AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: గుండె నాళాలపై కరోనా పంజా.. ఆయువుపట్టు మీద మహమ్మారి ఎఫెక్ట్ !

COVID-19: కరోనా వైరస్‌.. గుండెలోని సూక్ష్మ రక్తనాళాలను ఇన్ఫెక్ట్‌ చేయకుండానే వాటిని తీవ్రంగా దెబ్బతీస్తుందని యూకేలోని యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిస్టల్‌ పరిశోధకుల బృందం అధ్యయనంలో తేలింది.

Coronavirus: గుండె నాళాలపై కరోనా పంజా.. ఆయువుపట్టు మీద మహమ్మారి ఎఫెక్ట్ !
Coronavirus and Heart Disease
Ram Naramaneni
|

Updated on: Feb 24, 2022 | 8:23 AM

Share

Heart Damage: కరోనా నుంచి కోలుకున్నామని సంబరపడుతున్నారా? కావాల్సినంత ఇమ్యూనిటీ(Immunity) ఉందని పండుగ చేసుకుంటున్నారా? కరోనా మళ్లొస్తే చూసుకోవొచ్చులే అని రెచ్చిపోతున్నారా? అటువంటి పప్పులేవీ ఉడకవంటుంది మహమ్మారి. కోలుకున్నా కూడా మీ ఆయువుపట్టు మీద దెబ్బేస్తానంటుంది. గుండెను పిండి పిప్పిచేస్తానంటుంది. యస్‌.. కరోనా బాధితులు ఇప్పుడు సైడ్‌ ఎఫెక్ట్స్‌(Side Effects)తో సతమతం అవుతున్నారు. వైద్య నిపుణుల హెచ్చరికలతో నిజంగానే గుండె గుబేల్‌మంటుంది. అవును మీరు వింటున్నది నిజమే.. ఇప్పుడు కొత్తగా కరోనా మహమ్మారి మరో ముప్పు తెచ్చిపెట్టింది. రక్తాన్ని చిక్కబడేలా చేసే గుణం కరోనా వైరస్‌కు ఉండడంతో.. బ్లడ్ క్లాట్స్ ఏర్పడి.. బ్లడ్ సర్క్యులేషన్ అదుపుతప్పుతోంది. పూర్తి ఫిట్‌గా ఉన్నా.. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు కదా అని.. హ్యాపీగా ఉండటానికి లేదు. ఉరుకులు.. పరుగుల జీవితంలో ప్రమాదం ఎప్పుడు ఎలా పొంచి ఉందో అర్ధం కావడం లేదు. ఎందుకంటే పూర్తి ఆరోగ్యంగా ఉన్న వాళ్లు కూడా క్షణాల్లో కింద పడిపోతున్నారు. నిముషాల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారు.

కరోనా వైరస్‌.. గుండెలోని సూక్ష్మ రక్తనాళాలను ఇన్ఫెక్ట్‌ చేయకుండానే వాటిని తీవ్రంగా దెబ్బతీస్తుందని యూకేలోని యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిస్టల్‌ పరిశోధకుల బృందం అధ్యయనంలో తేలింది. తమ పరిశోధనలో భాగంగా.. గుండెలోని సూక్ష్మ రక్తనాళాలను కప్పి ఉంచే పెరిసైట్స్‌పైకి కరోనా వేరియంట్లన్నింటినీ ప్రయోగించారు. కానీ, అవేవీ పెరిసైట్స్‌ను ఇన్ఫెక్ట్‌ చేయలేకపోయాయి. అయితే.. కేవలం స్పైక్‌ ప్రొటీన్లను ప్రయోగించినప్పుడు మాత్రం.. ఆ ప్రొటీన్లు ఎండోథీలియల్‌ కణాలతో సంభాషించకుండా పెరిసైట్లను నియంత్రించడమే కాక, వాపును కలిగించే సైటోకైన్లను స్రవించేలా చేసినట్లు పరిశోధకులు గుర్తించారు. కరోనా సోకిన రోగుల్లో ఉండే స్పైక్‌ ప్రొటీన్లు, మొత్తం రక్తప్రసరణ వ్యవస్థ అంతా ప్రయాణిస్తూ అన్ని అవయవాలనూ దెబ్బతీసే అవకాశం ఉందని పేర్కొన్నారు. గుండెకు రక్తం అందించే రక్తనాళాల్లో చెప్పుకోదగ్గ బ్లాక్స్‌ లేకపోయినా.. కొవ్వుకణాలతో ఏర్పడిన ‘ప్లాక్‌’పైన పగుళ్లు ఏర్పడినా రక్తం గడ్డకడుతోంది. ప్రొటీన్‌–సి, ప్రొటీన్‌–ఎస్ లాంటి లోపాలున్నవారిలో ఇలాంటి లక్షణాలు బయటపడుతున్నాయి. హోమోసిస్టిన్‌ అనే జీవరసాయనం రక్తంలో ఎక్కువగా ఉన్నవారిలోనూ ఈ క్లాట్‌ ఏర్పడే గుణం ఎక్కువ. చాలా మంది బాడీ ఫిట్‌గా ఉన్నా.. గుండెపోటు రావడానికి ఇదే ప్రధాన కారణం.

