వాల్‌నట్స్‌తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా? వీరు మాత్రం అస్సలు తినొద్దు!
వాల్‌నట్స్‌లో మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలిగిస్తాయి. వీటిలో అనేక యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ప్రోటీన్, అనేక విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కానీ వాల్‌నట్స్ అందరికీ సరిపోవు. అలాంటి వారు వాల్నట్స్ కు దూరంగా ఉంటే మంచిది. లేదంటే తక్కువ మొత్తంలో తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.

మన ఆరోగ్యానికి డ్రైఫ్రూట్స్ ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ముఖ్యంగా వాల్నట్స్ కలిగించే ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. వాల్‌నట్స్(Walnuts)లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీఆక్సిడెంట్స్, ఫైబర్, ప్రోటీన్, అనేక విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. అందుకే దీన్ని సూపర్ ఫుడ్‌గా పరిగణిస్తారు. వాల్‌నట్స్ మెదడు చురుగ్గా పనిచేసేందుకు సహకరిస్తుంది. గుండె పనితీరుకు మద్దతిస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
అయితే, ఎవరైనా వాల్‌నట్స్‌తో అలర్జీ కలిగి ఉన్నట్లయితే.. వారు మాత్రం వీటికి దూరంగా ఉండటం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. వాల్‌నట్స్ వారికి ప్రమాదకరం కావచ్చంటున్నారు. వాల్‌నట్స్ తినడం వల్ల దురద, దద్దుర్లు, గొంతువాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్రమైన సందర్భాల్లో అనాఫిలాక్సిస్ ప్రమాదం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.
వాల్‌నట్స్ ఎవరికి ప్రమాదం?
వాల్‌నట్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కానీ, ఎక్కువగా తినడం వల్ల గ్యాస్, ఉబ్బరం, కడుపు నొప్పి, విరేచనాలకు దారితీయవచ్చు. అంతేగాక, ప్రకోప ప్రేగు సిండ్రోమ్ ఉన్నవారు లేదా ఇప్పటికే జీర్ణ సమస్యలు ఉన్నవారు వాల్నట్స్ చాలా పరిమితంగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ రక్తాన్ని పలుచగా చేస్తాయి. రక్తం గడ్డకట్టే సమస్యలు లేదా రక్తస్రావం లోపాలు ఉన్నవారు వాల్నట్స్ తినకుండా ఉండాలి. ఎందుకంటే రక్తస్రావం రుగ్మతల ప్రమాదాన్ని పెంచుతాయి. ఇక, శస్త్రచికిత్స చేయించుకోబోయే వ్యక్తులు కనీసం రెండు వారాల ముందుగానే వాల్నట్స్ తినడం మానేయాలి. వాల్‌నట్స్ రక్తాన్ని పలుచగా చేస్తాయి.. దీంతో శస్త్రచికిత్స సమయంలో అధిక రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది.
వాల్‌నట్స్ ఎవరు తీసుకోవచ్చు
వాల్‌నట్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులతోపాటు కేలరీలు కూడా ఎక్కువగానే ఉంటాయి. బరువు పెరగాలనుకునేవారు వీటిని ఎలాంటి సంకోచం లేకుండా తీసుకోవచ్చు. మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు వాల్‌నట్స్ తీసుకోకుంటే మంచిది. ఎందుకంటే వాల్‌నట్స్‌లో ఉండే ఆక్సలేట్స్ మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని మరింత పెంచుతాయి.
వాల్‌నట్స్ తక్కువ తీసుకుంటేనే మేలు
వాల్‌నట్స్ రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయ పడతాయి. కానీ, ఎక్కువ తినడం వల్ల కేలరీలు ఓవర్ లోడ్ అయి బరువు పెరిగే అవకాశం ఉంది. అందుకే వాల్‌నట్స్ అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. ఇతర సమస్యలు ఎదుర్కొంటున్నవారు మాత్రం వాటిని తక్కువ పరిమాణంలోనే తీసుకోవాలి.
