AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుక్క కరిచిన వెంటనే ఇలా చేయండి.. రేబిస్ వచ్చే ప్రమాదం ఉండదు..! గాయం చిన్నదే కదా అని నిర్లక్ష్యం చేయొద్దు..!

కుక్క కాటు అనేది అనుకోకుండా జరిగే సంఘటన. అయితే భయపడకుండా వెంటనే సరైన జాగ్రత్తలు తీసుకుంటే తీవ్రమైన సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. గాయాన్ని శుభ్రం చేయడం, టీకా వివరాలు సేకరించడం, ఇన్ఫెక్షన్ లక్షణాలను గమనించడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. పిల్లల విషయంలో మరింత జాగ్రత్త అవసరం.

కుక్క కరిచిన వెంటనే ఇలా చేయండి.. రేబిస్ వచ్చే ప్రమాదం ఉండదు..! గాయం చిన్నదే కదా అని నిర్లక్ష్యం చేయొద్దు..!
Dog Bite Emergency Guide
Prashanthi V
|

Updated on: Jul 07, 2025 | 2:38 PM

Share

కుక్క కాటు.. ఒక్కసారిగా భయపెట్టే సంఘటన. ఇది ముఖ్యంగా చిన్నపిల్లలకు తీవ్రమైన గాయాలు కలిగించే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో భయపడకుండా మానసికంగా స్థిరంగా ఉండటం.. వెంటనే సరైన చర్యలు తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే కుక్క కాటు వల్ల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్‌ లేదా రేబీస్‌ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి కాటు పడిన వెంటనే స్పందించటం.. తొందరగా చికిత్స తీసుకోవడం అనారోగ్య సమస్యలు నివారించడంలో కీలకం.

కుక్క కాటు.. తక్షణ జాగ్రత్తలు

కుక్క కరిచిన వెంటనే ముందుగా ఆ కుక్క నుండి దూరంగా వెళ్లి మీ భద్రతను కాపాడుకోవాలి. తరువాత అది పెంపుడు కుక్క అయితే.. యజమాని వద్దకు వెళ్లి టీకాల వివరాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా రేబీస్ టీకా వేసారా..? చివరిసారిగా ఎప్పుడు వేశారు..? అనే విషయాలు స్పష్టంగా తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. ఇవి వైద్య చికిత్సలో కీలకంగా ఉపయోగపడతాయి.

వివరాలు తెలుసుకోవాల్సిందే..

వీధి కుక్కయితే.. మీరు ఆ ప్రాంతం చుట్టుపక్కల నివసించే వారిని సంప్రదించాలి. ఆ కుక్కకు ఎవరైనా సంరక్షణ చేస్తునారా..? టీకాలు వేసారా..? వంటి వివరాలు తెలుసుకోవాలి. ఈ సమాచారం భవిష్యత్తులో సరైన వైద్య చికిత్స తీసుకోవడంలో చాలా ఉపయోగపడుతుంది.

తీవ్ర ప్రమాదం ఎవరికంటే..?

బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు లేదా డయాబెటిస్ ఉన్నవారికి కుక్క కాటు వల్ల తీవ్ర ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాటు లోతుగా ఉంటే నరాలు, కండరాలు, రక్తనాళాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు పెద్ద కుక్కల కాటుతో ఎముకలు విరిగిపోవడం లేదా శాశ్వత మచ్చలు పడే ప్రమాదం కూడా ఉంది.

ప్రాణాంతక వ్యాధుల ముప్పు

ఇవి మాత్రమే కాకుండా కొన్ని ప్రమాదకరమైన బ్యాక్టీరియాల వల్ల.. ఉదాహరణకు స్టెఫిలోకాకస్, పాశ్చరెల్లా, క్యాప్నోసైటోఫాగా వంటి వాటి వల్ల తీవ్రమైన ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. అలాగే టీకాల వివరాలు తెలియకపోతే రేబీస్ వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తే ప్రాణాలకు ప్రమాదం కలగొచ్చు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కాటుకు సంబంధించిన గాయం చిన్నదైనా సరే.. వెంటనే శుభ్రం చేయడం తప్పనిసరి. క్లీన్ వాటర్ తో గాయాన్ని బాగా కడిగి సబ్బుతో శుభ్రం చేయాలి. అనంతరం పోవిడోన్ ఐడెన్ (Povidone Iodine) లాంటి యాంటీసెప్టిక్ అప్లై చేయాలి. గాయాన్ని కవర్ చేసి రోజూ కట్టు మార్చాలి.

ఇన్ఫెక్షన్ లక్షణాలు కనిపిస్తే..

ఇన్ఫెక్షన్ లక్షణాలు లాంటి ఎరుపు, వాపు, పుళ్లు లేదా తీవ్రమైన నొప్పి వస్తే డాక్టర్‌ ను వెంటనే సంప్రదించాలి. డాక్టర్ ఇచ్చిన యాంటీబయోటిక్ మందులను పూర్తిగా వాడాలి మధ్యలో మానేయకూడదు.

డాక్టర్‌ ను ఎప్పుడు కలవాలి..?

  • కుక్క రేబీస్ టీకా వివరాలు తెలియకపోతే
  • గాయం లోతుగా ఉండి ఎక్కువగా రక్తం వస్తుంటే
  • ఎముకలు లేదా కండరాలు బయట కనిపిస్తే
  • చేతులు, కాళ్ల కదలికలు తగ్గిపోతే
  • గాయం ఎరుపుగా, వేడిగా మారితే లేదా పుళ్లు రావడం మొదలైతే
  • టెటనస్ టీకా పొందిన సమయం గుర్తులేకపోతే
  • నలత, జ్వరం, తల తిరగడం, మూర్ఛ వంటివి వస్తే

కుక్క కాటు అనేది హఠాత్తుగా జరిగే విషయం కావచ్చు. అయితే అలాంటి సందర్భంలో భయపడకుండా, మానసికంగా ధైర్యంగా ఉండటం.. వెంటనే సరైన చర్యలు తీసుకోవడం ద్వారా తీవ్రమైన సమస్యల నుండి దూరంగా ఉండొచ్చు. టీకాల సమాచారం సేకరించడం, గాయాన్ని శుభ్రంగా ఉంచడం, ఇన్ఫెక్షన్ లక్షణాలను జాగ్రత్తగా గమనించడం ఆరోగ్యాన్ని రక్షించడంలో కీలకంగా ఉంటుంది. ప్రత్యేకంగా చిన్నపిల్లల విషయంలో మరింత జాగ్రత్త అవసరం.