం, చురుకుగా ఉండటం వల్ల ప్రసవం ప్రశాంతంగా జరుగుతుంది. చలికాలంలో సాధారణంగానే ఉదయం పూట నిద్ర లేవాలంటే చాలామంది బద్దకిస్తుంటారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు నిద్ర లేచేందుకు ఇబ్బంది పడుతుంటారు. కానీ, ఇలా చేయడం సరికాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే.. ఉదయాన్నే లేచి కాస్త వ్యాయామం చేయాలని, సరైన సమయానికి అల్పాహారం తీసుకోవడం తప్పనిసరి అని స్పష్టం చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల గర్భిణీ స్త్రీతో పాటు, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించాల్సిన చిట్కాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలిపారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

తగినంత నీరు తాగాలి..

శీతాకాలంలో సాధారణంగా దాహం అనిపించదు. అయినప్పటికీ.. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అందుకే రోజుకు కనీసం 2.5 నుండి 3 లీటర్ల వాటర్ తాగాలి. కడుపులో ఉమ్మనీరు ఏర్పడటం కోసం నీరు అవసరం. అలాగే, శరీరంలో రక్తం స్థాయి పెరగడానికి కూడా ఇది ఉపకరిస్తుంది.

టీ, కాఫీ తగ్గించాలి..

టీ, కాఫీ శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. అందుకే.. టీ, కాఫీ ఎక్కువగా తాగొద్దు. టీ కి బదులుగా హైడ్రేట్‌గా ఉండేందుకు సూప్‌లు, కొబ్బరి నీళ్లు, తాజా జ్యూస్‌లు తాగొచ్చు.

ఇవి కూడా చదవండి

ఫ్లూ షాట్ తప్పనిసరి..

ఏ వైరల్ జబ్బులు రాకుండా ఉండేందుకు తప్పనిసరిగా మీ ఫ్లూ షాట్‌ను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే.. సబ్బు, నీటితో చేతులు సరిగ్గా కడగాలి. అవసరమైతే హ్యాండ్ శానిటైజర్ వాడాలి. అనారోగ్య వ్యక్తులకు దూరంగా ఉండాలి. రద్దీగా ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండాలి. డాక్టర్ సూచించిన సమయానికి మందులు తీసుకోవాలి. మాస్క్ ధరించాలి.

చురుకుగా ఉండండి..

మీరు క్రమం తప్పకుండా సున్నితమైన యోగా చేయవచ్చు. సాధారణ ఫిట్‌నెస్ నియమావళి గర్భధారణ సమయంలో ఆరోగ్యంగా ఉండటానికి ఉపకరిస్తుంది. వెన్నునొప్పి, అలసట వంటి అనేక సాధారణ నొప్పులను కూడా తగ్గిస్తుంది. ఇది గర్భధారణ మధుమేహం, ఒత్తిడిని తగ్గించడం.. ప్రసవానికి అవసరమైన శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. తగినంత నిద్రతో పాటు.. ఉదయం వేళ సూర్య కిరణాలకు కాసేపు కూర్చోవాలి. తద్వారా శరీరానికి అవసరమైన విటమిన్ డి అందుతుంది.

చర్మ సంరక్షణ..

మార్నింగ్ సిక్‌నెస్, ఆహార మార్పులు, చర్మ సంరక్షణ సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భధారణ సమయంలో చర్మ సమస్యలు తలెత్తుతాయి. అలాంటి పరిస్థితుల్లో మాయిశ్చరైజింగ్ క్రీమ్‌ను వాడాలి.

వైద్యుల అభిప్రాయం ప్రకారం.. తప్పనిసరిగా ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారంలో పండ్లు, కూరగాయలు, చికెన్, గుడ్లు, చేపలు, గింజలు, మొలకలు చేర్చుకోవాలి. బరువు పెరుగుటను నియంత్రించడానికి, రోగనిరోధక శక్తిని నిర్వహించడానికి స్వీట్లు, నూనె అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. సంతోషంగా, రిలాక్స్‌గా ఉండేందుకు దోహదపడే పనులు చేయాలి.

గమనిక: ప్రజల సాధారణ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.