Heart: హార్ట్ అటాక్ తర్వాత గుండె సెల్ఫ్ రిపేర్ చేసుకుంటుందా? సంచలన విషయాలు కనుగొన్న సైంటిస్టులు
దశాబ్దాలుగా వైద్య రంగంలో ఒకే ఒక నమ్మకం బలంగా ఉండేది. అదేంటంటే.. ఒకసారి గుండె దెబ్బతింటే అది మళ్ళీ కోలుకోదు. గుండెపోటు వచ్చినప్పుడు చనిపోయిన గుండె కణాలు తిరిగి పుట్టవని, ఆ దెబ్బతిన్న భాగం శాశ్వతంగా మచ్చలా మిగిలిపోతుందని వైద్యులు చెబుతుంటారు.

అందుకే గుండె జబ్బులను నయం చేయడం కంటే, ఉన్న గుండెను ఎలా కాపాడుకోవాలో మాత్రమే ఇప్పటివరకు వైద్యులు సూచిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఈ పాత నమ్మకాన్ని తుడిచిపెట్టేలా ఒక సంచలన పరిశోధన వెలుగులోకి వచ్చింది. మన గుండెకు తనను తాను నయం చేసుకునే శక్తి ఉందని, చనిపోయిన కణాల స్థానంలో కొత్త కణాలు పుట్టే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆస్ట్రేలియాకు చెందిన నిపుణులు జరిపిన ఈ పరిశోధన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైద్యులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంతకీ ఆ గుండె రహస్యం ఏంటి?
ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల సంచలనం..
యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీ, బైర్డ్ ఇన్స్టిట్యూట్ మరియు రాయల్ ప్రిన్స్ ఆల్ఫ్రెడ్ హాస్పిటల్ నిపుణులు సంయుక్తంగా జరిపిన పరిశోధనలో ఒక అద్భుతమైన విషయం బయటపడింది. హార్ట్ ఎటాక్ వచ్చిన తర్వాత గుండె కండరాల కణాలు మళ్ళీ పుడతాయని వారు నిరూపించారు. డాక్టర్ రాబర్ట్ హ్యూమ్ నేతృత్వంలో జరిగిన ఈ అధ్యయనం ప్రకారం, గుండె దెబ్బతిన్నప్పుడు అక్కడ మచ్చలు ఏర్పడినప్పటికీ, ఆ అవయవం సహజంగానే కొత్త కండర కణాలను ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తుంది. దీనివల్ల గుండె జబ్బుల చికిత్సలో కొత్త పుంతలు తొక్కే అవకాశం ఏర్పడింది.
సాధారణంగా లివర్ (కాలేయం) వంటి అవయవాలకు ఉన్నంతగా గుండెకు కణాలను పునరుత్పత్తి చేసే సామర్థ్యం ఉండదు. కానీ ఈ తాజా అధ్యయనం ప్రకారం, ‘మిటోసిస్’ అనే కణ విభజన ప్రక్రియ ద్వారా గుండె తన కణాలను మళ్ళీ పుట్టించుకోవడానికి ప్రయత్నిస్తుందని తేలింది. అయితే ప్రస్తుతానికి ఈ ప్రక్రియ చాలా స్వల్పంగా జరుగుతోంది. దీనిని వైద్య చికిత్సల ద్వారా పెంచగలిగితే, దెబ్బతిన్న గుండెను పూర్తిగా పునర్నిర్మించడం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
నిపుణుల విశ్లేషణ..
ఈ పరిశోధనపై భారతీయ ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ బల్బీర్ సింగ్ స్పందిస్తూ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. “గత మూడు దశాబ్దాలుగా స్టెమ్ సెల్స్ ఉపయోగించి గుండెను బాగు చేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి, కానీ ఆశించిన ఫలితం రాలేదు. అయితే గుండె కణాలు సహజంగానే మిటోసిస్ ద్వారా మళ్ళీ పుడతాయనే ఈ తాజా అధ్యయనంలో కనుగొనడం చాలా పెద్ద విషయం. ఈ సహజ సామర్థ్యాన్ని పెంచే చికిత్సలు అందుబాటులోకి వస్తే, ఎండ్ స్టేజ్ హార్ట్ డిసీజ్ (చివరి దశ గుండె జబ్బులు) ఉన్న రోగులకు ఇది పునర్జన్మ వంటిది” అని ఆయన పేర్కొన్నారు.
మనం సినిమాలకు వందల కోట్లు ఖర్చు చేయడం చూస్తుంటాం. కానీ ఈ పరిశోధన సక్సెస్ అయితే వైద్య రంగంలో అది వేల కోట్ల విలువైన ఆస్తితో సమానం. గుండెపోటు వచ్చినప్పుడు పంపింగ్ సామర్థ్యం తగ్గిన వారికి కొత్త కణాల ఉత్పత్తి ద్వారా ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చు. ప్రస్తుతం ఈ పరిశోధన ప్రాథమిక దశలోనే ఉన్నప్పటికీ, భవిష్యత్తులో హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ (గుండె మార్పిడి) అవసరం లేకుండానే ఇంజెక్షన్లు లేదా మందుల ద్వారా గుండెను సరిచేసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా నేడు గుండెపోటు ఎందరో ప్రాణాలను బలి తీసుకుంటోంది. ఇటువంటి తరుణంలో గుండె కణాలు మళ్ళీ పుడతాయనే ఈ వార్త అందరికీ ఎంతో ఊరటనిస్తోంది.
