Proning: ప్రోనింగ్‌ విధానం ద్వారా ఆక్సిజన్‌ స్థాయిలను మెరుగు పర్చుకోవడం ఎలా..? కేంద్ర ఆరోగ్యశాఖ సూచనలు

Proning: దేశంలో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. గత మొదటి వేవ్‌లో కంటే ఈ సెకండ్‌వేవ్‌లో పాజిటివ్‌ కేసులు,...

Proning: ప్రోనింగ్‌ విధానం ద్వారా ఆక్సిజన్‌ స్థాయిలను మెరుగు పర్చుకోవడం ఎలా..? కేంద్ర ఆరోగ్యశాఖ సూచనలు
Proning
Follow us

|

Updated on: Apr 23, 2021 | 3:50 PM

Proning: దేశంలో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. గత మొదటి వేవ్‌లో కంటే ఈ సెకండ్‌వేవ్‌లో పాజిటివ్‌ కేసులు, మరణాలు రెట్టింపు అవుతున్నాయి. ముఖ్యంగా సెకండ్‌వేవ్‌లో కరోనా రోగులు అధికంగా శ్వాసకోశ ఇబ్బందులతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. దీంతో మెడికల్‌ ఆక్సిజన్‌కు భారీగా డిమాండ్‌ ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో కరోనా సోకిన వారికి కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే శ్వాసకోశ ఇబ్బందుల నుంచి బయటపడవచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ సూచిస్తోంది. ముఖ్యంగా ‘ప్రోనింగ్‌’ (ప్రత్యేకమైన పొజిషన్‌లలో పడుకొని ఊపిరి తీసుకోవడం) వల్ల శ్వాసతోపాటు ఆక్సిజన్‌ స్థాయిలను మెరుగు పర్చుకోవచ్చని చెబుతోంది. ఛాతి, పొట్టభాగంపై బరువుపడే విధంగా పడుకోవడం లేదా ఒక పక్కకు పడుకొని శ్వాస తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులకు పూర్తి స్థాయిలో ఆక్సిజన్‌ చేరుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ సూచిస్తోంది. ‘ప్రోనింగ్‌’గా పిలిచే ఈ విధానం వైద్యపరంగా ధృవీకరణ పొందిందని పేర్కొంది. ముఖ్యంగా ఐసోలేషన్‌లో ఉన్న కోవిడ్‌ రోగులకు ప్రోనింగ్‌ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపింది.

ప్రోనింగ్‌ ద్వారా శ్వాస తీసుకునే విధానం..

► ముందుగా మంచంపై బోర్లా పడుకోవాలి ► ఒక మెత్తడి దిండు తీసుకుని మెడ కింది భాగంలో ఉంచాలి. ► ఛాతి నుంచి తోడ వరకు ఒకటి లేదా రెండు దిండ్లను ఉంచుకోవాలి. ► మరో రెండు దిండ్లను మోకాలి కింది భాగంలో ఉండేలా చూసుకోవాలి. ► ఇక ఎక్కువ సమయంలో పడకపై ఉండే రోగులకు రోజంతా ఒకే విధంగా వివిధ రకాల భంగిమల్లో విశ్రాంతి తీసుకోవచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ సూచిస్తోంది. ఒక్కో స్థానంలో 30 నిమిషాల నుంచి 2 గంటల వరకు పడుకోవచ్చని తెలిపింది.

Proning

Proning

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

► భోజనం చేసిన తర్వాత గంట వరకు ప్రోనింగ్‌ చేయవద్దు. ► సౌకర్యవంతంగా అనిపించినంత వరకు మాత్రమే ప్రోనింగ్‌ చేయాలి. ► వైద్యుల సూచనల ప్రకారం పలు సమయాల్లో రోజులో గరిష్టంగా 16 గంటల వరకు ప్రోనింగ్‌ చేయవచ్చు. ► హృద్రోగ సమస్యలు, గర్బిణులు, వెన్నుము సమస్యలున్నవారు ఈ విధానానికి దూరంగా ఉండాలి ► ప్రోనింగ్‌ సమయంలో దిండ్లను సౌకర్యవంతంగా ఉండేలా ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు.

ప్రోనింగ్‌ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి

► ప్రోనింగ్‌ ద్వారా శ్వాసమార్గం ద్వారా గాలి ప్రసరణ మెరుగు పడుతుంది. ► ఆక్సిజన్‌ స్థాయిలు 94 శాతం కంటే తక్కువగా పడిపోతున్న సమయంలోనే ప్రోనింగ్‌ అవసరం. ► ఐసోలేషన్‌లో ఉన్నప్పుడు శరీర ఉష్ణోగ్రత, ఆక్సిజన్‌ స్థాయిలు, రక్తంలో చక్కెర స్థాయిలను పరిశీలించుకోవాలి. ► ప్రోనింగ్‌ చేయడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కాపాడుకోవచ్చు.

కాగా, సాధారణ పద్దతిలో ఆక్సిజన్‌ స్థాయిలను పెంచేందుకు ప్రోనింగ్‌ సురక్షిత పద్దతేనని పలు అధ్యాయనాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం కోవిడ్‌ రోగులకు ఆక్సిజన్‌ అవసరం ఎక్కువగా ఉన్నందున ఐసోలేషన్‌లో ఉన్న కోవిడ్‌ రోగులకు ప్రోనింగ్‌ ఎంతో దోహదం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Proning

Proning