ఎంత ఫిట్‌గా ఉన్నప్పటికీ జన్యుపరమైన కారణాలతో గుండెపోటు తప్పదనేది వైద్యులు చెప్తున్న మాట. 21 – 40 ఏళ్ల మధ్య వారిలోనూ రక్తనాళాలు గట్టిబారడం ఇప్పుడు సర్వ సాధారణం. మహిళలతో పోలిస్తే.. జెంట్స్‌లో గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ. జంక్‌ఫుడ్‌ తీసుకోవడం వల్ల గుండెకు మేలు చేసే మంచి కొలెస్ట్రాల్‌ తగ్గి.. హాని చేకూర్చే చెడు కొలెస్ట్రాల్‌, చెడు కొవ్వులైన ట్రైగ్లిసరైడ్స్‌ పెరగడం.. పొట్ట దగ్గర కొవ్వు విపరీతంగా చేరడంతో వచ్చే సెంట్రల్‌ ఒబెసిటీ, స్ట్రెస్‌ కూడా సడెన్ స్ట్రోక్ తెచ్చేవే. చలికాలంలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందంటున్నారు డాక్టర్లు. చాలా అధ్యయనాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. చలి తీవ్రతతో గుండె ఇతర శరీర భాగాల్లో రక్తనాళాలు కుంచించుకుపోయి గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఉంది.

చలికాలంలో హృదయ సంబంధ వ్యాధులు పెరగడానికి రక్తపోటు పెరుగుదల ప్రధాన కారణం కావచ్చు. ధమనులు ఇరుకుగా ఉండడం వల్ల గుండెకు రక్తాన్ని సరఫరా చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. చల్లటి వాతావరణం పొగమంచు, కాలుష్య కారకాల నుండి ఛాతీ ఇన్ఫెక్షన్లు వస్తాయి. చలికాలం రక్త ప్రవాహంలో కొన్ని ప్రోటీన్ల స్థాయి పెరుగుతుంది. దీని వల్ల రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంది. బాడీ టెంపరేచర్.. అదుపుతప్పి గుండె పోటు వచ్చే అవకాశముంటుంది. చలికాలంలో గుండెపోటు, గుండె జబ్బుల బారిన పడే వాళ్లలో 65 ఏళ్లు పైబడిన వారు ఎక్కువగా ఉన్నారు. సరిగా తిననపోవడం, అర్థరాత్రి మేల్కోవడం, మందులు రెగ్యులర్‌గా వేసుకోకపోవడం, ఆల్కహాల్ కంజెమ్షన్, సిగరెట్ స్మోకింగ్‌తో గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా కరోనా నుంచి కోలుకున్న వారు గుండె విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు వైద్య నిపుణులు.

గమనిక :– అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

Also Read: లవంగాలతో దిమ్మతిరిగే ప్రయోజనాలు .. కనీసం మీ ఊహకు కూడా అందవు

తెల్ల వెంట్రుకలను పీకేస్తే… అవి రెట్టింపు అవుతాయంటారు.. ఇది వాస్తవమేనా…?